Friday, April 26, 2024

ధోనీ సేనదే తొలి గెలుపు

- Advertisement -
- Advertisement -

రాయుడు విధ్వంసం, రాణించిన డుప్లెసిస్.. ముంబైకు చెన్నై షాక్

IPL 2020 2nd match between RCB vs KXIP

అబుదాబి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన చెన్నై 19.2 ఓవర్లలోనే కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకి ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. ఓపెనర్లు షేన్ వాట్సన్(5), మురళీ విజయ్(1) నిరాశ పరిచారు. దీంతో చెన్నై ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యత అంబటి రాయుడు, డుప్లెసిస్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ స్కోరును పరిగెత్తించారు. రాయుడు తన మార్క్ షాట్లతో చెలరేగి పోయాడు. ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. చెలరేగి ఆడిన రాయుడు 48 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 71 పరుగులు చేశాడు. ఈ క్రమంలో డుప్లెసిస్‌తో మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించాడు. మరోవైపు సమన్వయంతో ఆడిన డుప్లెసిస్ 44 బంతుల్లో ఆరు ఫోర్లతో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శామ్ కరన్ (18), జడేజా (10) తమవంతు సహకారం అందించారు.
శుభారంభం లభించినా..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ శుభారంభం అందించారు. ఇద్దరు చెరో ఫోర్ కొట్టడంతో తొలి ఓవర్‌లో 12 పరుగులు లభించాయి. డికాక్ దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. రోహిత్ అతనికి అండగా నిలిచాడు. చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న డికాక్ 20 బంతుల్లోనే ఐదు ఫోర్లతో 33 పరుగులు చేశాడు. మరోవైపు రోహిత్ రెండు బౌండరీలతో 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో 46 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే డికాక్ కూడా ఔటయ్యాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యత సౌరభ్ తివారి తనపై వేసుకున్నాడు. అతనికి సూర్యకుమార్ అండగా నిలిచాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే రెండు ఫోర్లతో 17 పరుగులు చేసిన సూర్యకుమార్‌ను దీపక్ చాహర్ వెనక్కి పంపాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన తివారి 31 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు రెండు సిక్సర్లు కొట్టి జోరు మీద కనిపించిన హార్దిక్ పాండ్య (14) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ముంబైని దెబ్బతీశాడు. ఇక పొలార్డ్ ఒక ఫోర్, మరో సిక్స్‌తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ఎంగిడి కీలక సమయంలో వెంటవెంటనే మూడు వికెట్లు తీసి ముంబైని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పియూష్ చావ్లా 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. శామ్ కరన్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో ముంబై 162 పరుగులకే పరిమితమైంది.

IPL 2020: CSK Beat Mumbai Indians by 5 Wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News