Saturday, April 27, 2024

సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత, గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గతేడాది మార్చి 14న కవిత సుప్రీంను ఆశ్రయించారు. సిఆర్‌పిసి నిబంధనల ప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయకూడదని, ఈ మేరకు ఇడిని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కవిత తరఫు న్యాయవాదులు కోరగా, అందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. మార్చి 24న విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పుడూ వాయిదా పడి, చివరకు 27న తొలిసారి ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ రిట్ పిటిషన్‌పై అప్పటికే ఇడి కెవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో రెండింటిపై సుప్రీం విచారించింది. అప్పటి నుంచి ఈ వ్యాజ్యం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. సంవత్సర కాలంగా కోర్టులో నలుగుతున్న ఈ పిటిషన్‌పై ఈ నెల 15న మరోమారు విచారించిన సుప్రీం, ఇరువురి తరఫు న్యాయవాదుల సుధీర్ఘ వాదనల అనంతరం మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం మరోసారి దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

అయితే ఈ కేసులో ఇప్పటికే కవిత అరెస్ట్ కావడంతో ఈ రిట్ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని భావించిన ఆమె తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి తమ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పిటిషన్ ఉప సంహరణకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ బెంచ్ అనుమంతిచారని తెలిపారు. ఈ కేసులో చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితతో పాటు వైఎస్సార్‌సిపి ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి చెందిన బినామీలు అరుణ్ రామచంద్రపిళ్లై, ప్రేమ్ రాహుల్, సౌత్ గ్రూపు ద్వారా ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించి, మద్యం విధానాన్ని అనుకూలంగా మలచు న్నారని ఇడి అభియోగం మోపింది. దీనిపై గతేడాది మార్చి 11న తొలిసారి కవితను విచారించిన ఇడి అధికారులు, 16న మరో సారి హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఈ సమన్లను సవాల్ చేస్తూ అదే నెల 14న కవిత సుప్రీంలో అత్యవసర విచారణ (రిట్) పిటిషన్ దాఖలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News