Saturday, April 27, 2024

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎక్కడా పోటీ చేసేది లేదు: గుత్తా సుఖేందర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎంఎల్‌సిగా తనకు ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడా పోటీ చేసేది లేదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే తన కుమారుడు అమిత్ పోటీలో ఉంటారని అన్నారు. ఒకవేళ అమిత్‌కు పార్టీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల్లో వారసత్వం కేవలం ఎంట్రీకి, గుర్తింపు కోసం ఉపయోగపడుతుందని చెప్పారు. వారసత్వాన్ని ఉపయోగించుకుని రాజకీయాలలోకి వచ్చిన వాళ్లు తమ సమర్థతను రుజువు చేసుకుని, వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందితేనే వారికి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. లేదంటే వారు ఒకసారికే పరిమితమవుతారని అన్నారు. శాసనమండలి చైన్మర్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం తన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు బిఆర్‌స్‌లో చేరే అవకాశం ఉందని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా కావడం ఖాయమని,అదే తన కోరిక అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం తథ్యమని వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో 12 స్థానాలు మళ్ళీ బిఆర్‌ఎస్సే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అంతర్గత కలహాలు అనేది సహజమని, పార్టీ నాయకత్వంపై పూర్తిస్థాయి సంతృప్తి ఎక్కడా ఉండదని అన్నారు. కొన్ని స్థానాలలో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తే కొత్త వారికి అవకాశం ఉంటుందని అన్నారు. కొందరు బిఆర్‌ఎస్ నాయకులు ఇతర పార్టీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. అయితే పార్టీలో సీట్లు ఆశించే వాళ్లు ఎక్కువగా ఉన్నారని, అందరికీ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని తెలిపారు. అయితే పార్టీ కోసం పనిచేసిన వారికి ఇతర పదవులు ఇచ్చి గౌరవిస్తామని చెప్పారు. వేముల వీరేశంను పార్టీలోనే కొనసాగాలని తాను చెప్పానని పేర్కొన్నారు.

ఆ నేతలు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారు
కాంగ్రెస్‌లో చేరుతామంటున్న ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా బిఆర్‌ఎస్ నేతలు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా బిఆర్‌ఎస్‌తో తనకు సంబంధం లేదని జూపల్లి కృష్ణారావు స్వయంగా చెప్పారని, అలాంటి వారు పార్టీ మారినా తమ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. ఖమ్మంలో ఈసారి బిఆర్‌ఎస్‌కు 2018 ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు పార్టీలు మారతారని, ఎవరు పార్టీని వీడినా బిఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేని కూటమి తమ విధానమని సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారని అన్నారు. అందుకే పాట్నాలో విపక్షాల సమావేశానికి వెళ్లలేదని తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై తమ విధానాన్ని పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు. మోడల్ స్కూల్ కాన్సెప్ట్‌ను యుపిఎ ప్రభుత్వం తెచ్చిందే అని, కానీ ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చాక మోడల్ స్కూళ్లను నిర్వహణను రాష్ట్రాలపై నెట్టిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రానికి అన్యాయమే చేసిందని గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. జాతీయ స్థాయిలో బిఆర్‌ఎస్ విస్తరించాలన్నదే తమ ఉద్ధేశమని స్పష్టం చేశారు.

తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్న ఏకైక నాయకుడు కెసిఆర్
తెలంగాణ ప్రాంత సమస్యలపై సమగ్రంగా అవగాహన ఉన్న ఏకైక నాయకుడు కెసిఆర్ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ ఈ ప్రాంత సమస్యలపై లోతైన అధ్యయనం చేసి పూర్తి అవగాహనతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, తొమ్మిదేళ్లలో కెసిఆర్ చేసిన అభివృద్ధే బిఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపిస్తుందని చెప్పారు. సిఎం కెసిఆర్‌పై ప్రజలలో నమ్మకం ఉందని చెప్పారు. తొమ్మిదేళ్లలో సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు.దేశంలో ఏ రాష్ట్ర అభివృద్ధి చెందని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, తెలంగాణ అభివృద్ధే బిఆర్‌ఎస్ లక్షమని స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని, విజయవంతం కావడానికి సహకరించిన ఆధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు గుత్తా సుఖేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన తొమ్మిది ఏండ్ల ప్రగతి ప్రజలకు వివరించే గొప్ప అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రెండు జాతీయ పార్టీల నాయకులకు ఏ విషయంపై అవగాహన లేదు
రాష్ట్రంలోని రెండు జాతీయ పార్టీల నాయకులకు ఏ విషయంపై కూడా సరైన అవగాహన లేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. సిఎం కెసిఆర్‌పై కక్ష, ఈర్శ తప్ప వారికి విషయం లేదని అన్నారు. కలలు కనడం వేరు…పగటి కలలు కనడం వేరని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎ కావడం వేరు….ముఖ్యమంత్రి రావడం వేరని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు అంతూ పొంతు ఉండదని అన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ మారలేదా..?అని ప్రశ్నించారు. ఆయన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులు ఆపేందుకు చట్టం తేవాల్సింది కేంద్రమే అని, అలాంటి కేంద్రమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News