Saturday, April 27, 2024

నేను సిద్ధం

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్‌కు నాకు సంబంధం లేదు
ఎటువంటి అనాలసిస్ పరీక్షలకైనా నేను సిద్ధం
కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సిద్ధంగా
ఉన్నారా? ఇడికి లేఖ ఇచ్చినవాడు ఒక
బఫూన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాట తీస్తాం
కెసిఆర్‌ను తిడితే బట్టలూడదీసి కొడతాం ఓట్లు
చీల్చడానికే కొత్త పార్టీలు హుజూరాబాద్‌లో కారుదే
గెలుపు పిసిసి పదవిని 50కోట్లకు రేవంత్ కొనుక్కున్నాడని
ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు పదవిని కొనుక్కున్నోడు
రేపు ఎంఎల్‌ఎ టిక్కెట్లు అమ్ముకోడా? సింగరేణి కాలనీ
బాలిక ఘటన దురదృష్టకరం చట్టం తన పని తాను
చేసుకుపోయింది : తెలంగాణ భవన్ మీడియాతో
చిట్‌చాట్‌లో మంత్రి కెటిఆర్ ఉద్వేగపూరిత భాషణ

మన తెలంగాణ/ హైదరాబాద్ : తనకు డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. దీని కోసం ఎలాంటి అనాలసిస్ పరీక్షలకైనా తాను సిద్దమేనని అన్నారు. మరి కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. ఎవరో ఏదో ఆరోణలు చేస్తే తనకేం సంబంధమన్నారు. తనపై ఇడికి లెటర్ ఇచ్చిన వాడు ఒక బఫూన్ అని కెటిఆర్ పేర్కొన్నారు. నోరుంది కదా? అని ఇష్టం వచ్చినట్లుగా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదని, తాటా తీస్తామని కెటిఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తిడితే బట్టలూడదీసి కొడతామంటూ కెటిఆర్ ఘాటుగా స్పందించారు. సిఎంపై పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాష్ట్ర ప్రయోజనాల గణాంకాల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తుండడంపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్న నాయకుల ఒక్కొక్కరి లెక్కలు తీస్తున్నామన్నారు. అలాంటి నేతలకు బుద్దిచెప్పేందుకు న్యాయపరంగా కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. అవసరమైతే రాజద్రోహం కింద కేసులు పెడతామని కెటిఆర్ హెచ్చరించారు.

శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కొద్దిసేపు కెటిఆర్ చిట్‌చాట్ చేశారు. ఢిల్లీ పార్టీలకు సిల్లీ పాలిటిక్స్ మాత్రమే తెలుసని, కానీ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు తెలియదన్నారు. అది తెలిసిన వ్యక్తి సిఎం కెసిఆర్ అని అన్నారు. టిఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులంతా అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నామన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చేయాల్సింది ఏమీ లేనందువల్లే తమపై విమర్శలకు దిగుతున్నారన్నారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు ఒక్క దాని గురించి అయినా చెప్పారా? అని ప్రశ్నించారు. రాష్ట్రం నలుగులు ఎంపిలుగా గెలిచిన బిజెపి నేతలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమస్యలపై ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా? అని నిలదీశారు.

సిఎం కెసిఆర్ ఫాంహౌజ్‌లో పడుకుంటున్నారని ప్రతిపక్షాలు రాద్దాం తం చేస్తున్నాయన్నారు. మరి అలాంటప్పుడు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని పథకాలు ఎలా అమలు అవుతున్నాయని కెటిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఎలా వస్తున్నాయో చెప్పాలన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసుకుంటూ, గ్రామాలు తిరుగుతూ ఒకాయన పాదయాత్ర చేస్తుంటే.. ఇంకొకాయన మార్కెట్లోకి కొత్తగా వచ్చి హడావుడి చేస్తూ.. మార్కెటింగ్ చేసుకుంటున్నాడని బండి సంజయ్, రేవంత్ రెడ్డిలపై సెటైర్లు పేల్చారు. కాంగ్రెస్ 60 ఏళ్ల రాజకీయ పాలనలో దళితులకు దళితబంధు పథకం లాంటిది ఎప్పుడైనా, ఎక్కడైనా పెట్టిందా? అని ప్రశ్నించారు. అలాగే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఒక్కటైనా ఉన్నా యా? కెటిఆర్ నిలదీశారు.
రాజకీయాలను రియల్ ఎస్టేట్‌లా చేస్తున్నారు

