Saturday, April 27, 2024

మీరా? శాంతి సంస్కృతి గురించి మాట్లాడేది

- Advertisement -
- Advertisement -
India slams Pakistan's propaganda at UN Forum
ఐరాస వేదిక నుంచి పాక్‌కు భారత్ చురక

న్యూయార్క్: ఐరాస వేదిక నుంచి భారతదేశం పొరుగుదేశం పాకిస్థాన్ తీరుతెన్నులపై విమర్శనాస్త్రాలను సంధించింది. పాక్ వైఖరి మారడం లేదని, ఆ దేశం తన హింసాత్మక సంస్కృతిని చాటుకొంటోందని భారతదేశం మండిపడింది. దేశంలోనూ, సరిహద్దుల్లోనూ పాకిస్థాన్ హింసాత్మక ప్రవృత్తి మితిమీరుతోందని భారత మహిళా ప్రతినిధి పౌలోమీ త్రిపాఠీ వ్యాఖ్యానించారు. ఆ దేశంలో ఇతర దేశస్తుల పట్ల అసహనం ప్రదర్శిస్తూ వస్తున్నారని, ఈ క్రమంలో మానవ హక్కుల ఉల్లంఘనలు రికార్డు స్థాయికి చేరాయని త్రిపాఠీ విమర్శించారు. ఐరాసలో భారత ప్రతినిధి బృందం సమన్వయకర్త అయిన త్రిపాఠీ గురువారం 74వ ఐరాస జనరల్ అసెంబ్లీ కల్చర్ ఆఫ్ పీస్ అత్యున్నత వేదిక నుంచి ప్రసంగించారు. పాకిస్థాన్ దేశంలోపల హింసాత్మక చర్యలు జరుగుతున్నాయి.

సరిహద్దులు దాటి ఆ దేశం హింసాకాండను ప్రేరేపిస్తోందని, చాలా కాలంగా ఈ వైఖరి సాగుతోందని వ్యాఖ్యానించారు. అత్యంత హేయం, గర్హనీయ స్థాయిలోనే పాకిస్థాన్‌లో హక్కుల దారుణ పరిస్థితి ఉందన్నారు. మతపరమైన మైనార్టీల పట్ల ఆ దేశంలో వ్యవహరిస్తున్న విచక్షణాయుత వ్యవహారశైలి జుగుస్పాకరంగా మారిందన్నారు. ప్రపంచ దేశాలకు అక్కడి పరిణామాలు అత్యంత ఆద్యంత ఆవేదన కల్గించే పరిణామాలుగా మారాయని అన్నారు.దురదృష్టకరంగా ఇప్పుడు కూడా పాకిస్థాన్ భారత్‌పై ఐరాస వేదిక నుంచి విద్వేషపూరిత ప్రసంగాలకు దిగుతోందని, ఇది ఖండించదగ్గ విషయమని చెప్పారు. ఓ వైపు ఆ దేశం తమ మతపరమైన మైనార్టీలను వేధిస్తూ, వారిని అణచివేస్తూ మరో వైపు భారతదేశంపై అభాండాలకు దిగడం ఎంత వరకు న్యాయమని భారత ప్రతినిధిరాలు ప్రశ్నించారు.

పాకిస్థాన్‌కు చెందిన ఐరాస రాయబారి మునీర్ అక్రమ్ ఈ కల్చర్ ఆఫ్ పీస్ వేదిక నుంచే ఇటీవలే తమ ప్రసంగంలో భారతదేశంపై కొన్ని వ్యాఖ్యలతో విద్వేషపూరిత ప్రసంగానికి దిగిన విషయాన్ని త్రిపాఠీ గుర్తు చేశారు. పాకిస్థాన్ ప్రతినిధి తమ ప్రసంగంలో జమ్మూ కశ్మీర్, బాబ్రీ మసీదు కూల్చివేతలు, అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల ప్రారంభం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇవన్నీ కూడా భారతదేశ ప్రభుత్వం ఓ మతాధిపత్యం కొనసాగించేందుకు చేపట్టిన చర్యలుగా అభివర్ణించారు. ఓ వైపు మానవ హక్కుల విషయంలో పేలవంగా ఉన్న పాకిస్థాన్, మతపరమైన వేధింపుల చరిత్రను సాగిస్తూ ఉండగా పనిగట్టుకుని ఇటువంటి విమర్శలకు దిగడం దారుణం అని విమర్శించారు. శాంతి సంస్కృతి గురించి పాకిస్థాన్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. పలు అంశాలలో ఆ దేశ ప్రభుత్వం విఫలం అయ్యిందని, చివరికి కరోనా కట్టడిపై చేతులేత్తెసిందని, ఇప్పుడు వైఫల్యం నుంచి పక్కదారి పట్టించేందుకు ఇటువంటి మాటలకు దిగుతోందని ఆమె మండిపడ్డారు. ముందు ఆ దేశం తమ ఇంటి పరిస్థితి చక్కదిద్దుకుని, తమ ప్రజలను కాపాడుకుంటే మంచిదని సున్నితంగానే చురకలు పెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News