Saturday, May 4, 2024

ఎవరూ ఓడినా ఇంటికే..

- Advertisement -
- Advertisement -

నేడు పసికూన నేపాల్‌తో భారత్ పోరు
ఆసియా కప్ 2023

పల్లెకెలె: ఆసియాకప్‌లో శుభారంభం చేయాలనుకున్న టీమిండియాకు వరుణుడు అడ్డు తగిలాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ రద్దు కావడంతో అటు అభిమానులు ఇటు టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. శనివారం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య పోరులో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు మ్యాచ్ నిర్వహకులు. ఇక ఇప్పుడు పసికూన నేపాల్‌తో సోమవారం ఇదే పల్లెకెలె మైదానం వేదికగా అమీతుమీ తేల్చుకోనుంది. దురదృష్టం ఏంటంటే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షంతో మ్యాచ్ రద్దయినా భారత్‌కు వచ్చే నష్టం లేదు. కానీ, నేపాల్ గెలుపొందితే భారత్ ఇంటిబాట పట్టడం ఖాయం.
మార్పులేమీ లేకుండానే…
ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు చేసే అవకాశం అయితే లేదు. ఒకవేళ మార్పులుంటే.. లెఫ్టాండర్ తిలక్ వర్మను తుది జట్టులోకి తీసుకురావచ్చు. శార్దూల్ ఠాకూర్‌కు బదులుగా మహమ్మద్ షమీని బరిలోకి దింపొచ్చు. సూర్యకుమార్ యాదవ్‌ను కూడా లోయర్ ఆర్డర్‌లో ఆడించవచ్చు. కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్పులకు ఆసక్తికనబర్చినా.. రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు చేయకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగేందుకు మొగ్గు చూపవచ్చు. ప్రత్యర్థి పసికూన అని భావిస్తేనే ఈ ప్రయోగాలకు ఒకే చెప్పే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో క్లిష్ట పరిస్థితుల్లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అసాధారణ ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. దీంతో మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్‌పై ఉన్న సందేహాలన్నీ ఈ ఇన్నింగ్స్‌తో తీరాయి. తీవ్ర ఒత్తిడిలో అతను అసాధారణంగా బ్యాటింగ్ చేశాడు. టీమిండియా టాపార్డర్ మాత్రం దారుణంగా విఫలమైంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో తప్పకుండా రాణించాలి. ఇక పసికూన నేపాల్‌తో మ్యాచ్ వీరికి గాడిలో పడేందుకు సహకరిస్తుందనే చెప్పొచ్చు.
కోహ్లి రాణిస్తే..
మరోవైపు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి పాక్‌తో మ్యాచ్‌లో 4 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే నేపాల్ బౌలర్లకు చుక్కలే అని చెప్పొచ్చు. కొంతకాలంగా వన్డేల్లో కోహ్లి నిలకడగా రాణిస్తుండడం భారత్‌కు కలిసి వచ్చే అంశమే అయినా పాక్‌తో మ్యాచ్‌లో రాణించకపోవడం కొంత ఆందోళనకరం. ఇక గాయంతో సుదీర్ఘ కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్‌పై కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడం కూడా భారత్‌కు మైనస్ అనే చెప్పాలి. కానీ, ఆసియాకప్‌లో రాణించడం ద్వారా రానున్న వరల్డ్‌కప్‌లో టీమిండియాలో చోటును ఖాయం చేసుకోవాలని భావిస్తున్నాడు. కాగా, ఆల్‌రౌండర్లు హార్దిక్, ఇషాన్ కిషన్ అర్ధ శతకాలతో రాణించినా జడేజా 14 పురుగులకే అవుటయ్యాడు. ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో రాణిస్తే వీరు గాడిలో పడినట్టే. సిరాజ్, షమి, బుమ్రా, కుల్దీప్, అక్షర్‌లతో భారత బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. దీంతో భారత్‌కే గెలుపు సునాయసమనే చెప్పొచ్చు.
గెలుపు కోసం నేపాల్..
ఇదిలావుంటే తొలి మ్యాచ్‌లో పాక్‌చేతిలో చిత్తుగా ఓడించిన నేపాల్ ఈ మ్యాచ్‌లో గెలవాలనే కసితో బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ పాడెల్ డక్ అవుట్ కాగా, ఓపెనర్లు కుషాల్ భుర్టెల్(8), మహమ్మద్ అసిఫ్(5) రాణించలేక పోయారు. దీంతో వారు భారత్ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించాలనే దృఢంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిడిలార్డర్‌లో ఎండి అరిఫ్, సోంపాల్ కామి రాణిస్తే నేపాల్ గెలుపుకు బాటలేయవచ్చనే చెప్పొచ్చు. ఇక బౌలింగ్ విభాగంలో సోంపాల్, కరన్ కెసి, సందీప్ లామిచ్చనే ఈ మ్యాచ్‌లో బాల్‌తో చెలరేగితే భారత బ్యాటర్లను తక్కువ స్కోరుకే కట్టడి చేయవచ్చు. ఏదీఏమైనా భారత్ వంటి బలమైన జట్టుపై నేపాల్‌కు గెలుపు అంత తేలికకాదనే చెప్పాలి.
భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News