Friday, May 17, 2024

మూడో సారి కెసిఆరే ముఖ్యమంత్రి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పాలనలోనే తెలంగాణ సురక్షితం
పోటీ చేసే అన్ని స్థానాల్లో తమ విజయం ఖాయం
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మూడో సారి కెసిఆరే ముఖ్యమంత్రి అవుతారని ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం బిఆర్‌ఎస్ పాలనలోనే సురక్షితంగా ఉంటుందని ఆయనన్నారు. సోమవారం భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ పై అసదుద్దీన్ ఒవైసి పై విధంగా స్పందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్దివైపు దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుందనే విషయాన్ని ఆయన దాటవేశారు. సమయం ఉంది, వేచిచూడాలని, తమ పార్టీ పోటీ చేస్తే అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని పూర్తి ధీమా వ్యక్తం చేశారు.

రాజస్థాన్‌లో తమ పార్టీ తొలిసారిగా పోటీ చేస్తోందని, ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ఎంఐఎం ప్రకటించిందని అసదుద్దీన్ తెలిపారు. మరిన్ని స్థానాల్లో పోటీ చేసే విషయమై అక్కడి స్థానిక నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి సమస్యలు భిన్నంగా ఉంటాయని, రాజస్థాన్‌లో ఉన్న సమస్యలు తెలంగాణకు భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ముస్లింలకు రాజకీయ నాయకత్వం సమస్యగా మారిందన్నారు. రాజకీయాల్లో , ముఖ్యంగా చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం పెరిగినపుడే అది ముస్లింల అభివృద్ధికి, సాధికారతకు తోడ్పతుందన్నారు.

ఐఎంఐఎం బిజెపికి బిటీమ్ అని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణపై ఆసదుద్దీన్ స్పందిస్తూ 2004 నుంచి 2012 వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపిఎకు ఎఐఎంఐఎం మద్దతు ఇచ్చినప్పుడు, ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. వారు రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు కోరారు, అవిశ్వాస తీర్మానం సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఈ నకిలీ సెక్యులర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను ఇంకా చాలా చెప్పగలనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ చిట్లా తన దగ్గర ఉందని, చంద్రబాబు పని అయిపోగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి జీవితమంతా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ తోనే ముడిపడి ఉందని అసదుద్దీన్ అన్నారు. దశాబ్ధాల పాటు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డితోనే కలిసి తిరిగారని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News