Monday, April 29, 2024

మరికొంతకాలం బ్రిటన్‌కు విమానాలు రద్దు

- Advertisement -
- Advertisement -
India may extend ban on flights from UK
సూచనప్రాయంగా తెలిపిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్

న్యూఢిల్లీ: కరోనా కొత్తరకం ఆందోళనల నేపథ్యంలో భారత్‌-బ్రిటన్‌ల మధ్య విమానాల రాకపోకలు మరికొంతకాలం నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి మంగళవారం ఈ మేరకు సూచనప్రాయంగా తెలియజేశారు.‘బ్రిటన్‌కు విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు మరికొంత కాలం ఉండవచ్చని అనుకొంటున్నా. అయితే ఈ పొడిగింపు సుదీర్ఘకాలం లేదా నిరవధికంగా ఉండకపోవచ్చు’ అని మంత్రి తెలియజేశారు. భారత్‌లో కొత్తరకం కరోనా కేసులు వెలుగు చూడడం, యుకెలో వైరస్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జన్యుమార్పిడి చెందిన కరోనా వైరస్ బ్రిటన్‌లో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు యుకెకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయి. భారత ప్రభుత్వం కూడా ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రినుంచి 31 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను రద్దు చేసింది.

అయితే డిసెంబర్ 23లోగా బ్రిటన్‌నుంచి భారత్‌కు చేరకున్న వారికి ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో పలువురికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వీరికి సోకింది కొత్త వైరసా కాదా అనే విషయం నిర్ధారించుకోవడానికి వీరి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపించారు. కాగా.. ఈ పరీక్షల్లో ఇప్పటివరకు ఆరుగురికి కొత్త వైరస్ నిర్ధారణ అయినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. కాగా నవంబర్ 25నుంచి డిసెంబర్ 23 వరకు యుకెనుంచి దాదాపు 30 వేల మంది ప్రయాణికులు వివిధ విమానాశ్రయాల ద్వారా భారత్‌కు చేరుకున్నారు. వీరందరినీ ఆయా రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించి వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు యుకెనుంచి వచ్చిన వారిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News