Sunday, April 28, 2024

సంపాదకీయం: చదువులో మనువు?

- Advertisement -
- Advertisement -

Biden democracy summit is the height of hypocrisy

చదువు మనుషులను ఉన్నతులను చేస్తుందనేది ముమ్మాటికీ నిజమే, అయితే ఏ చదువు అటువంటి ఔన్నత్యాన్ని కలిగిస్తుంది అనే ప్రశ్నకు కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సిబిఎస్‌ఇ) పదో తరగతి ఆంగ్ల సాహిత్య ప్రశ్న పత్రం ఆస్కారం కలిగిస్తున్నది. ఇందులో 10 మార్కులకు సంబంధించి ఇచ్చిన ఒక ప్రశ్నలో ఒక వ్యాస భాగాన్నిచ్చారు. అది చదివి సమాధానాలు చెప్పాలంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు. మహిళలు చదువుకోడం, స్వేచ్ఛను అనుభవించడం వల్ల కుటుంబంలో, సమాజంలో క్రమశిక్షణ దెబ్బ తింటున్నదని ఆ వ్యాస రచయిత అభిప్రాయపడ్డారు. భార్యకు గృహ బానిసత్వం నుంచి విముక్తి కలిగించడం వల్ల పిల్లలపై తలిదండ్రుల అదుపాజ్ఞలు నాశనమవుతున్నాయని, గతంలో వారు భర్తలకు విధేయులుగా వుండేవారని దానితో పిల్లలు, పనివారు కట్టుతప్పకుండా క్రమశిక్షణతో మెలిగేవారని పేర్కొన్న ఈ వ్యాస భాగం కలకలం రేపింది.

మహిళలు ఇంటికే పరిమితమై పతి సేవ చేస్తూ దైవ భక్తిని అలవర్చుకొని పూజలు, పునస్కారాలతో జీవించినప్పుడే కుటుంబ క్రమశిక్షణ వర్ధిల్లుతుందని చెప్పిన ఈ ప్రశ్నాంశంపై విద్యార్థి లోకం, తలిదండ్రులు, ప్రతిపక్షాలు భగ్గుమన్నారు. లోక్‌సభలో విపక్షాలు వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర నిరసన తెలియజేశారు. దానితో సిబిఎస్‌ఇ తప్పు తెలుసుకొని ఆ ప్రశ్నను తొలగిస్తున్నట్టు, పరీక్ష రాసిన వారందరికీ దానికిచ్చిన 10 మార్కులు కలుపుతామని ప్రకటించింది. పరీక్షా పత్రంలో ఆ ప్రశ్నను చేర్చినందుకు విచారం వ్యక్తం చేసింది. భారత రాజ్యాంగం ఏ పునాదులపై నిర్మితమైందో ఆ పునాదులకే, సర్వ సమానత్వ మౌలిక ఆశయానికే గురి పెట్టి పేల్చిన అభివృద్ధి నిరోధక, తిరోగామి తూటాగా ఈ ప్రశ్నను పరిగణించవచ్చు. భర్తకు చూపు లేకపోతే భార్య కూడా గంతలు కట్టుకోడాన్ని, సతీసహగమనాన్ని గొప్ప పాతివ్రత్యంగా కీర్తించి అటువంటి భార్యలకు గుడులు కట్టి దేవతలుగా పూజించిన గతంలో భారతీయ స్త్రీ ఎన్ని కష్టాలు పడిందో ఆలోచించే వారికి అర్థమవుతుంది. ఆ విధంగా మన సంప్రదాయ సమాజం స్త్రీ జ్ఞాననేత్రాన్ని దళితుల విషయంలో మాదిరిగానే శాశ్వతంగా మూసివేసి పురుషుడి దాసిగా చేసింది.

మహిళ అన్నింటా మగవాడితో సమానంగా, అంతకు మించి రాణిస్తున్న ఈ ఆధునిక కాలంలోనూ ఆ దుష్ట సంప్రదాయాన్ని కొనసాగించాలని సూచించే వ్యాస భాగాన్ని సిబిఎస్‌ఇ వంటి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విద్యా పరవేక్షక సంస్థ ప్రశ్న పత్రంలో 10 మార్కుల ప్రశ్న కింద చేర్చడం పొరపాటుగానో, యాదృచ్ఛికంగానో జరిగినదిగా భావించలేము. దీనితో సంబంధముందో లేదో గాని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవలసిన అంశమొకటి వుంది. మహిళలపై అత్యాచారాలు పట్టణ ప్రాంతాల్లోనే సంభవిస్తాయి గాని గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకోవని ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) అధినేత మోహన్ భగవత్ గతంలో అన్నారు. అలాగే 2013లో ఇండోర్‌లో జరిగిన ఒక ప్రదర్శనను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో భార్య, భర్త రక్షణలో వుండి అతడి కనుసన్నలలో, అతడి గృహ బాధ్యతలు వహించాలని అందుకు ప్రతిగా ఆమె పోషణ భారం ఆయన మోయాలని మోహన్ భగవత్ అన్నారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తక్షణమే ఆమెను అతడు విడిచి పెట్టాలని కూడా అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో భారత్ ఇండియాగా పరిణమిస్తున్న కొద్దీ మహిళలపై అత్యాచారాల వంటి నేరాలు దేశంలో ప్రబలుతున్నాయని కూడా ఆయన అన్నారు.

మహిళను తల్లిగా పరిగణించే భారతీయ విలువలను, సంస్కృతిని సమాజం నరనరాల్లోనూ పెంపొందించాలని ఉద్బోధించారు. అందుకు అనుగుణంగా ప్రస్తుత చట్టాల్లో ప్రభుత్వం మార్పులు తీసుకొస్తే ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇస్తుందని కూడా చెప్పారు. భారత దేశంలో హిందూ సమాజానికి ప్రత్యామ్నాయం లేదని చెబుతూ మహిళలు విద్యావంతులయ్యే సంపన్న కుటుంబాల్లోనే విడాకులు సంభవిస్తున్నాయని విద్య, ధనం వారిలో అహంకారాన్ని సృష్టిస్తున్నాయనీ మోహన్ భగవత్ ఆ తర్వాత మరొక సందర్భంలో పేర్కొన్నారు. దేశాధికారాన్ని ఎదురులేని రీతిలో చేజిక్కించుకొని పరిపాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక గురువుగా, సారథిగా వుండి వెనుక నుండి నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ నేడు అత్యంత శక్తివంతమైన సంస్థ. దేశ భవిష్యత్తు గమనాన్ని శాసించే స్థితిలోని ఆ సంస్థ అధినేత వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలకు ఇప్పుడు సిబిఎస్‌ఇ టెన్త్ పరీక్షా పత్రంలోని వివాదాస్పదమైన ప్రశ్నకు సంబంధించిన వ్యాస భాగానికి పోలిక స్పష్టంగా కనిపిస్తున్నదే. అయితే సెక్యులర్ ప్రజాస్వామిక విలువలకు స్త్రీ, పురుష సమానత్వానికి ప్రాధాన్యాన్నిస్తున్న రాజ్యాంగం ప్రకారం పని చేయవలసిన ప్రభుత్వ విద్యారంగంలోకి ఇటువంటి భావజాలం ప్రవేశించడం ఎంతటి ప్రమాదకరమో చెప్పనక్కర లేదు. అందుచేత మనం ఏ చదువు చదువుకోవాలి? ప్రగతిశీలమైన విద్యనా, మహిళలను, కింద వుంచబడిన కులాలను అణచివేసే ధోరణులను ప్రోత్సహించే చీకటి చదువులనా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News