Thursday, May 9, 2024

హైకోర్టులో అవినాష్‌కు ఊరట

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మాజీ ఎంపి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపి అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ పిటీషన్‌పై తీర్పును వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 31వ తేదీ వరకు ఎంపి అవినాష్‌ను అరెస్టు చేయోద్దని సిబిఐని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్, ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై శుక్రవారం, శనివారం ఇరువర్గాల వాదనలు విన్నారు. శుక్రవారం ఎంపి అవినాష్ రెడ్డి,వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపించారు. శనివారం సిబిఐ తరఫున పబ్లిక్‌ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు.

ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ తరఫున వాదనలు వినిపించిన పిపి అనిల్ అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడంలేదని, అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని అన్నారు. దర్యాప్తును జాప్యం చేసి లబ్ధిపొందాలని చేస్తున్నారని అన్నారు. నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ఏదో కారణం చెప్పి విచారణ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. కోర్టుల్లో రకరకాల పిటీషన్లు వేసి కేసు దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు.

సామాన్యుల కేసుల్లోనూ దర్యాప్తు కోసం ఇంత సమయం తీసుకుంటారని అని సిబిఐ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. వివేకా హత్యకు ప్రధాన కారణమేమిటని ప్రశ్నించింది. రాజకీయ ఉద్దేశాలే వివేకానందరెడ్డి హత్యకు ప్రధాన కారణమని, హత్యకు నెల రోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైందని తెలిపారు. అవినాష్ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలు ఉన్నాయని, కడప ఎంపి టికెట్ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారని, వివేకాపై రాజకీయంగా పైచేయి సాధించాలని అవినాష్ భావించారని, వివేకా పోటీ చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనుక కుట్రదాగి ఉందని కోర్టుకు తెలిపారు.

విచారణకు సహకరించడంలేదు….
వివేకా హత్య కేసులో అరెస్టు చేసిన భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి విచారణకు సహకరించడంలేదని సిబిఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారని, వారి నుంచి ఏం తెలుసుకున్నారని ధర్మాసనం సిబిఐ న్యాయవాదిని ప్రశ్నించింది. శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి ద్వారా అవినాష్ హత్య కుట్రను అమలు చేశారని తెలిపారు. వివేకాపై కోపం ఉన్న వారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగి హత్య చేయించారని కోర్టుకు విన్నవించారు.

అవినాష్ రెడ్డి నుంచే నిందితులకు డబ్బులు వచ్చాయని, ఈ విషయం దస్తగిరి చెప్పాడని తెలిపారు. అవినాష్ డబ్బులు ఇస్తే శివశంకర్‌రెడ్డికి ఇస్తే, ఆయన గంగిరెడ్డికి ఇచ్చాడని, వివేకాను హత్య చేసేందుకు రూ.4కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం గంగిరెడ్డికి లేదని కోర్టుకు చెప్పారు. శివశంకర్ రెడ్డి చెప్పినట్లుగానే ఎంవి కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫిర్యాదులో రక్తపు మరకల విషయాన్ని ప్రస్తావించలేదని, శివశంకర్‌రెడ్డి అంటే సిఐ శంకరయ్యకు భయమని అందుకే అసలు స్థితిని నమోదు చేయలేదని తెలిపారు.
నత్తనడక దర్యాప్తు ఏందిః హైకోర్టు
వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు నత్తనడకన సాగుతోందని హైకోర్టు ప్రశ్నించింది. భారీ కుట్రలో అవినాష్ ప్రమేయం ఉందని సిబిఐ అనుమానిస్తోంది కదా అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారా అని ప్రశ్నించింది. అవినాష్ హత్య జరిగిన రోజు వాట్సాస్ కాల్ మాట్లాడారని చెబుతున్నారు కదా, ఎవరితో మాట్లాడారు, ఆ సమయంలో గంగిరెడ్డి కూడా వాట్సాప్ కాల్‌లో బిజీగా ఉన్నాడా అని ప్రశ్నించారు. వాట్సాప్ కాల్ మాట్లాడినట్లు తెలుస్తోందని, ఎవరితో మాట్లాడారో ఇంటర్నెట్ ద్వారా గుర్తించలేమని, ఎవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు అవినాష్‌ను విచారించాలని అనుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 12వ తేదీన అవినాష్‌రెడ్డి ఐపిడిఆర్(ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డు) డేటా సేకరించామని తెలిపారు.

తప్పుడు సమాచారం ఇచ్చిన అవినాష్‌ః సిబిఐ
హత్య జరిగిన రోజు అవినాష్ జమ్మలమడుగు వెళ్తున్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆ రోజుల జమ్మలమడుగులో ఆ రోజు అవినాష్ ఎన్నికల షెడ్యూల్ లేదని తెలిపారు. అవినాష్ రెడ్డి వల్ల సాక్షులు ముందుకు రావడంలేదని, తన అనుచరుల ద్వారా సాక్షులను బెదిరిస్తున్నాడని తెలిపారు. కొందరు సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. వాంగ్మూలాల వివరాలను పిటిషనర్‌కు కూడా ఇస్తారా అని ప్రశ్నించింది.

దీనిపై సిబిఐ స్పందిస్తూ సాక్షుల వివరాలు ప్రస్తుత దశలో బయటపెట్టలేమని, ఈ దశలో సాక్షుల వివరాలు బయటపెడితే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని, బుధవారం అవినాష్‌ను విచారణకు పిలుస్తామని తెలిపారు. సిబిఐ వాదనలకు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది రిప్లై ఇస్తు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకా ఓటమితో అవినాష్‌కు ఏం సంబంధం… ఓటర్లు ఓట్లు వేయకపోవడం వల్లే వివేకా ఓడిపోయారని తెలిపారు. అవినాష్ తల్లి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News