Monday, April 29, 2024

బిజెపితో సైద్ధాంతిక సమరం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఏరోజు కూడా తాము బిజెపితో పొత్తు పెట్టుకోలేదు, భవిష్యత్తులో కూడా బిజెపి వంటి పార్టీతో తాము ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు. బిజెపితో తమకు సైద్ధాంతిక విభేదం ఉంద ని, తాము ఎప్పుడూ ఆ పార్టీతో కలవమని స్పష్టం చేశా రు. 45 ఏళ్ల కెసిఆర్ రాజకీయ జీవితంలో కానీ, 22 ఏళ్ల బిఆర్‌ఎస్ చరిత్రలో కానీ ఏనాడూ కూడా తాము బిజెపితో పొత్తు పెట్టుకోలేదని అన్నారు. యుసిసి బిల్లు, సిటిజన్ అమెండ్‌మెంట్ యాక్ట్ బిల్లును, రైతు బిల్లులను తాము వ్య తిరేకించామని గుర్తు చేశారు. తమకు బిజెపికి ఏ విషయంలోనూ సారూప్యత లేదని స్పష్టం చేశారు. తాము కాంగ్రె స్, బిజెపి పార్టీలకు సమదూరంగా ఉంటామని తెలిపారు. తాము కాంగ్రెస్, బిజెపి పార్టీలలో ఎవరితో లేము అని, తమలాగా దేశంలో 13 పార్టీలు ఉన్నాయని చెప్పారు. హై దరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఐటిసి కాకతీయ హోటల్‌లో ప్రముఖ పత్రికల ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులతో మంత్రి కెటిఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కెటిఆర్ సావధానంగా సమాధానమిచ్చారు. తమ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు తమ కు ఇది ఐదవ సార్వత్రిక ఎన్నిక అని, ఇప్పటివరకు కనీ సం మున్సిపల్ ఎన్నికల్లో కూడా బిజెపితో పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. మక్తల్ మున్సిపాలిటీల్లో, మణికొం డ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బిజెపి కలిసి కౌన్సిల్ ఏర్పా టు చేశాయని, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటును బిజెపికి బదలాయించి ముగ్గురు బిజెపి అభ్యర్థులను గెలిపించింది కాంగ్రెస్ అన్నారు.
సుప్రీం నుంచి స్టే వల్లే అరెస్ట్ ఆగింది
నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగొస్తుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తమపై కేసులు పెట్టారు కానీ అరెస్టు చేయడం లేదని అంటున్నారని, అయితే నిజంగా తాము బిజెపి బి టీం అయితే తమపై కేసే పెట్టుకూడదు కదా..? అని ప్రశ్నించారు. తమపై కేసు పెడితే సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామని వివరించారు. అరెస్ట్ అనేది న్యాయస్థానం ద్వారా ఆగింది కానీ ఎవరో ఆపితే ఆగలేదని స్పష్టం చేశారు. అరెస్ట్ చేయకపోవడమే తాము బిజెపితో కలిసి ఉన్నామనేదానికి సంకేమమైతే, బిల్లులకు మద్దతివ్వడమే సంకేతమైతే కాంగ్రెస్ కూడా బిల్లులకు మద్దతిచ్చిందని, కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపైన కూడా కేసులు ఉన్నాయని, వాళ్లను కూడా అరెస్ట్ చేయడం లేదని అన్నారు. మోడీ వచ్చి కెసిఆర్ కర్నాటకలో కాంగ్రెస్ మద్దతిస్తున్నారని అంటారని, కాంగ్రెస్ వాళ్లేమో తాము, బిజెపి ఒక్కటే అని అంటారని చెప్పారు. ఈ దేశంలో మూడో వ్యక్తి ఉండకూడదనేదే ఆ రెండు జాతీయ పార్టీల ఎజెండా అని పేర్కొన్నారు. ఉంటే రాహుల్‌గాంధీ ఉండాలి…లేదంటే మోడీ ఉండాలనేది వాళ్లిద్దరి కామన్ ఎజెండా అని అన్నారు. రాహుల్‌గాంధీ సులువుగా ఎదుర్కోవచ్చనే విషయం మోడీకి తెలుసు అని, అందుకే రాహుల్‌గాంధీ లాంటి ప్రతిపక్షనేత ఉండాలని కోరుకుంటారని చెప్పారు. 2024 తర్వాత కూడా బిజెపితో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు.
కేంద్రం రక్షణ భూములు ఇస్తే రెండు స్కై వేలు
కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు, జెబిఎస్ నుంచి తూంకుంట వరకు రెండు స్కై వేలు ఏర్పాటు చేయాలని చూస్తున్నామని కెటిఆర్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఎన్నో సార్లు కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా రక్షణ శాఖ భూములు ఇవ్వలేదని చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు కచ్చితంగా ఈ స్కై వేలు నిర్మిస్తామని పేర్కొన్నారు. గతంలో నరేంద్ర మోడీ సిలిండర్‌కు దండం పెట్టి ఓటు వేయాలని చెప్పారని, ఎన్నికల తర్వాత
గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచారని విమర్శించారు. కేంద్రం ఇష్టం వచ్చినట్లు పెంచి సిలిండర్ ధరను రూ.1,200 చేసిందని మండిపడ్డారు. పెంచిన రూ.800 సిలిండర్ ధర రాష్ట్ర ప్రభుత్వం భరించి, రూ.400లకే సిలిండర్ అందిస్తామని తెలిపారు. 24 గంటల పాటు మంచినీరు అందించేలా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నామని చెప్పారు.
