Wednesday, May 1, 2024

రేప్ కేసుల్లో ఎఫ్‌ఐఆర్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

home ministry said FIR is mandatory in rape cases

60 రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తి చేయాలి
నిబంధనలు పాటించని పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవచ్చు
రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ తాజా మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై దాడులు నానాటికీ పెరిగిపోతుండడం, హత్రాస్ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై కేంద్రం మరోసారి రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మహిళలపై నేరాలు ముఖ్యంగా అత్యాచారం వంటి కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. లైంగిక దాడుల కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు తప్పనిసరని, అంతేకాకుండా ఈ కేసుల్లో రెండు నెలల్లోగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సూచించింది. ఈ నిబంధనలకు పోలీసులు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని, లేని పక్షంలో బాధితులకు న్యాయం చేయలేమని పేర్కొంది. నిబంధనలు పాటించని పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయని గుర్తు చేసింది. ఈ మేరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సిఆర్‌పిసి) లోని చట్టాలను గుర్తు చేస్తూ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.

కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో ప్రధానమైన అంశాలు..

* మహిళలపై లైంగిక దాడి వంటి కేసుల్లో తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ఒక వేళ సంబంధిత పోలీసు స్టేషన్ పరిధి వెలుపల జరిగినట్లయితే ‘ జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేయాలి.ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే సదరు పోలీసు అధికారి శిక్షార్హుడే.
* అత్యాచారం కేసుల్లో పోలీసులు 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం’ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.
* లైంగిక దాడి సమాచారం అందిన 24 గంటల్లోగా బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపించాలి.
* న్యాయాధికారి ముందు రికార్డు చేయన్నపటికీ బాధితురాలి మరణవాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దాన్ని ఎట్టిపరిస్థితుల్లోను విస్మరించకూడదు. ఈ ఏడాది జనవరి 7న జారీ చేసిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
* లైంగిక దాడుల కేసుల్లో సాక్షాలను సేకరించడానికి ‘సెక్సువల్ అసల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్’ కిట్లను ఉపయోగించాలి.
* పోలీసులు నిబంధనలు పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News