Sunday, May 5, 2024

గుర్రంపోడు భూములు నిర్వాసితులకే?

- Advertisement -
- Advertisement -

Gurram Podu lands belong to the Tribes

 

కొలిక్కివచ్చిన ‘గుర్రంపోడు’ భూముల వ్యవహారం
గిరిజనులకే పట్టాలిచ్చేందుకు అధికారుల సన్నద్దం
సర్వే నివేదిక ఆధారంగా యంత్రాంగం సుముఖం
తెరపడనున్న సర్వే నెంబర్ 540 భూముల వివాదం

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: సుదీర్ఘకాలంగా వివాదాస్పదంగా ఉన్న మఠంపల్లి మండలం గుర్రంబోడు భూముల వ్యవహారం కొలిక్కివచ్చింది. భూములన్నీ నిర్వాసితులకే చెందినవని అధికార యంత్రాంగం తేల్చేసింది. సంచలనాలకు మారుపేరుగా నిలిచిన ఈ భూముల వ్యవహారం యావత్తు క్లిష్టతరమైన నేపధ్యంలో తాజాగా సూర్యాపేట జిల్లా యంత్రాంగం నుంచి అందిన అనధికార సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా తయారైన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు 540సర్వే నెంబర్‌లోని 6700 ఎకరాల ప్రభుత్వం భూముల వ్యవహారం తుదిదశకు చేరుకుంది. దాదాపు నాలుగైదు మాసాలుగా భూములకు సంబందించి సమగ్ర సర్వే జరిపిన అనంతరం అధికార యంత్రాంగాలు రూపొందించిన నివేదిక ఆధారంగా సూర్యాపేట జిల్లా పరిపాలనాధికారి సాగుచేసుకుంటున్న గిరిజనులకే పట్టాలిచ్చేందుకు తుదినిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే ప్రభుత్వం నిర్ణయం మేరకు నకిలీ పట్టాలను రద్దు చేసి అర్హులకు పట్టాలిచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఓ కంపెనీకి చెందిన భూములుగా నకిలీ పట్టాలతో చలామనీ అవుతున్న సదరు భూములు సర్వే అనంతరం పూర్తిగా అవి సాగుచేసుకుంటున్న వారికే చెందుతాయని అధికారులు తేల్చేయడంతో నాగార్జునసాగర్ ముంపులో భూములు కోల్పోయిన వారికి సంబందించి భూముల్లో దాదాపు 500 ఎకరాల వరకు అన్యాక్రాంతమైనట్లు సమగ్ర సర్వేలో తేటతెల్లంకావడంతో సదరు ప్రైవేటు కంపెనీ ఆధీనంలోని భూముల పట్టాలన్ని రద్దు చేయడం ద్వారా సాగుచేసుకుంటున్న గిరిజనులకే పట్టాలివ్వాలని కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి యంత్రాంగాలన్ని ముక్తకంఠంతో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలియవచ్చింది.

దీంతో మఠంపల్లి మండలం గుర్రంబోడు సర్వే నెంబర్ 540 లోని భూముల వివాదానికి తెరపడనుంది. సర్వేతో ఏళ్ళనాటి సమస్యకు పరిష్కారం…గుర్రంబోడు భూములకు సంబందించి సరైన సమాచారం కొరవడడంతోనే సమస్యకు దారితీసింది. నాగార్జునసాగర్ ముంపు కింది భూములు కోల్పోయిన నిర్వాసితుల భూములకు సంబందించి ఎవరెక్కడ ఉన్నారో, ఎవరెవరి పేరు మీదో భూములు ఉన్నప్పటికీ స్థానికంగా గిరిజనులు మాత్రం సాగు చేసుకుంటున్నారు. దీంతో దాదాపు నాలుగైదు నెలల పాటు సాగిన సమగ్ర సర్వే ఆధారంగా రూపొందించిన నివేదికలోని ఆంశాల వారిగా విచారణ జరిపిన సూర్యాపేట జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు ప్రైవేటు కంపెనీకి చెందిన పట్టాలను రద్దు చేయడం ద్వారా గిరిజనులకే పట్టాలివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.

బాధ్యులపై చర్యలతో కదలిక

గుర్రంబోడు భూములకు సంబందించి క్షేత్రస్థాయిలో ఉన్న భూములకు రెట్టింపు స్థాయిలో పట్టాలివ్వడం ద్వారా బాధ్యులైన ముగ్గురు తహశీల్దార్‌లు, విఆర్‌వోలను ఐదుమాసాల క్రితమే సూర్యాపేట పరిపాలనాధికారి వినయ్‌కృష్ణారెడ్డి తక్షణ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఆ మధ్యలోనే గిరిజనులకు, ప్రైవేటు కంపెనీ మధ్య జరిగిన వివాదం కాస్తా ముదిరిపాకానపడడంతో జిల్లాస్థాయి అధికారులు కల్గజేసుకొని సమగ్ర సర్వేకు ఉపక్రమించారు. దీంతో ఎట్టకేలకు అనేక వివాదాల నడుమ సమగ్ర సర్వే తద్వారా సిద్దమైన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా యంత్రాంగాలు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రైవేటు కంపెనీ పట్టాలను రద్దే చేయడం ద్వారా సాగు చేసుకుంటున్న గిరిజనులందరికి పట్టాలిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలియడంతో గుర్రంబోడు, కృష్ణా తండాలకు చెందిన గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయమే తరువాయిగా కంపెనీ పేరిట ఉన్న పట్టాలు రద్దు చేయడం, గిరిజనులకు పట్టాలివ్వడం తదితర కార్యకలాపాలన్ని చకాచకా జరిగిపోతాయని నిర్వాసితులు నమ్ముతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News