Sunday, April 28, 2024

అవసరమైతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తా..

- Advertisement -
- Advertisement -

If need will protest at rashtrapati bhavan: Gehlot

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. బలపరీక్ష నిరూపణకు వీలు కల్పించడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ఎంఎల్‌ఎలతో రాజ్‌భవన్ బయట శుక్రవారం ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయినా గవర్నర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం ఒత్తిడి వల్లనే గవర్నర్ అనవసర జాప్యం చేస్తున్నారన్న అభిప్రాయంతో గెహ్లాట్ ఉన్నారు. దీనిపై ముఖ్యమంత్రి తన స్వరం పెంచారు. బిజెపి కుట్రను భగ్నం చేయడానికి అవసరమైతే తాను ఢిల్లీ లోని రాష్ట్రపతిభవన్, రాష్ట్రపతి కార్యాలయం, ఇంకా ప్రధాని కార్యాలయం వద్ద ధర్నా చేయడానికైనా తాను వెనుకాడేది లేదని హెచ్చరించారు. తన మద్దతుదారులైన ఎంఎల్‌ఎలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అవసరమైతే మద్దతుదారులు రెండు వారాలపాటు క్యాంప్‌లో ఉండవలసి ఉంటుందని సూచించారు. బిజెపి కుట్రను మనం విజయవంతం కానీయరాదు. అవసరమైతే రాష్ట్రపతిభవన్ వద్ద ధర్నా చేయడానికైనా తాను సిద్ధమే అని సిఎం వెల్లడించారని సీనియర్ నేత ఒకరు తెలిపారు.

శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి నివాసంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీ నిర్వహణ అజెండాపై ఈ భేటీలో చర్చించారు. శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సిందిగా గవర్నర్‌ను సమావేశంలో కోరారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను ముఖ్యమంత్రి గెహ్లాట్ కలవాలని అనుకున్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి పై విధంగా తన ఎంఎల్‌ఎలతో అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు జరగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. పై నుంచి కొంత ఒత్తిడి వల్ల గవర్నర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అనవసర జాప్యం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. సమావేశాలు నిర్వహిస్తే తన బలాన్ని నిరూపించుకోడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. అంతకు ముందు జైపూర్ ఫైర్‌మౌంట్ హోటల్‌లో సిఎల్‌పి భేటీ జరిగింది. తమ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని, అందువల్ల ధైర్యంగా ఉండాలని ఎంఎల్‌ఎలకు భరోసా ఇచ్చారు.

If need will protest at rashtrapati bhavan: Gehlot

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News