Saturday, April 27, 2024

మరోసారి ఆహ్వానిస్తున్నా.. చర్చలకు రండి

- Advertisement -
- Advertisement -

Govt is committed to the welfare of Farmers:Modi

 

రాజ్యసభ నుంచి రైతులకు ప్రధాని పిలుపు
మద్దతు ధర కొనసాగుతుంది, మండీలను మరింత ఆధునికం చేస్తాం, ప్రభుత్వ సేకరణ వ్యవస్థ ఉంటుంది
ప్రతిపక్షాలు అప్పుడు సంస్కరణలకు అనుకూలం, ఇప్పుడు వ్యతిరేకమా, మన్మోహన్ మాటలకైనా గౌరవం ఇవ్వండి
ఆందోళనలో వృద్ధులను కూర్చోబెట్టడం మంచిది కాదు
రైతులను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ : రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న అన్నదాతలు ఇకనైనా వాటికి స్వస్తి పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు వ్యవసాయ రంగంలో సంస్కరణలకు అనుకూలమన్న ప్రతిపక్షాలు ఇప్పుడెందుకు యూ టర్న్ తీసుకున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో సోమవారంనాడు ప్రధాని మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారు సంస్కరణలను అర్థం చేసుకోవాలని, వాటిపై ఏమైనా అభ్యంతరాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం రండి అని ప్రధాని ప్రతిపాదించారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికి మార్గనిర్దేశనం చేసేదిగా ఉందని అభివర్ణించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇదే సభలో ఉన్నారని, ఈ సందర్భంగా గతంలో ఆయన చెప్పిన మాటలు మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు స్వేచ్ఛాయుత మార్కెట్ అవకాశాలు కల్పించాలని మన్మోహన్ జీ పదేపదే చెబుతుండే వారని, తన మాటలను కాకపోయినా ఆయన మాటలకైనా గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోడీ చురకలంటించారు.

మన్మోహన్ జీ అనుకున్నది మీరు కాకపోయినా మేం చేస్తున్నందుకు గర్వపడాలని హితవుపలికారు. రైతుల పండించే పంటల మద్దతు ధర(ఎంఎస్‌పి)కు ఎలాంటి ఢోకా ఉండదని మోడీ పునరుద్ఘాటించారు. ఎంఎస్‌పి ఎప్పటికీ ఉంటుందని, కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయినా రైతుల ఆందోళన దేనికన్నదే అర్థం కావడం లేదని, కొత్త చట్టాల్లో ఉన్న అభ్యంతరాలు ఇవీ అని ఇప్పటికీ వాటిని వ్యతిరేకిస్తున్న ఎవరూ చెప్పలేకపోతున్నారని ప్రధాని అనారు. సిక్కులు ఈ దేశానికి ఎంతో చేశారని, ఇంకా చేస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. అలాంటి వారిని ఉద్దేశించి కొందరు అసభ్యంగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. వాళ్ల భాషను, వాళ్ల ప్రతిష్టను దిగర్చడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. ఆందోళనల్లో కొన్ని విధ్వంసకర శక్తులు ప్రవేశించాయని మోడీ ఆక్షేపించారు. ‘దేశంలోకి ప్రస్తుతం ఆందోళన్ జీవి అనే కొత్త రకం వైరస్ ప్రవేశించింది. అది దేశంలో ఎక్కడైనా ఆందోళన చేపడుతున్నారని తెలిస్తే చాలు.. అక్కడికి వెళ్లి దాన్ని మరి కాస్త పెద్దది చేసే ప్రయత్నం చేస్తుంది. ఆందోళన అనేది వారి జీవితాల్లో ఓ భాగం అయ్యింది. అలాంటి వారిని గుర్తించి వాళ్ల నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది’ అన్నారు.

వాళ్లనైనా ఇళ్లకు పంపించండి

పోరాటాలు చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని, అయితే జరుగుతున్న తీరే బాధిస్తోందన్నారు. ఆందోళనల్లో వృద్ధులను కూడా కూర్చోబెడుతున్నారని, వాళ్లను వీలైనంత త్వరగా ఇంటికి చేర్చండని ప్రధాని సూచించారు.ఈ చట్టసభ వేదికగా రైతులను తాను మరోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నానన్నారు. సంస్కరణలు దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికే కానీ, వెనక్కి తీసుకెళ్లడం తమ ఉద్దేశం కాదన్నారు. ‘నేను హామీఇస్తున్నా. మండీలను మరింత ఆధునీకరిస్తాం. ఇదొక్కటే కాదు ఎంఎస్‌పి కూడా ఉంటుంది. 80 కోట్ల మందికి అత్యంత తక్కువ ఖర్చుతో ఆహార ధాన్యాలు అందించాలన్నదే లక్షం. అది కొనసాగాలి. తప్పుడు ప్రచారాలను నమ్మకండి, దాన్ని విస్తరింపచేయకండి. రైతుల ఆదాయాన్ని మరింత పటిష్టం చేసేందుకే మా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఇప్పుడిప్పుడే నూతన విదేశీ విధ్వంసక సిద్ధాంతాలు(ఫారెన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ) బయలుదేరాయని, వాటిని ఏ మాత్రం విశ్వసించరాదని అన్నారు. వాటిపట్ల యావద్దేశం అప్రమత్తంగా ఉండాలని ఇటీవల రైతులకు మద్దతు ప్రకటిస్తూ ప్రముఖ విదేశీ సెలెబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులను ఉద్దేశించి ప్రధాని దుయ్యబట్టారు.

కరోనా విజయం అందరిది…

కంటికి కనిపించని కరోనా మహమ్మారితో మనమంతా కలిసి పోరాటం చేస్తున్నామని, ఇందులో ఏ ఒక్కరిదీ విజయం కాదన్నారు. ప్రజలందరు సమష్టిగా కరోనాపై విజయం సాధించామన్నారు. దేశం నుంచి వ్యాక్సిన్‌లు తయారు చేసి ఇక్కడి ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాటిని సరఫరా చేస్తున్నామని ప్రధాని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం సాగుతోందని, అందులో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తద్వారా భారత్ బలమేంటో యావత్ ప్రపంచానికి తెలిసివచ్చిందన్నారు. మానవాళి రక్షణకు భారత్ పాత్ర ఏంతో ఉందని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News