Monday, April 29, 2024

తాలిబన్ల సర్కార్ సారథి.. ముల్లా హసన్ అఖుంద్

- Advertisement -
- Advertisement -
Hasan Akhund to lead new Taliban govt
ఉప ప్రధానులుగా బరాదర్, హనాఫీ
మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన

కాబూల్ : అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుపై కొద్ది రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. తాలిబన్లు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాత్కాలిక పధానిగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారు చేశారు. ఉప ప్రధానులుగా తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్, అఫ్ఘన్‌ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన మౌలావి హనాఫీని ఉప ప్రధానులుగా నియమించారు. హక్కానీ నెట్‌వర్క్ అధినేత సిరాజుద్దీన్ హక్కానీకి అంతర్గత వ్యవహారాల శాఖ అప్పగించారు. మరోవైపు తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా మహ్మద్ ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్‌కు రక్షణ శాఖ కట్టబెట్టారు. ఈ మేరకు మంగళవారంనాడిక్కడ తాలిబన్ల ప్రధాన అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మీడియాకు వెల్లడించారు.

తాము ప్రకటిస్తున్నది మధ్యంతర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని నియామకాలు ఉంటాయని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం ఎంత కాలం పనిచేస్తుంది అన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టంగా తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా మంత్రివర్గంలో తాలిబన్లకే పెద్దపీట వేశారు. హక్కానీకి ప్రభుత్వంలో చోటు కల్పిస్తే తాలిబన్లతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే చేసిన హెచ్చరికను తాలిబన్లు పెడచెవిన పెట్టడమే కాకుండా ఆయనకే కీలకమైన హోంశాఖను కట్టబెట్టారు. రెండు దశాబ్దాలుగా అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తాలిబన్లలో కీలక పాత్ర పోషించిన వారికి ప్రభుత్వంలో స్థానం కల్పించారు.

ఉప ప్రధానిగా నియమితుడైన ముల్లా బరాదర్ అఫ్ఘన్ నుంచి అమెరికా సేనలు వైదొలిగే తుది ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు తాలిబాన్ల అత్యున్నత నిర్ణ్ణాయక మండలి అయిన ‘రెహబరీ షురా’ అఖుంద్ పేరు నాయకత్వానికి ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నదని పాక్ మీడియా పేర్కొంది. ముల్లా హసన్ ప్రస్తుతం ‘రెహబరీ షురా’ కమిటీకి అధినేతగా కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం కాందహార్‌లో ఉంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ బాధ్యతల్లో ఉన్నారు. 1996లో ఏర్పడ్డ తాలిబాన్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News