Saturday, April 27, 2024

మండలి చైర్మన్ పదవికి గుత్తా ఎన్నిక లాంఛనమే

- Advertisement -
- Advertisement -

Gutta Sukhender Reddy elected to council chairman

 

మన తెలంగాణ/హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ పదవికి టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం ఉదయం 10.40 నిమిషాలకు శాసనసభ సచివాలయంలోని సెక్రటరీ ఛాంబర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, విప్ గొంగిడి సునీత, ఎంఎల్‌సిలు భానుప్రసాద్‌రావు, దామోదర్‌రెడ్డి, గంగాధర్ గౌడ్, ఎగ్గే మల్లేశం, రఘోత్తమరెడ్డి, జనార్థన్‌రెడ్డి, దండే విఠల్, నవీన్‌కుమార్, బస్వరాజ్ సారయ్య, బండి ప్రకాష్, శేరి శుభాష్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎంఎల్‌ఎలు భాస్కర్‌రావు, భూపాల్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మెతుకు ఆనంద్, మల్లయ్య యాదవ్, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుత్తా ఎన్నిక లాంఛనమే కానుంది.

గతంలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా ఆయన పనిచేశారు. మండలి చైర్మన్‌గా రెండోసారి అవకాశం ఇచ్చిన సిఎం కెసిఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ పదవి ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో మాదిరిగా మండలిని హుందాతనంగా నడిపేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎంఎల్‌ఎ కోటా నుంచి శాసనమండలికి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంఎల్‌సిగా రెండోసారి ఎన్నికయ్యారు. 2019 సెప్టెంబర్ 11వ తేదీన తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో కూడా ఒక్క నామినేషన్ దాఖలైంది. దీంతో సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఏడాది నవంబర్ మాసంలో ఆరుగురు ఎంఎల్‌సిలను కెసిఆర్ ఫైనల్ చేశారు. గతేడాది జూన్ మాసంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీకాలం ముగిసింది.

దీంతో గతేడాది నవంబర్‌లో కెసిఆర్.. సుఖేందర్‌రెడ్డికి మరోసారి ఎంఎల్‌సిగా అవకాశం కల్పించారు. సుఖేందర్‌రెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో ప్రొటెం చైర్మన్‌గా మెదక్ జిల్లాకు చెందిన ఎంఎల్‌సి భూపాల్‌రెడ్డిని నియమించారు. అయితే భూపాల్‌రెడ్డి పదవీకాలం కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడు అమీనుల్ హసన్ జాఫ్రీ మండలి ప్రొటెం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలిలోని ఖాళీలన్నీ భర్తీ కావడంతో తాజాగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రకటన వెలువడింది. కొత్త చైర్మన్ ఎంపికకు సంబంధించి గవర్నర్‌కు సమాచారం ఇచ్చిన మండలి అధికారులు నూతన చైర్మన్ ఎంపికకు సంబంధించి అనుమతి తీసుకున్నారు. అయితే, అధికార పార్టీకి మండలిలో మెజార్టీ ఉంది. శనివారం నాడు ఎంఐఎం చీప్ అసదుద్దీన్ ఓవైసీ ప్రగతిభవన్‌లో మంత్రి కెటిఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ విషయమై చర్చించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరోసారి ఎంఎల్‌సి అవకాశం ఇవ్వడంతో మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ కూడా జరిగింది. అయితే శాసనమండలి చైర్మన్ పదవికి సుఖేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయటంతో ఆయనకు కేబినెట్‌లో ఛాన్స్ లేదని తేలిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపిగా ఉంటూ సుఖేందర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. తన అనుచరులతో కలిసి ఆయన టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. దీంతో ఆయనకు ఎంఎల్‌సిగా కెసిఆర్ అవకాశం ఇచ్చారు.

రాజకీయ నేపథ్యమిది…

నల్లగొండ జిల్లా ఊరుమడ్ల గ్రామంలో 1954, ఫిబ్రవరి 2న జన్మించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1977, మే 1న అరుంధతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని కమ్యూనిస్టు పార్టీ నుంచి ప్రారంభించారు. కమ్యూనిస్టు పార్టీలో చురుకుగా పనిచేసిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరపున నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అదే నియోజకవర్గం నుంచి మళ్లీ ఎంపిగా విజయం సాధించారు. 2014లోనూ జనరల్ ఎలక్షన్స్‌లో ఎంపిగా విజయం సాధించి.. 2016 జూన్ 15న టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018లో గుత్తాను సిఎం కెసిఆర్ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియ మించారు. 2019, ఆగస్టులో ఎంఎల్‌ఎ కోటాలో తొలిసారిగా మండలికి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019, సెప్టెంబర్ 11న మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021, జూన్ 3న గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీకాలం ముగిసింది. 2021, నవంబర్‌లో జరిగిన ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో మరోసారి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంఎల్‌సిగా ఎన్నిక య్యారు. ఈ నేపథ్యంలో రెండోసారి ఆయనను మండలి చైర్మన్ పదవి వరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News