నిరుద్యోగం తారాస్థాయికి అనటం అవాస్తవం
రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది అనటం అ వాస్తవమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సుమారు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం రిజిష్టర్ చేసుకున్నారని, కానీ వారంద రూ నిరుద్యోగులు కాదని కెటిఆర్ తెలిపారు. చాలామంది ప్రైవేట్‌తో పాటు వివిధ ఉద్యోగాలు చేసుకుంటూనే ప్రభు త్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్నారని చెప్పారు. టిఎస్‌పిఎస్‌సి ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది హాజరయ్యారని, అం దులో అన్ని పరీక్షలు రాసే వాళ్లు కూడా ఉన్నారని వివరించారు. పేపర్ లీకేజిలపై కాంగ్రెస్, బిజెపిలు అనవసర రా ద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదన్నరేళ్లలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. దేశంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా..? అని ప్రశ్నించారు. మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగంలో ఖాళీ అయిన ఉద్యోగాలు అదే ఏడాది భర్తీ చేస్తామని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు అంత మంచిది కాదని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రశ్నాపత్రాల లీకేజిపై ఎవరు ఫిర్యాదు చేయలేదని, ప్రభుత్వమే లీకేజి వ్యవహారాన్ని గుర్తించి విచారణ జరిపిందని అన్నారు. పోటీ పరీక్షల నిర్వహణలో ఏమైనా లోపాలు ఉంటే, తప్పకుండా ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు.
ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం
2014లో 63 సీట్లతో అధికారంలో వచ్చామని, ఆ తర్వాత మరో 25 సీట్లు పెరిగి 88 సీట్లతో అధికారం చేపట్టామని కెటిఆర్ తెలిపారు. ఈసారి 88 సీట్ల కంటే అధిక స్థానాలు గెలిచి మళ్లీ అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.
సమతుల్య అభివృద్ధే తెలంగాణ మోడల్
సమగ్ర, సమీకృత,సమ్మిళిత, సమతుల్య అభివృద్ధే తమ మోడల్ అని కెటిఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ పాలన చేశామని చెప్పారు. దేశంలోనే పల్లెల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి చూసి రాష్ట్రానికి కేంద్రమే ఎన్నో అవార్డులు ఇచ్చిందని పేర్కొన్నారు. 3 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి 30 అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారిపోయాయని వ్యాఖ్యానించారు. పట్టణ అభివృద్ధిలోనూ తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని వివరించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంత పట్టణాభివృద్ధి తెలంగాణలో జరిగిందని చెప్పారు. సమగ్ర, సమీకృత,సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి మోడల్ అని వ్యాఖ్యానించారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో కరోనా కారణంగా రెండేళ్లు వృథా కాగా, తాము నికరంగా ఆరున్నరేళ్లు మాత్రమే పరిపాలన చేశామని చెప్పారు. ఈ స్వల్ప కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని, ఇందుకోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేసి, 58 లక్షల ఆవాసాలకు స్వఛ్చమైన తాగునీరు అందించామని చెప్పారు.
ప్రగతి కొనసాగాలంటే మళ్లీ బిఆర్‌ఎస్ రావాలి
అభివృద్ధి, ప్రగతి కొనసాగాలంటే మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వమే రావాలని కెటిఆర్ చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వం ఉండటం వల్లనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా సంపద సృష్టించబడుతున్నదని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ పాలన చేయడమే తమ విధానమని స్పష్టం చేశారు. నాడు ఆర్థిక అసమానతలు, సామాజిక రుగ్మతల వల్లే నక్సలిజం వచ్చిందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో నక్సలిజం ఉందని అన్నారు. తెలంగాణలో నేడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 25 ఏళ్లు వెనక్కి చూస్తే ముగ్గురు ముఖ్యమంత్రులే గుర్తుకు వస్తారని పేర్కొన్నారు. ప్రో బిజినెస్, ప్రో అర్బన్ అనేవి చంద్రబాబు మోడల్ అని.. ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అనేవి రాజశేఖర్ రెడ్డి విధానమని, అన్ని రంగాల అభివృద్ధే సిఎం కెసిఆర్ మోడల్ అని మంత్రి చెప్పారు. పదేండ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలు గుర్తుచేసుకోవాలని కోరారు. రెండు సార్లు అవకాశం ఇచ్చాం కదా అని కొందలు అంటున్నారని, బాగా పనిచేసినప్పుడు మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. 11 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ చేసిందేంటని నిలదీశారు.
తలసరి ఆదాయంలో నెంబర్‌వన్
తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా ఉందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 ఉండగా, 2023లో రూ.3,17,115కు చేరిందని వివరించారు. జిఎస్‌డిసి అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 2014లో జిఎస్‌డిపి రూ.5.05 లక్షల కోట్లు ఉండగా, 2023లో రూ.13.27 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. 2014లో తెలంగాణ పేదరికం 13.18 శాతం ఉండగా, 2023లో 5.9 శాతానికి తగ్గించిందని, పేదరికాన్ని అత్యంత తగ్గించిన రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు పెద్ద హీరోలు కూడా తెలంగాణ యాసను మాట్లాడుతున్నారు
ఒకప్పుడు విలన్లు, కమేడియన్లు మాత్రమే మాట్లాడే తెలంగాణ యాసను ఇప్పుడు మహేష్‌బాబు, తారక్, బాలయ్య వంటి బడా హీరోలు కూడా మాట్లాడుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలు వెలుగు వెలుగుతున్నాయని, తెలుగు సినిమాలలో తెలంగాణ యాసకు ప్రాధాన్యత పెరిగిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News