Monday, April 29, 2024

రక్షణ మంత్రుల భేటీ

- Advertisement -
- Advertisement -

Will Increasing Legal Age Of Marriage For Girls Address సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగి, రెండు వైపులా సైనిక మోహరింపులు పరాకాష్ఠకు చేరుకొని, యుద్ధ మేఘాలు దట్టమవుతున్న సమయంలో మాస్కోలో శుక్రవారం ఉదయం భారత, చైనా రక్షణ మంత్రులు సమావేశం కావడం హర్షించవలసిన పరిణామం. షాంఘై సహకార సంస్థ దేశాల రక్షణ మంత్రుల చర్చలకు కామన్‌వెల్త్ భేటీకి హాజరయ్యేందుకు మూడు రోజుల పర్యటనపై మాస్కో వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రితో మాత్రం మాట్లాడబోరని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే చైనా కోరిక మేరకే ఇద్దరు రక్షణ మంత్రుల మధ్య చర్చలు జరిగాయని తెలుస్తున్నది. తూర్పు లడఖ్ వద్ద సరిహద్దుల్లో నాలుగు మాసాలుగా భారత చైనా సేనల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలోని పాంగాంగ్ సో సరస్సు ఉత్తర తీరంలో సంభవించిన బాహాబాహీ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు.

1962 యుద్ధం తర్వాత చైనా మళ్లీ చెప్పుకోదగిన దురాక్రమణకు పాల్పడింది. కొన్ని వేల చదరపు కి.మీ భారత భూభాగంలోకి దాని సేనలు చొచ్చుకు వచ్చాయని తెలుస్తున్నది. ఉపసంహరణపై చర్చలు సాగుతుండగానే మొన్న ఆగస్టు 2930 అర్ధరాత్రి పాంగాంగ్ సో సరస్సు పశ్చిమ తీరంలో చైనా సేనలు మళ్లీ దురాక్రమణకు సన్నాహాలు చేస్తుండగా భారత సేనలు ఆ కుట్రను భగ్నం చేయగలిగాయి. ఈ నేపథ్యంలో రెండు వైపులా భారీ ఎత్తున సైనిక సమీకరణ కొనసాగింది. పరిస్థితి చేయి దాటిపోయి, ఏ క్షణంలోనైనా మరో యుద్ధం విరుచుకుపడవచ్చుననే స్థాయికి వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల రక్షణ మంత్రులు చర్చలు జరపడానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. దీనిని అమిత సానుకూల పరిణామంగా భావించాలి. అంతర్జాతీయ వాణిజ్య శిఖరంగా, బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగి అమెరికాతో పోటీ పడుతున్న చైనా ప్రపంచాధిపత్య కాంక్షతో ఉర్రూతలూగుతున్నది.

సామ్రాజ్యవాద శక్తిగా మారింది. మన పొరుగున గల నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు అప్పులు ఇచ్చి, రాయితీలు కల్పించి వాటిని తన చెప్పుచేతల్లో పెట్టుకునే యుక్తిని ప్రయోగిస్తున్నది. పాకిస్థాన్‌తో దాని స్నేహం, ఆ రెండు దేశాలు కలిసి భారత్‌ను ఉమ్మడి శత్రువుగా చూస్తున్న చేదు వాస్తవం తెలిసినవే. చైనాతో మనకు 4056 కి.మీ. (2520 మైళ్లు) నిడివి సరిహద్దు ఉంది. స్వల్ప మాత్రం నిర్వివాద భాగం మినహా మిగతాదంతా ఖరారు కాని సరిహద్దే, వాస్తవాధీన రేఖగా పరిగణిస్తున్నదే. ఈ రేఖ మన లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలను ఆనుకొని ఉంది. ఉభయ దేశాల సమ్మతితో కూడిన స్పష్టమైన సరిహద్దు లేని పరిస్థితిని ఉపయోగించుకొని తాజా దురాక్రమణలకు చైనా పాల్పడుతున్నది. అంతకు ముందే 38 వేల చదరపు కి.మీ. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నది. తాజా దురాక్రమణలో మరి 5000 చదరపు కి.మీ. ప్రాంతాన్ని కబ్జా చేసిందని సమాచారం.

వీలైనప్పుడల్లా వాస్తవాధీన రేఖను తనకు అనుకూలంగా మారుస్తూ మరింత భూభాగాన్ని కాజేసే పన్నుగడతో చైనా అడుగులు వేస్తున్నది. ఒకవైపు సేనల ఉపసంహరణపై సైనికాధికారుల స్థాయి చర్చల్లో పాల్గొంటూనే మరో వంక దొంగ దెబ్బలు తీసే వ్యూహాన్ని అమలు చేస్తున్నది. భారత దేశం మరింతగా అమెరికా చెప్పుచేతల్లోకి వెళ్లిపోతున్నదనే అక్కసుతోనే చైనా ఇందుకు పాల్పడుతున్నదనే విశ్లేషణ వినవస్తున్నది. కశ్మీర్‌ను విభజించి లడఖ్‌ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడమూ దానికి రుచించలేదనే వాదన కూడా ఉన్నది. ఏమైతేనేం చైనా దుర్బుద్ధి ఎటువంటి అనుమానాలకు తావులేని విధంగా స్పష్టపడిపోయింది. దానికి తగిన గుణపాఠం చెప్పాలంటే ఆర్థికంగా భారత్ కూడా దానికి సమానమైన స్థాయిని చేరుకోవాలి. సైనికంగానూ అంతటి బలాన్ని పుంజుకోవాలి.

మనల్ని చూసి భయపడి అది ఒళ్లు దగ్గర పెట్టుకునే పరిస్థితిని సాధించాలి. అందుకోసం మరో యుద్ధాన్ని వాయిదా వేయించడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. భారత దేశం తన తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ అనే సంగతి చైనాకు బాగా తెలుసు. ఇంతటి మార్కెట్‌ను కోల్పోవడం దానిని ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురి చేస్తుంది. అందుచేత చైనా కూడా మనతో రాజీలేని వైరాన్ని కోరుకోదు. భారత చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద తలెత్తిన సంక్లిష్ట పరిస్థితికి దౌత్య మార్గాల్లోనే పరిష్కారం వెతకాలని మన విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా తాజాగా అభిప్రాయపడ్డారు. ఆయన ఈ నెల 10వ తేదీన మాస్కోలో చైనా విదేశాంగ మంత్రితో భేటీ కాగలరని సమాచారం. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు ఈ అసాధారణ సరిహద్దు ఉద్రిక్తతలను పూర్తిగా చల్లార్చగలవని, మరో భీషణ యుద్ధం వల్ల ముంచుకురాగల విపత్కర పరిస్థితులను నిరోధించగలవని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News