రాష్ట్ర రాజకీయాలను రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మార్చివేస్తున్నారని ప్రతిపక్ష నేతల తీరుపై కెటిఆర్ మండిపడ్డారు. ఒక వెంచర్ ప్రారంభించే ముందు బిల్డర్ ఏ విధంగా అయితే హడావిడి చేస్తున్నారో…. అదే మాదిరిగానే రానున్న ఎన్నికల్లో టికెట్లు అమ్ముకునేందుకే సభల పేరుతో జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకపడ్డారు. సిఎం కెసిఆర్ ఇలాకా గజ్వేల్లో సభ పెట్టామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోందని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చని అన్నారు. దానికే రాజకీయాల్లో పెనుమార్పులు జరిగినట్లుగా బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అంత దమ్మున్న పార్టీగా చెబుకుంటున్న కాంగ్రెస్ నేతలు హుజూరాబాద్ ఎన్నికల్లో తమ అభ్యర్ధికి డిపాజిట్ వస్తుందని చెప్పే ధైర్యం ఉందా? అని కెటిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలా మారిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్కం ఠాకూర్ రూ. 50 కోట్లకు రేవంత్ రెడ్డికి పిసిసి పదవిని అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. పిసిసిని కొనుకున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు టిక్కెట్లు అమ్ముకునే ప్రయత్నం మొదలు పెట్టారని విమర్శించారు.

ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి ఇవాళ కన్నాలు వేస్తున్నట్లుగా బయట ప్రచారం జరుగుతోందని కెటిఆర్ అన్నారు. పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇళ్లు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు. పిసిసి అధ్యక్ష పదవిని రూ.50కోట్లు ఇచ్చి రేవంత్ కొనుక్కున్నారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారన్నారు. ఇవాళ పిసిసి పదవి కొనుక్కున్నోడు…రేపు ఎంఎల్‌ఎ టికెట్లు అమ్ముకోడా? అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ విడుదల చేసిన ఛార్జీషీట్లపై ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కెటిఆర్ స్పందిస్తూ…. క్రిమినల్స్‌కు ఛార్జిషీట్స్ మాత్రమే తెలుసు! రోజు కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు మాత్రమే చార్జిషీట్లు అంటారన్నారు.

ఓట్లు చీల్చడానికే కొత్త పార్టీలు

టిఆర్‌ఎస్ ఓటు బ్యాంకును చీల్చడానికే రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని కెటిఆర్ అన్నా రు. అందుకే వారు కేవలం టిఆర్‌ఎస్‌ను, సిఎం కెసిఆర్‌ను టార్గెట్‌గా పెట్టుకుని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. రహస్య ఎజెండాతోనే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. గతంలో సిఎం కెసిఆర్ పలుమార్లు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పొగిడారని.. ఇప్పుడేమో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. షర్మిల కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా కెటిఆర్ వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని కెటిఆర్ ధీమా వ్యక్తంచేశారు. కొద్ది నెలల క్రితం నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డిని టిఆర్‌ఎస్ పక్షాన నిలబెట్టిన ఓ చిన్న పిల్లాడు ఓడించారన్నారని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.

ఎంఐఎంకి భయపడుతున్నది బిజెపినే

మజ్లిస్ పార్టీకి బయపడాల్సిన అవసరం తమకు లేదని కెటిఆర్ అన్నారు. నిజానికి ఆ పార్టీకి బయపడుతున్నది ముమ్మాటికి బిజెపియేనని అన్నారు. ఆదిలాబాద్‌లో గిరిజనయూనివర్సిటీ ఇస్తామని చెప్పిన బిజెపి ఇచ్చిందా? అని ప్రశ్నించారు. సాయుధ పోరాటం చేసిన నేతలకు పింఛన్ ఇవ్వమంటే …కేంద్రం ఇవ్వడం లేదన్నారు. అదే కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో పట్టుబట్టి కొంతమందికైనా ఫించన్ ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.

ముందస్తు ఎన్నికలా?

రాష్ట్రంలో ముందస్తూ ఎన్నికలా? అలాంటిదేమి లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎపి, తెలంగాణలో రోజురోజుకు రాజకీయ వేడి రాజుకుంటోందని, ఇది ముందస్తు ఎన్నికలకు సంకేతామా? ఒక మీడియా ప్రతినిధి కెటిఆర్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ…ఇదంతా మీడియాకే కనిపిస్తోందన్నారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇలాంటిది ఏమీలేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

ఆ ఘటన జరగడం దురదృష్టకరం

సింగరేణి కాలనీలో బాలిక ఘటనపై చట్టం తనపని తా ను చేసుకుపోయిందన్నారు. ఆ ఘటన జరగడం దురదృష్టకరమని… తనకు కూతురు ఉందని కన్నీళ్లు పెట్టుకున్నామన్నారు. దీనిపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు రాద్దాంతం చేయడంపై కెటిఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి సిఎం కెసిఆర్…తాను రాలేదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము రాకపోతే చట్టపరంగా జరగాల్సిన పనుల్లో ఎక్కడైనా ఆగాయా? అని నిలదీశారు. రాష్ట్రంలో దిశ ఘటన చోటుచేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో ప్రతిపక్షాలకు తెలియదా? అని మండిపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News