Monday, April 29, 2024

సంపాదకీయం: ఇరాన్ కొత్త సారథి

- Advertisement -
- Advertisement -

covid 19 second wave in india

అత్యల్ప ఓటింగ్ నమోదైన శుక్రవారం నాటి ఎన్నికల్లో ఇరాన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న తీవ్ర మతవాది ఇబ్రహీం రైసీ ఏలుబడి ఎలా ఉంటుంది, అమెరికాతో శత్రుత్వం పలచబడి, మోడువారిన అణు నిస్సార ఒప్పందం తిరిగి ప్రాణం పోసుకుంటుందా? ఇరాన్ ప్రజలను అసాధారణ ఇబ్బందుల్లోకి నెట్టివేసిన అమెరికా ఆంక్షలు సడలిపోయి నిరుద్యోగం వంటి సమస్యల సెగ చల్లారుతుందా? బద్ధ శత్రువు సౌదీ అరేబియాతో మళ్లీ సఖ్యత నెలకొంటుందా? సంప్రదాయం ప్రకారం రైసీ వచ్చే ఆగస్టులో అధికార పగ్గాలు చేపడతాడు. అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత మొదటిసారిగా సోమవారం నాడు మీడియా గోష్ఠిలో పాల్గొన్న రైసీ అణు ఒప్పందంపై నామ మాత్రపు సాగతీత చర్చలను అనుమతించబోమని స్పష్టం చేశాడు. ఫలితం కలుగుతుందనే హామీ ఉంటేనే చర్చల్లో పాల్గొంటామని లేకపోతే లేదని కుండ బద్దలు కొట్టాడు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2015 లో ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరింది. ఇరాన్ తన అణ్వస్త్ర కార్యక్రమాన్ని వదులుకోడానికి అందుకు బదులుగా అమెరికా ఆంక్షలు ఎత్తి వేయడానికి అంగీకరించారు. ఈ ఒప్పందం పై అమెరికాతో కలిసి బ్రిటన్, చైనా, ఫ్రాన్సు, జర్మనీ, రష్యా కూడా సంతకాలు చేశాయి. కరడుగట్టిన మితవాది, ఇజ్రాయెల్‌కు మితిమించిన హితుడుగా చాటుకున్న డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టగానే ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసి మళ్లీ ఆంక్షలు విధించాడు.

సహ సంతకందార్లు వద్దన్నా వినిపించుకోలేదు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ ఒప్పందానికి తిరిగి ప్రాణం పోయడానికి సుముఖంగా ఉన్నట్టు సూచనలు వెలువడ్డాయి. ఇందుకు తెర వెనుక సన్నాహాలు సాగుతున్నట్టు వార్తలు చెబుతున్నాయి. జో బైడెన్‌ను కలుసుకునే ప్రసక్తే లేదని రైసీ ప్రకటించాడు. అమెరికాను ఇరాన్ ద్వేషించినంతగా బహుశా మరే ఇతర దేశమూ అసహ్యించుకోదు. అమెరికా విధానాలను ఎదుర్కోడంలో అది ఇప్పటికీ ఏ మాత్రం రాజీ పడడం లేదు. ఇస్లామిక్ దేశాల మధ్య గల అంతర్గత తేడాలను రెచ్చగొట్టి, తంపులు పెట్టి, యుద్ధాలు జరిపించి, ఇజ్రాయెల్‌ను మితిమించి ఉసిగొల్పి పబ్బం గడుపుకుంటున్న అమెరికా అంటే ఇరాన్‌కు వల్లమాలిన కసి. అణు ఒప్పందం పునరుద్ధరణ జరగాలంటే తనపై విధించిన మొత్తం ఆంక్షలన్నింటినీ అమెరికా ఒకేసారి రద్దు చేయాలన్నది ఇరాన్ షరతుగా బోధపడుతున్నది.

