Sunday, April 28, 2024

సమరోత్సాహంతో భారత్

- Advertisement -
- Advertisement -

సమరోత్సాహంతో భారత్
ఇంగ్లండ్‌కు సవాల్, నేటి నుంచి చెన్నైలో తొలి టెస్టు

చెన్నై: సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆరంభం కానుంది. కరోనా మహమ్మరి దెబ్బకు చాలా రోజులుగా భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగలేదు. అప్పట్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరగాల్సిన సిరీస్‌లు మధ్యలోనే రద్దయ్యాయి. ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవలే సుదీర్ఘ సిరీస్ ఆడిన టీమిండియా తాజాగా సొంత గడ్డపై కూడా అంతర్జాతీయ క్రికెట్‌ను ఆడనుంది. ఈ సిరీస్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టు మ్యాచ్ సిరీస్‌లో భారత్ తలపడుతుంది. ఇక తొలి రెండు టెస్టులకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిలువనుంది. తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు మ్యాచ్‌కు అభిమానులను అనుమతించడం లేదు. ఈ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరుగనుంది. ఇదిలావుండగా ప్రపంచ క్రికెట్‌లోని రెండు అత్యుత్తమ జట్లుగా పరిగణించే భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో సిరీస్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
జోరుమీదున్న భారత్
ఇక సొంత గడ్డపై సిరీస్ జరుగుతుండడంతో భారత్‌కే మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేగాక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించి జోరుమీదుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా తయారైంది. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి చేరడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. మరోవైపు రోహిత్ శర్మ, అజింక్య రహానె, చటేశ్వర్ పుజారా, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లకు కూడా జట్టులో కొదవలేదు. బుమ్రా, అశ్విన్, సిరాజ్, శార్దూల్, సుందర్‌లకు తోడు సీనియర్ బౌలర్ ఇషాంత శర్మ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసే సామర్థం టీమిండియాకు ఉందని చెప్పాలి. స్వదేశంలో జరిగే సిరీస్‌లో అశ్విన్‌ను ఎదుర్కొవడం ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు చాలా కష్టంతో కూడా పనిగా చెప్పక తప్పదు. ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరుగైన బౌలింగ్‌ను కనబరిచి జోరుమీదున్నాడు. బుమ్రా కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. సిరాజ్‌కు ఈ మ్యాచ్‌లో ఛాన్స్ దొరుకుతుందా లేదా అనేది సందేహంగా తయారైంది. ఒకవేళ ఆల్‌రౌండర్‌గా శార్దూల్‌ను తీసుకుంటే సిరాజ్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు.
అందరి కళ్లు పంత్‌పైనే
మరోవైపు ఆస్ట్రేలియా గడ్డపై అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై అందరి దృష్టి నెలకొంది. సొంత గడ్డపై పంత్ మరింత మెరుగైన బ్యాటింగ్ కనబరుస్తాడనే నమ్మకంతో జట్టు యాజమాన్యం ఉంది. తొలి టెస్టులో పంత్‌ను బరిలోకి దించుతామని కెప్టెన్ కోహ్లి ఇప్పటికే స్పష్టత ఇచ్చాడు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలని పంత్ తహతహలాడుతున్నాడు. ఇక యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు కూడా సిరీస్ కీలకంగా తయారైంది. ఆస్ట్రేలియాపై నిలకడగా రాణించిన గిల్ సొంత గడ్డపై కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌పై కూడా రాణిస్తే జట్టులో స్థానం శాశ్వతంగా మారడం ఖాయం. మరోవైపు సీనియర్ ఆటగాడు రోహిత్‌శర్మ కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. రోహిత్ విజృంభిస్తే భారత్‌కు భారీ స్కోరు నల్లేరుపై నడకే. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రహానె, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా వంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు టీమిండియాకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
భారీ ఆశలతో
ఇదిలావుండగా ఇంగ్లండ్ కూడా భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైంది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ బెన్ స్టోక్ జట్టుకు ప్రధాన అస్త్రంగా తయారయ్యాడు. కెప్టెన్ జో రూట్ కూడా జోరుమీదున్నాడు. కాగా, రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా, అశ్విన్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, ఇషాంత్, సిరాజ్, అక్షర్ పటేల్, కెఎల్. రాహుల్, వృద్ధిమాన్ సాహా, కుల్దీప్, మయాంక్, బుమ్రా, సుందర్, శార్దూల్.
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్),రోరి బర్న్, డొమినిక్ సిబ్లి, డానియల్ లారెన్స్, మోయిన్ అలీ, జోస్ బట్లర్, ఓలి పోప్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, బ్రాడ్, అండర్సన్, క్రిస్ వోక్స్, బెన్ ఫోక్స్, ఓలి స్టోన్, డొమినిక్ బెస్.

ఉదయం 9.30 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం.

IND vs ENG first test in Chennai from Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News