Monday, May 6, 2024

అలర్ట్.. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Heavy Rains to Hit Telangana for next 3 days

రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణపై ద్రోణి ప్రభావం
సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో భారీగా కురిసిన వాన
రెండు గంటల్లో 100 మి.మీల వర్షపాతం నమోదు
అధికంగా వికారాబాద్‌లో 14 సెంటీమీటర్లు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. మంగళవారం కూడా వర్షం జోరు కొనసాగడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో సోమవారం అర్ధరాత్రి రెండు గంటల పాటు వాన దంచికొట్టింది. ఆ రెండు గంటల్లోనే 100 మి.మీల వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లోతో పాటు జీహెచ్‌ఎంసి పరిధిలో భారీ వర్షం కురిసింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో సుమారుగా10 సెం.మీ.
ఏకధాటిగా కురిసిన వర్షాలకు వికారాబాద్‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మద్గుల్ చిట్టెంపల్లిలో 12.4. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 13.3, కందవాడలో 8.4, మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాలలో 6.9, నిజామాబాద్ జిల్లా మప్కల్ 6.2, జనగామ జిల్లా జఫర్‌ఘడ్‌లో 5.1, నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో 5.8, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 5.5, ములుగులో 6.7, సూర్యాపేటలో 6.5, భద్రాద్రి కొత్తగూడెంలో 6.2, హయత్‌నగర్ 9.2, హస్తినాపురం సౌత్‌లో 8.8 సెంటీమీటర్లు, అంబర్‌పేటలో 8.2 సెంటీమీటర్లు సైదాబాద్‌లో 8.0 సెంటీమీటర్లు, బహదూర్‌పురాలో 7.8, చార్మినార్‌లో 7.5, హైదరాబాద్‌లో 11, రంగారెడ్డిలో 9.5, మేడ్చల్ మల్కాజిగిరిలో 9.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతుండగా తాండూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో సుమారుగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
కొట్టుకుపోయిన వాహనాలు
నగరంలోని యాకత్‌పురా, మల్లేపల్లిలో వర్షానికి వాహనాలు కొట్టుకుపోయాయి. బేగంబజార్‌లోని ఇళ్లు, షాపుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రోడ్లపై మోకాలిలోతు నీటిలో వాహనాలు ఉండిపోయాయి. పలు చోట్ల సామగ్రి, నిత్యావసర వస్తువులు నీట మునిగాయి. నీటి ప్రవాహంలో పలుచోట్ల కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. మూసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సరూర్‌నగర్, కోదండరాం నగర్, పలు కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. మూసారంబాగ్ వంతెన పైనుంచి వరద ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. చార్మినార్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బార్కస్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, మలక్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, చంపాపేట్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు బయటకురాలేక నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
రేపు, ఎల్లుడి రాష్ట్రవ్యాప్తంగా
రేపు, ఎల్లుడి రాష్ట్రవ్యాప్తంగా తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. పలు జిల్లాలో ఏకధాటి వానకు చాలా ప్రాంతాల ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. రహదారులపైకి నీరు చేరడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి వాహనదారులు అవస్థలు పడ్డారు.
ఈనెల 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య భారీ వర్షాలు: ఐఎండి
ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. ఈనెల 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. జులై 26న తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Heavy Rains to Hit Telangana for next 3 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News