ఇందుకు భిన్నంగా ఆంక్షల పాటింపు నుంచి క్రమ క్రమంగా ఒక్కొక్క దేశానికి స్వేచ్ఛనివ్వాలని అమెరికా సంకల్పిస్తోంది. కేవలం తాను ఆంక్షలను పాటించడమే కాకుండా తన చెప్పుచేతల్లోని మిగతా దేశాలన్నీ ఇరాన్‌ను వెలివేసేలా అమెరికా చేసింది. కట్టు తప్పితే వాటిపై కూడా ఆంక్షలు విధిస్తానని బెదిరించడంతో భారత్ సహా అనేక దేశాలు ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు, ఇచ్చిపుచ్చుకోడాలు దాదాపు తెంచుకున్నాయి. ఇరాన్ వద్ద అపారమైన ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు, వెలికి తీసిన నిల్వలున్నాయి. ప్రస్తుతం 10 కోట్ల బ్యారెళ్లకు మించిన క్రూడాయిల్ దాని వద్ద ఉన్నట్టు అంచనా. ఆంక్షలు పూర్తిగా రద్దైతే రోజుకు 20 లక్షల బ్యారెళ్ల క్రూడ్‌ను ఉత్పత్తి చేసే సామర్థం ఇరాన్‌కున్నది. ఆ క్రూడాయిల్ ప్రపంచ మార్కెట్‌లోకి వెల్లువెత్తి వచ్చిపడితే అంతర్జాతీయ క్రూడ్ ధర బాగా తగ్గుతుంది. ఆంక్షలకు పూర్వం భారత్ సులభ పద్ధతిలో ఇరాన్ నుంచి పొందుతూ వచ్చిన క్రూడ్ సరఫరా తిరిగి మొదలై మన బాధలు కొంతమేరకైనా తొలగుతాయి. ఇరాన్‌కు చైనాతో మంచి సంబంధాలున్నాయి. అమెరికాతో శత్రుత్వం వల్ల తన ప్రజలకు ఎదురవుతున్న నష్టాలను చైనా సాయంతో అది కొంత వరకు భర్తీ చేయగలుగుతోంది. దేశంగా ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వం రైసీ మీద వ్యక్తిగతంగా అనేక పరిమితులను సంధించింది.

ఇరాన్‌లో 2009లో తలెత్తిన అసమ్మతిని అణచివేసిన క్రమంలో అనేక మంది నిరసనకారులను చంపించాడన్న ఆరోపణతో రైసీపై ట్రంప్ ఈ ఆంక్షలు విధించాడు. దేశ ప్రజల నిరుద్యోగాన్ని, దారిద్య్రాన్ని తొలగించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వదలిస్తే రైసీ అమెరికాతో అణు ఒప్పందం పునరుద్ధరణకు దోహదపడతాడు. కాని పక్షంలో రెండు దేశాల మధ్య వైరం మరింత బిగుసుకొని ఇరాన్ సమీప జలాల్లో రాకపోకలు సాగించే ఆయిల్ నౌకలపై దాడులు పెరిగే ప్రమాదముందని పరిశీలకులు భావిస్తున్నారు. అవి ఆ ప్రాంతానికీ, ప్రపంచానికీ సంక్షోభాన్ని మరింతగా పెంచుతాయి. రైసీ కరడుగట్టిన మతోన్మాది కాబట్టే 2017 అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది హసన్ రౌహానీ చేతిలో ఓడిపోయిన తర్వాత నియంత ఖమేనీ ఆయనను దేశ ప్రధాన న్యాయమూర్తి చేశాడని, ఇప్పటి ఎన్నికల్లో గట్టి ప్రత్యర్థులు ముగ్గురిని పోటీ నుంచి తప్పించి రైసీ గెలుపొందడానికి దారి తీశాడనీ భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ జరిగింది. ఆంక్షల మూలంగా తమ బతుకులు నాశనమవుతున్నాయన్న అసంతృప్తితో ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అది కూడా అమెరికా కల్పించిన వ్యతిరేకతే కదా!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News