Saturday, May 4, 2024

రాజస్థాన్‌కు పరీక్ష

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌కు పరీక్ష
నేడు చెన్నైతో తొలి పోరు

షార్జా: యుఇఎ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో రాజస్థాన్ రాయల్స్ మంగళవారం తన తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీకి శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో రాజస్థాన్ ఉంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ బరిలోకి దిగుతాడా లేదా అనేది ఇంకా తేలలేదు. ఇక స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ వ్యక్తిగత కారణాలతో ఐపిఎల్‌కు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడు. మరోవైపు అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఇంత వరకు జట్టులో చేరలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రాజస్థాన్ తన ఆరంభ మ్యాచ్‌ను ఆడనుంది. ఇదిలావుండగా చెన్నై ఇప్పటికే బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. అంబటి రాయుడు అద్భుత ఫామ్‌లో ఉండడం చెన్నైకి శుభపరిణామంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో రాణించేందుకు అతను సిద్ధంగా ఉన్నాడు. బౌలర్లు కూడా జోరు మీదున్నారు. దీంతో చెన్నై ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తేలికేం కాదు
ఇక, చెన్నైతో జరుగుతున్న తొలి మ్యాచ్ రాజస్థాన్‌కు కీలకంగా మారింది. స్మిత్ ఇంకా గాయం నుంచి కోలుకోక పోవడంతో ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే బట్లర్ జట్టుకు దూరం కావడం రాజస్థాన్ కష్టాలను రెట్టింపు చేసింది. ఒక్క మ్యాచ్ ఆడకుండానే రాజస్థాన్‌కు బట్లర్ రూపంలో షాక్ తగిలింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బట్లర్‌పై రాజస్థాన్ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే బట్లర్ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుని రాజస్థాన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. దీనికి తోడు స్మిత్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడం కష్టాలను మరింత పెంచాయి. ఇలాంటి స్థితిలో జట్టు చెన్నై వంటి బలమైన జట్టుకు ఏ మేరకు పోటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా తయారైంది. ఇక రాబిన్ ఉతప్పపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఉతప్ప మెరుపులు మెరిపిస్తే రాజస్థాన్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరి పోతాయి. మరోవైపు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై కూడా అందరి దృష్టి నిలిచింది. దేశవాళి క్రికెట్‌లో, అండర్19 విభాగంలో పరుగుల వరద పారిస్తున్న జైస్వాల్‌ను రాజస్థాన్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యశస్వి భావిస్తున్నాడు. రియాన్ పరాగ్, సంజు శాంసన్, డేవిడ్ మిల్లర్, శ్రేయస్ గోపాల్ వంటి స్టార్లు కూడా రాజస్థాన్‌కు అందుబాటులో ఉన్నారు. దీంతో రాజస్థాన్ భారీ ఆశలతో మ్యాచ్‌కు సిద్ధమైంది.
జోరు మీదుంది
మరోవైపు ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక విజయం సాధించిన చెన్నై ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని తహతహలాడుతోంది. రాజస్థాన్‌తో పోల్చితే అన్ని విభాగాల్లోనూ చెన్నై బలంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో విఫలమైన విజయ్, షేన్ వాట్సన్‌లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మొదటి మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపించిన అంబటి రాయుడు, డుప్లెసిస్‌లు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. జడేజా, శామ్ కరన్ రూపంలో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు చెన్నైకి అందుబాటులో ఉన్నారు. అంతేగాక పియూష్ చావ్లా కూడా మొదటి మ్యాచ్‌లో పదునైన బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. కాగా, బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న చెన్నై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

IPL 2020: RR vs CSK Match tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News