Sunday, May 12, 2024

అదృశ్య పాజిటివ్‌లే అసలు సవాల్

- Advertisement -
- Advertisement -

Coronavirus

 

లక్షణాలున్న కేసుల కన్నా లక్షణాలులేని కేసులే ఎక్కువ
గుర్తించడం సమస్యగా మారిందంటున్న వైద్య వర్గాలు

రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యశాఖ వర్గాలు ఇప్పుడున్న సవాలక్ష సవాళ్లకు తోడు సరికొత్త వింత సవాలును ఎదుర్కొంటున్నాయి. కరోనా లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల వివరాలతో వారి కాంటాక్టులను పరీక్షిస్తుంటే పాజిటివ్‌లుగా నిర్ధారణ అయిన వారి కన్నా లక్షణాలు లేకుండానే పాజిటివ్‌లుగా తేలుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అదృశ్య క్యారియర్లు ఎంత మంది ఉన్నారో ఎలా గుర్తించాలో అర్థం కావడం లేదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగని రాష్ట్రంలో ఉన్న మొ త్తం జనాభాకు పరీక్షలు చేయడం సాధ్యం కాదు. అదే సమయంలో అదృశ్య క్యారియర్లను వదిలేయలేము. వదిలేస్తే వారికి తెలియకుండానే వారితో కాంటాక్టులో ఉన్న వారు కూడా అనేక మంది పాజిటివ్‌లుగా మారవచ్చు. ఇలా సైలెంట్ స్ప్రెడర్‌లను కనిపెట్టి పరీక్షలు చేసి ఐసోలేట్ చేయడమే తమ ముందున్న అతి పెద్ద సవాలని కరోనా వైద్య పరీక్షలు, చికిత్సలు నిమగ్నమై ఉన్న వైద్యులంటున్నారు.

తెలంగాణలోనే కాకుండా ఈ సమస్య దేశమంతటా ఉందని ఇది ఈ రోగంలో సార్వజనీనంగా మారిందని వారు చెపుతున్నారు. మొత్తం రోగుల్లో 60 శాతానికి పైగా జ్వరం, దగ్గు, తుమ్ములు, శ్వాస ఆడకపోవడం లాంటి కరోనా కనీస లక్షణాలు లేకుండా పాజిటివ్‌లుగా తేలుతున్నారని వారు చెపుతున్నారు. వీరిని కనిపెట్టే లోగా వారు ఎంత మందికి రోగాన్ని బదిలీ చేశారో చెప్పడం అంచనా వేయడం కూడా కష్టమని కూడా అంటున్నారు. దేశంలో వైద్యుల అంచనాల ప్రకారం మహారాష్ట్రలో 3648 పాజిటివ్ కేసుల్లో 65 శాతం దాకా కరోనా లక్షణాలు లేకుండా కరోనా బారిన పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో 75 శాతం, కర్నాటకలో 50 శాతం, హర్యానాలో 65 శాతం, పంజాబ్‌లో 75 శాతం దాకా కరోనా లక్షణాలు లేనివారే పరీక్షల్లో పాజిటివ్‌లుగా బయటపడుతున్నారని వారు చెపుతున్నారు. దీనికి పరిష్కారం కరోనా నిర్ధారణ పరీక్షల వేగాన్ని పెంచడమేనని అది జనాభా అంతటికీ అంటే ఏ రాష్ట్రానికి సాధ్యం కాదని వారు పేర్కొంటున్నారు.

అయితే పరీక్షల వేగాన్ని పెంచితే లక్షణాలు లేని పాజిటివ్‌ల సంఖ్య త్వరగా బయటపడి వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని వారు సూచిస్తున్నారు. 20 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులే ఎలాంటి లక్షణాల్లేకుండా బయట తమకు రోగం ఉందని తెలియక తిరుగుతున్నారని వారు చెపుతున్నారు. వీరిలో రోగ లక్షణాలు లేకపోవడానికి కారణం వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వైరస్ లోడ్ ఎక్కువగా లేకపోడం, యుక్త వయస్కులై ఉండడం ప్రధాన కారణాలై ఉండవచ్చని వైద్యులు చెపుతున్నారు. అయితే వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు, 60 ఏళ్లకు పైబడిన వారు, వ్యాధి నిరోధక శక్తిలేని వారే కరోనా లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారని వారు వివరిస్తున్నారు. వీరు ఆసుపత్రులకు చేరిన వెంటనే వీరిని ఎవరెవరు కలిశారని ఆరా తీసి వారికి కూడా పరీక్షలు చేస్తుంటే వారికి కనీసం దగ్గు, జ్వరం లేకుండా కూడా పాజిటివ్‌లుగా తేలడం తమను విస్మయపరుస్తుందని వారంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు 10 లక్షలకు 375 మందికి చేస్తున్నారు.

ప్రతిరోజూ 9 ప్రభుత్వ ల్యాబ్‌ల ద్వారా 1560 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని మిగతా ఇతర రాష్ట్రాతో పోల్చి చూస్తే పరీక్షల శాతం ఎక్కువగానే ఉన్నా, రీకవరీల రేటు మెరుగ్గా ఉన్నా, మరణాల రేటు తక్కువగా ఉన్నా అదృశ్య కరోనా కేసులను గుర్తించి వారిని ఐసోలేట్ చేయడమే సమస్యగా మారిందని ఈ విచిత్ర సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని వారంటున్నారు. ప్రస్తుతం ఇలాంటి కేసులను కనుక్కోవాలంటే రెండు రకాల టెస్టులు మార్గంగా ఉన్నాయని ఇందులో ఒకటి ర్యాపిడ్ టెస్టింగ్ కాగా, మరొకటి పూల్ టెస్టింగ్. ఇందులో ప్రభుత్వం ప్రసిద్ధ సిసిఎంబి ద్వారా పూల్ టెస్టింగ్‌లకు సిద్ధమవుతున్నది. ఇది కాక శాశ్వత పరిష్కారమంటే ప్రతి వ్యక్తి కరోనా పరీక్షలు స్వయంగా చేయించుకోవాలి, లేదా ప్రభుత్వమే పరీక్షలు జరిపించాలి. స్వయంగా పరీక్షలు చేయించుకోవాలంటే ఎక్కడ అనేది పెద్ద సమస్య కాగా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మూడున్నర కోట్ల మందికి పరీక్షలు పరపడం సాధ్యమయ్యే విషయం కాదు.

అయితే ప్రభుత్వం రాష్ట్రంలో పరీక్షల సామర్థాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. అదృశ్య పాజిటివ్ కేసుల్లో మరో దిగ్భ్రాంతికర విషయాన్ని వైద్యులు వెల్లడించేది ఏమిటంటే కొందరు ఎలాంటి లక్షణాలు లేకుండా అనుమానంతో ప్రభుత్వం పరీక్ష చేసే లోపే పాజిటివ్‌తో చనిపోతున్నారని మరి కొందరికి చనిపోయిన తర్వాత వారు కరోనా పాజిటివ్‌తో చనిపోయారని పోస్టు మార్టం పరీక్షల్లో తేలుతున్నదని వారు చెపుతున్నారు.

 

Invisible positives are real challenge
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News