Saturday, May 4, 2024

ఎదురులేని హర్మన్ సేన

- Advertisement -
- Advertisement -

Indian women team

 

మెరిసిన షఫాలి, రాణించిన బౌలర్లు, బంగ్లాదేశ్‌పై భారత మహిళల జయకేతనం

పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో భారత్ 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ సేన సెమీఫైనల్‌కు మరింత చేరువైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించిన భారత్ వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో గెలుపును సొంతం చేసుకుంది.

ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియాను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఇక, బంగ్లాదేశతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. యువ సంచలనం షఫాలి వర్మ (39) విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకుంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది.

భారత బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు మరో చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ షమీమా సుల్తానా (3) శిఖా పాండే ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే వెనక్కి పంపింది. అయితే మరో ఓపెనర్ ముర్షిదా ఖతూన్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. ధాటిగా ఆడుతూ స్కోరును పరిగెత్తించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ముర్షిదా 4 ఫోర్లతో 30 పరుగులు చేసి అరుంధతి బౌలింగ్‌లో ఔటైంది. మరోవైపు వికెట్ కీపర్ నిగర్ సుల్తానా కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బంగ్లా ఆశలను సజీవంగా ఉంచింది. చూడచక్కని షాట్లతో అలరించిన నిగర్ స్కోరును పరిగెత్తించింది. మరోవైపు సహచరులు ఒక్కోక్కరూ పెవిలియన్ దారి పట్టడంతో నిగర్ మెరుపులు వృథాగా మారాయి.

కీలక సమయంలో భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లాను ఒత్తిడిలోకి దించారు. ఇక, స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో నిగర్ కూడా పెవిలియన్ బాట పట్టింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన నిగర్ ఐదు ఫోర్లతో 35 పరుగులు చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. మరోవైపు ఫహిమా ఖతూన్ (17), రుమానా అహ్మద్ (13), జహనారా ఆలమ్ (10) రాణించినా బంగ్లాను గెలిపించలేక పోయారు. చివరి ఓవర్లలో భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్‌కు మూడు, అరుంధతి, శిఖా పాండేలకు రెండేసి వికెట్లు లభించాయి.

షఫాలి విధ్వంసం
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు యువ ఓపెనర్ షఫాలి వర్మ అండగా నిలిచింది. బంగ్లాదేశ్ బౌలర్లను హడలెత్తించిన షఫాలి వరుస సిక్సర్లతో స్కోరును పరిగెత్తించింది. మరో ఓపెనర్ తానియా భాటియా (2) నిరాశ పరిచింది. అయితే షఫాలి ధాటిగా ఆడుతూ స్కోరు వేగం తగ్గకుండా చూసింది. ఆమెకు జెమీమా రోడ్రిగ్స్ ఆండగా నిలిచింది. ఆరంభం నుంచే షఫాలి మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.

చూడచక్కని షాట్లతో అభిమానులను కనువిందు చేసింది. చెలరేగి ఆడిన షఫాలి 17 బంతుల్లోనే రెండు ఫోర్లు, మరో నాలుగు భారీ సిక్సర్లతో 39 పరుగులు సాధించింది. మరోవైపు జెమీమా రెండు ఫోర్లు, సిక్సర్‌తో 34 పరుగులు చేసింది. చివర్లో వేదా కృష్ణమూర్తి మెరుపులు మెరిపించింది. ధాటిగా ఆడిన వేదా 11 బంతుల్లోనే నాలుగు ఫోర్లతో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో భారత్ స్కోరు 142 పరుగులకు చేరింది. ఇక, మెరుపు ఇన్నింగ్స్ ఆడిన షఫాలి వర్మకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

 

Indian women victory over Bangladesh
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News