Friday, April 26, 2024

వామ్మో మళ్లీ వర్షం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఇప్పుడిప్పుడే భారీ వర్షం వరదల నుంచి కోలుకుంటున్న భాగ్యనగరంలో మళ్లీ వరుణుడు ప్రతాపం కనబరుస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి కోలుకోకముందే నగరంలో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపైకి మోకాలి లోతు నీరు చేరింది. వివిధ కార్యాలయాల నుంచి తమ తమ గమ్యస్థానాలకు చేరుకునే ఉద్యోగులు తడుస్తూనే ఇళ్లకు వెళ్తున్నారు. నాలాలు పొంగాయి. రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇప్పటికే వరదలో ఉన్న ప్రాంతాల్లో వరద మరింత పెరిగింది. ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, బిఎన్‌రెడ్డి నగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు విజయవాడ రహదారిపై వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. చింతలకుంట, పనామా కూడలి, నాగోల్ రోడ్డు వద్ద వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తార్నాక, నాచారం లాల్‌పేట, ఓయూ క్యాంపస్, మల్లాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాచారం భవానీనగర్‌లో భారీ వర్షానికి రోడ్డు నదిని తలపిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కోఠి, రాంకోఠి, కింగ్‌కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, ఆబిడ్స్, సైఫాబాద్, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, లిబర్టీ, నారాయణగూడా, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాలలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయ మయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా గోల్నాక కొత్తవంతెనపై భారీగా వాహనాలు నిలిచాయి. ట్రాఫిక్ పోలీసులు మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలను నిషేధించారు. వంతెనపై నుంచి వాహనాల దారి మళ్లింపుతో రద్దీ పెరిగింది.

ఉప్పల్‌లో వరంగల్ జాతీయరహదారిపై వరదనీరు వచ్చి చేరింది. వరద కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా మల్లాపూర్‌క డివిజన్‌లోని బ్రహ్మపురి కాలనీ, గ్రీన్‌హిల్స్ కాలనీ, మర్రిగూడ కాలనీ వీధులు జలమయమయ్యాయి. శంషాబాద్‌మల్కాజ్‌గిరిలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షాల వల్ల టోలిచౌక్‌బృందావన్ కాలనీ, షేక్‌పేట రోడ్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పాతబస్తీ బాబానగర్‌లో నీరు భారీగా పారుతోంది. బాలాపూర్ చెరువు నీళ్లతో వీధులన్నీ జలమయమయ్యాయి. చైతన్యపురి కమలానగర్ రోడ్డు నెంబర్ 5లో భారీ వర్షానికి వరద ఒక్కసారిగా పూర్తిస్థాయిలో రావడంతో వరదలో కొట్టుకుపోతున్న నలుగురిని స్థానిక ఫ్రిజ్ మెకానిక్ జింక్ నరేష్ సహాయంతో కాలనీ వాసులు కాపాడారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గుర్తు తెలి యని వ్యక్తి మలక్‌పేట యశోదా ఆసుపత్రి వెనుక పోచమ్మ దేవాలయం దగ్గర విద్యుత్ స్తంభం పట్టుకోవడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

