Friday, April 26, 2024

కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత్ కీలక పాత్ర: బిల్‌గేట్స్

- Advertisement -
- Advertisement -

ఇండియాతోనే స్పీడ్‌గా కోవిడ్ వ్యాక్సిన్.. బిల్‌గేట్స్ విశ్లేషణ

India likely to play key role in Covid 19 Vaccine: Bill Gates

న్యూఢిల్లీ: కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారీలో భారతదేశం కీలక పాత్ర పోషించగలదని బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ అధినేత, బిలియనీర్ ధార్మికవేత్త అయిన బిల్‌గేట్స్ కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టిన పెనుసంక్షోభం అన్నారు. ఇప్పుడు అత్యవసరంగా దీని నివారణకు వ్యాక్సిన్ తయారీ చేయాల్సి ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ, దీనిని ఇతర వర్థమానదేశాలకు ఇది అందేలా చేయడంలో కీలక పాత్ర పోషించేందుకు ఇండియా ముందుకు రావడం మంచి పరిణామం అని బిల్‌గేట్స్ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. వ్యాక్సిన్ తయారీ ఓ కీలక ఘట్టం అయితే, ఈ వ్యాక్సిన్ అన్ని దేశాలకూ సరైన రీతిలో సక్రమంగా అందించడం మరింత ప్రధానమైన అంశం అని బిల్‌గేట్స్ చెప్పారు. వ్యాక్సిన్ సరఫరా వలయ క్రమబద్ధీకరణ చాలా కీలకమని అన్నారు. ప్రపంచ యుద్ధాల తరువాత ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తు ఈ కరోనా వైరస్ అని బిల్‌గేట్స్ తెలిపారు. బిల్‌గేట్స్ ఫౌండేషన్ తరఫున ఇప్పుడు కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వివిధ రకాలుగా కృషి చేస్తోంది. ఇప్పుడు కరోనా నివారణ మందు అత్యధిక మోతాదులో ఉత్పత్తి కావల్సి ఉందని, దీనిని సరైన రీతిలో తయారు చేయడం ఓ ఘట్టం అయితే, దీనిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం, తరువాతి దశలో దీనిని అవసరమైన వర్గాలకు అందుబాటులోకి తేవడం మరో పరిణామం అని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు తెలిపారు.

ఇప్పుడు భారీ స్థాయిలో వ్యాక్సిన్ తయారీ దిశలో ప్రపంచం భారత్‌వైపు ఆసక్తితో ఎదురుచూస్తోందని, ఇదే క్రమంలో ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు ఇండియా ముందుకు రావడం మంచి పరిణామమని బిల్‌గేట్స్ తెలిపారు. భారతదేశంలో వ్యాక్సిన్ ముందు రావాలని అంతా కోరుకుంటున్నట్లు, అది అక్కడ సురక్షితం, సమర్థవంతం అయినట్లు తెలిస్తే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ వేగంగా అందేందుకు వీలేర్పడుతుందని బిల్‌గేట్స్ తెలిపారు. వచ్చే ఏడాది ఇండియా నుంచి భారీ స్థాయిలో వ్యాక్సిన్ రావడానికి వీలుంటుందని, దీని కోసం అంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇండియా కేవలం వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్యం సంతరించుకుని ఉండటమే కాకుండా ఇతర తోటి దేశాలకు కూడా దీనిని సరఫరా చేసే సరైన సామర్థాన్ని సంతరించుకుని ఉందని, అందుకే ఈ కరోనా దశలో ప్రపంచం అంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 9,32,000 మందిని బలిగొంది. రెండు కోట్ల మందికి పైగా కరోనా వైరస్‌కు గురయ్యారు. ఈ దశలో సైంటిస్టులు, ఔషధపరిశ్రమల వారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కాలంతో పోటీ పడుతూ వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నిస్తున్నారని, వీరికి తాను అభినందనలు తెలియచేస్తున్నట్లు బిల్‌గేట్స్ చెప్పారు. చాలా మంది వ్యాక్సిన్ పరీక్షల కోసం ముందుకు వచ్చారని, ఇప్పటికే మూడో, నాలుగో దశ పరీక్షలు జరిగాయని ఇదంతా కీలక పరిణామంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు.

India likely to play key role in Covid 19 Vaccine: Bill Gates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News