Monday, April 29, 2024

గల్ఫ్‌లో దోపిడీకి గురవుతున్న భారతీయులు

- Advertisement -
- Advertisement -

Indians being exploited in the Gulf

 

ఆదుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిల్
కేంద్రం, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు నోటీసులు

న్యూఢిల్లీ: గల్ఫ్‌దేశాల్లో పాస్‌పోర్టులు పోగొట్టుకున్న భారతీయ కార్మికులను వాపసు తీసుకు రావడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, వారి సంక్షేమం కోసం పథకాలను అమలు చేయాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి, సిబిఐకి, 12 రాష్ట్రాలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు ఎన్‌వి రమణ, సూర్యకాంత్, అనిరుద్ధ బోస్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, సిబిఐతో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. చాలా కేసుల్లో గల్ఫ్ దేశాల్లోని భారత దౌత్యకార్యాలయాలు క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని, మిగతా దేశాలలాగా భారతీయ వర్కర్లను వెనక్కి తీసుకు రావడానికి కృషి చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ చెప్పారు. గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బసంత్ రెడ్డి పాత్కూరి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఉపాధి వెతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్తున్న భారత కార్మికులు దళారీలు, ఏజంట్లు, యజమానుల మోసాలకు గురవుతున్నారని, వారిని ఆదుకోవడానికి తగిన మార్గదర్శకాలను జారీ చేయాలని ఆయన తన పిల్‌లో కోరారు. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో చనిపోయిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకు రావడానికి సంబంధించి, అలాగే పాస్‌పోర్టులు కోల్పోయిన లేదా అక్కడ బలవంతపు వెట్టి చాకిరీ చేస్తున్న వారిని వెనక్కి తీసుకు రావడానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆయన తన పిటిషన్‌లో కోరారు. అలాగే గల్ఫ్ దేశాల్లో మరణ శిక్షలను ఎదుర్కొంటున్న 44 మంది భారతీయులకు, అక్కడి జైళ్లలో ఉంటున్న 8,189 మందికి న్యాయసహాయాన్ని అందించాలని కూడా ఆయన ఆ పిటిషన్‌లో కోరారు. ‘ దేశంలోని వివిధ రాష్ట్రాలనుంచి చాలా మంది భారతీయులు కార్మికులు, డ్రైవర్లు, హెల్పర్లు, సేల్స్ పర్సన్స్, ఇళ్లలో పనివాళ్లుగా పనులు చేయడం కోసం గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్తున్నారు. వీరిలో చాలా మంది పెద్దగా చదువు లేని వారే.

అక్రమ ఏజంట్లు వారికి ఉద్యోగాల ఆశ చూపి టూరిస్టు వీసాలపై గల్ఫ్ దేశాలకు పంపుతున్నారు. అయితే అక్కడికి చేరిన తర్వాత వారిని వెనక్కి పంపించడమో లేదా స్థానిక ఏజంట్లకు అమ్మేయడమో చేస్తున్నారు. దీనివల్ల అక్కడి భారతీయ వర్కర్ల పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉండడం లేదు. ఫలితంగా చాలా మంది కార్మికులు కట్టు బానిసలుగా, వెట్టి కార్మికులుగా మారుతున్నారని, అక్కడి ఏజంట్లకు అమ్మేపిన వారిని స్వదేశాలకు పంపిస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి’ అని బసంత్ రెడ్డి తన పిటిషన్‌లో వివరించారు. మహిళా కార్మికులను బలవంతగా సెక్స్ వర్కర్లుగా మార్చడం లేదా చిత్రహింసలకు గురి చేయడం లాంటివి చేస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News