వరదతో ట్రాఫిక్ జామ్.. ఈతకొట్టుకుంటూ వెళ్లిన వ్యక్తి
శనివారం సాయంత్రం మళ్లీ ఎడతెరపి లేకుండా ఎల్బీనగర్‌లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎల్బీనగర్-చింతలకుంట మధ్య జాతీయరహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలపై వెళ్లడం సాధ్యం కాదనుకున్న వ్యక్తి ఈత కొట్టుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యా లను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఒక గంటలో వర్షపాతం నమోదు ఇలా…
ఒక గంటలో ఘట్‌కేసరిలో 13 సెంటీమీటర్లు, ఉప్పల్‌లో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఎల్బీనగర్‌లో 7సెంమీ, గడ్డి అన్నారంలో 9 సెంమీ, సరూర్‌నగర్‌లో 9 సెంమీ, హయత్‌నగర్‌లో 9 సెంటిమీటర్ల, రాజేంద్రనగర్‌లో 4.8 సెంమీల వర్షపాతం నమోదయింది. నగర శివారు ప్రాంతాలైన శంషాబాద్, మల్కాజిగిరిలో ఉరుములతో కూడిన వర్షం పడింది. మెహిదీపట్నం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, లంగర్‌హౌజ్, మెహిదీపట్నం మీదుగా దారి మళ్లిస్తున్నారు.
అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ.. రంగంలోకి అత్యవసర బృందాలు…
లోతట్టు ప్రాంతాలలో వరద నీరు చేరడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. అత్యవసర బృందాలను గ్రేటర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ అప్రమత్తం చేశారు. నగరంలో నీరు నిల్వ అయ్యే ప్రాంతాలకు ఇప్పటికే సిబ్బందిని పంపించారు. రహదారులపై నీటిని తొలగించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాలు క్రమంగా కోలుకుంటున్నాయి. మళ్లీ వర్షం పడుతుండటంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది.
మేడ్చల్ జిల్లాను వర్షం మళ్లీ కుదిపేసింది…
మేడ్చల్ జిల్లాను వర్షం మళ్లీ కుదిపేసింది. మల్కాజ్‌గిరి, నేరెడ్‌మెట్, కుషాయిగూడ, చర్లపల్లి, దమ్మాయిగూడ, జవహర్‌నగర్, నాచారం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నాలాలు పొంగి రోడ్లపై ప్రవహించడం వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయమేర్పడింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా టోల్‌ఫ్రీ నెంబర్ కానీ.. 100కు డయల్ చేయాలని ప్రజలకు అధికారులు సూచించారు.
ఐదు రోజులుగా జలదిగ్భంధంలోనే ఉమామహేశ్వర కాలనీ
హైదరాబాద్ కొంపల్లి సమీపంలోని ఉమామహేశ్వర కాలనీ ఐదు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. 20 అడుగుల ఎత్తులో నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద సమయంలో కట్టుబట్టలతో వెళ్లిన వారు వంట పాత్రల కోసం తిరిగి వస్తున్నారు. తాజాగా కురిసిన భారీ వర్షం వారిని మరింత ఇబ్బందుల పాల్జేసింది.
అధికారులకు సవాల్‌గా మారిన ఫాక్స్ సాగర్ చెరువు సమస్య
హైదరాబాద్ జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు సమస్య అధికారులకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందాన మారింది. 20 ఏళ్ల తర్వాత నిండిన చెరువు పలు కాలనీలను నీట ముంచింది. చెరువు తూము తెరిచి నీటిని వదిలితే దిగువ ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదముంది. వీటిని వదిలితే ఎగువ ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుంటున్నాయి. మళ్లీ వరుణుడు దంచికొడుతుండటంతో మరింత ముప్పు పొంచి ఉండటంతో సమీప ప్రాంత ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు.
కూలిన గోల్కొండ కోట గోడ..
ఎడతెరపి లేకుండా కురిసిన వాన ప్రభావం చారిత్రాత్మక గొల్కొండ కోటపైనా పడింది. భాగ్యనగరంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోల్కొండ కోటలోని ఓ గోడ నేలమట్టమైంది. శ్రీజగదాంబికా అమ్మవారి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. పది నెలల క్రితమే ఈ గోడపైన ధ్వంసమైన బురుజులను పురావస్తు శాఖాధికారులు మరమ్మత్తులు చేయించారు. కానీ ప్రహరీగోడ కింది భాగంలో అప్పటికే పగుళ్లు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడంతో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ గోడ పూర్తిగా తడిసి కుప్పకూలిపోయింది. గోడ కూలిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇళ్ల సమీపంలో ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Heavy Rainfall in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News