Wednesday, May 1, 2024

మైక్రో ఫైనాన్స్ యాప్స్ గుట్టు రట్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీలోని గురుగ్రామ్ కేంద్రంగా మైక్రోఫైనాన్స్ యాప్స్ పనిచేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో ఢిల్లీ, హర్యానా, హైదరాబాద్‌లో సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసుల ఏకకాలంలో ఆన్‌లైన్ ఫైనాన్స్ సంస్థల్లో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా హర్యానాలో నలుగురు యాప్ కంపెనీ నిర్వాహకులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఢిల్లీ కాల్ సెంటర్లో 400 మంది ఉద్యోగులను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ ఫైనాన్స్ సంస్థలకు చెందిన కాల్ సెంటర్‌లో 700 మంది ఉద్యోగులను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెరసి ఇప్పటి వరకు ఆన్‌లైన్ ఫైనాన్స్ సంస్థల కేసు విచారణ నిమిత్తం అటు సైబర్ క్రైం, ఇటు సిసిఎస్ పోలీసులు 1100 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. కాగా నగరంలోని బేగంపేట, పంజాగుట్టలోని మైక్రోఫైనాన్స్ యాప్స్ కాల్ సెంటర్లలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సిసిఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రజలను పట్టిపీడిస్తున్న మైక్రోఫైనాన్స్ యాప్స్ వెనుక చైనా కంపెనీల హస్తం ఉందని సిసిఎస్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా గురుగ్రామ్ కేంద్రంగా హైదరాబాద్ నగరం బేగంపేటలోని పిన్‌ప్రింట్ టెక్నాలజీస్ లోన్ యాప్ కాల్ సెంటర్‌పై సిసిఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు.

గురుగ్రాం కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థకు చెందిన బేగంపేట, పంజాగుట్టలోని కాల్ సెంటర్లలో సోదాలు చేపట్టి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫైనాన్స్ సంస్థలకు ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం ఎలాంటి అనుమతులు లేవని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరిస్తున్నారు. ఆన్‌లైన్ లోన్ యాప్స్‌కి సంబంధించి హైదరాబాద్‌లో రెండు చోట్ల సోదాలు నిర్వహించినట్టు సిసిఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి మీడియాకు తెలిపారు. ఈక్రమంలో 16 యాప్స్‌కి సంబంధించిన కాల్ సెంటర్‌లపై ఢిల్లీ, గురుగ్రాంలో కూడా సోదాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. నిరుద్యోగ యువతను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థల కాల్‌సెంటర్లపై పూర్తి స్థాయి సోదాల అనంతరం చర్యలు చేపడతామని జాయింట్ సిపి వివరించారు. ఇదిలావుండగా రాష్ట్రంలో కాల్ మనీ లోన్ యాప్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ లో ఇప్పటివరకు 27 కేసులు నమోదుకాగా, హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో 45 కేసులు నమోదయ్యాయి. అలాగే రాచకొండ సైబర్ క్రైమ్ లో 41 లు కేసులు నమోదయ్యాయి. మూడు కమిషనర్‌లోని సైబర్‌క్రైమ్ లో ఆదివారం నుంచి సోమవారం నాటికి 113 కేసులు నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో రుణాలు పొందిన వారిని డబ్బులు చెల్లించమని బూతులు తిడుతూ లోన్ యాప్ ప్రతినిధులు ఫోన్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రుణాలు తీసుకున్న వారితో పాటు వారి ఇంట్లోని మహిళలకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న లోన్ ప్రతినిధులు రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లోన్ సంస్థల వివరాలు సేకరిస్తున్న పోలీసులు గతంలో చైనా నుండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు అనుమతులు పొందిన కొన్నింటిపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్ ద్వారా ఇచ్చిన రుణాలను వసూలు చేయడానికి థార్డ్ పార్టీ ఏజెన్సీలపై ఆరా తీస్తున్నారు.

Hyderabad Police Raid in Microfinance Firms

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News