Saturday, April 27, 2024

తాజ్ మహల్‌లో షాజహాన్ ఉర్సు నిషేధించండి

- Advertisement -
- Advertisement -

ఆగ్రా: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలోగల తాజ్ మహల్‌లో ముఘల్ రాఉ షాజహాన్ 369వ ఉర్సు జరగడానికి మూడు రోజుల ముందు దీన్ని నిషేధించాలని కోరుతూ ఒక హిందూ సంస్థ ఆగ్రా సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజ్ మహల్‌లోపల జరిగే ఉర్సుకు ఉచిత ప్రవేశం ఇవ్వడాన్ని కూడా పిటిషనర్ సవాలు చేశారు. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ జాట్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఆగ్రా కోర్టు మార్చి 4న విచారణ జరిపేందుకు నిర్ణయించింది. ఉర్సును అధికారికంగా నిర్వహించడానికి ముఘల్ రాజులు, బ్రిటిష్ ప్రభుత్వం, లేదా భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా అన్న విషయమై భారత పురావస్తు శాఖ(ఎఎస్‌ఐ) నుంచి సమాచార హక్కు చట్టం(ఆర్‌టిఐ) కింద తాను సమాధానాన్ని కోరినట్లు సంజయ్ జాట్ విలేకరులకు తెలిపారు. అయితే ఉర్సు నిర్వాహక కమిటీకి అటువంటి అనుమతి ఏదీ లేదని ఎఎస్‌ఐ సమాధానమిచ్చిందని, దీంతో ఆనవాయితీగా వస్తున్న ఈ కార్యక్రమానికి ముగింపు పలికేందుకు అఖిల భారత హిందూ మహాసభ కోర్టును ఆశ్రయించిందని ఆయన తెలిపారు.

మూడు రోజుల ఉర్సు కార్యక్రమం ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ మధ్యనే జరగనున్నది. ఆగ్రాలోని యమునా నది ఒడ్డున 1653లో షాజహాన్ తాజ్ మహల్‌ను నిర్మించగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఏటా ఉర్సు నిర్వహిస్తున్నారు. ఉర్సు చివరి రోజున 1880 మీటర్ల ఛాదర్(దుప్పటి)ని సమర్పిస్తారు. ఎఎస్‌ఐకి చెందిన ప్రాచీన కట్టడాల లోపల ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు జరగరాదని, తాజ్ మహల్‌లో ఉర్సు జరపడం చట్టవిరుద్ధమని హిందూ మహాసభ డివిజనల్ అధ్యక్షుడు మీనా దివాకర్, జిల్లా అధ్యక్షుడు సౌరభ్ శర్మ తెలిపారు. కాశీ విశ్వనాథుని ఆలయం, కృష్ణ జన్మభూమి ఆలయం తరహాలోనే కోర్టు ఉత్తర్వులు పొందేందుకు ఆజ్ మహల్‌లో కూడా సర్వే జరపాలని కోర్టులో పిటిషన్ వేయాలని హిందూ మహాసభ యోచిస్తున్నట్లు సౌరభ్ శర్మ తెలిపారు. ఇదిలా ఉండగా..తాజ్ మహల్‌లో ఉర్సు నిర్వహణ కోసం ఎఎస్‌ఐ ప్రతి ఏటా అనుమతి ఇస్తుందని, ఈ ఏడాది కూడా అదే ప్రకారం అనుమతి ఇచ్చిందని ఉర్సు నిర్వహణ కమిటీ చైర్మన్ సయ్యద్ ఇబ్రహిం జైదీ తెలిపారు.

ఉర్సు ఏర్పాట్లను చర్చించేందుకు కొద్ది రోజుల క్రితమే ఎఎస్‌ఐ కార్యాలయంలో సమావేశం జరిగిందని ఆయన వివరించారు. ముఘల్ రాజు షాజహాన్ ఉర్సు శతాబ్దాలుగా నిర్వహించడం జరుగుతోందని, ఉర్సుకు అనుమతి లేదంటూ కొందరు చేస్తున్న వాదన పచ్చి అబద్ధమని ఆయన వాదించారు. ఉర్సుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం, ఇప్పుడు భారత ప్రభుత్వం అనుమతి ఇస్తున్నాయని ఆయన చెప్పారు. కాగా..తాజ్ మహల్‌లోని షాజహాన్ సమాధి వద్ద 1507 మీటర్ల ఛాదర్‌ను సమర్పించనున్నట్లు ఖుద్దామ్ ఇ రోజా కమిటీ అధ్యక్షుడు హాజీ తాహిర్ ఉద్దీన్ తాహిర్ తెలిపారు. ఉర్సు జరిగే మూడు రోజులు తాజ్ మహల్‌లో ప్రవేశం ఉచితమని, దీనికి సంబంధించిన వివరాలను ఎఎస్‌ఐ ప్రకటిస్తుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News