Saturday, April 27, 2024

ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కర్త

- Advertisement -
- Advertisement -

KCR

 

దార్శనికుడు, పేదల సేవకుడు

‘కలలుకనండి, ఆ కలలు నిజం చేసుకోవటానికి లక్ష్యాలను నిర్దేశించుకోండి” అని చెప్పటానికంటే ముందునుంచే అనేక కలలనుకన్నాం. “అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగమందెంత దూరం” అంటూ దాశరథి పాటను వూరూరా పాడుకుంటూ తిరిగి పరవశించిపోయినం. చివరకు తేలిందేమిటంటే నేనకున్న భావాలు నా జీవితకాలంలో ఆచరణ రూపుదాల్చేటట్లు లేదు. మనుషులందరూ సమాజంలో చీలిపోయి ఉన్నారు. మార్కెట్ సమాజం నగ్నంగా కుటుంబాల్లోకి ప్రవేశించింది.సమాజ రూపురేఖలు గతం కంటే వేగంగా మారిపోతున్నాయి. అన్నార్తులు, అనాధల సంఖ్య పెరుగుతూపోతూ ఉంది. తెలంగాణ సమాజమంతా ఒక దగ్గరికివస్తదా? అంటే అదీ ఒక కలే అనే స్థితి. ఆ సమయంలో ఎగిసిన తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం అందర్నీ ఒకటి చేసింది. తెలంగాణ మహాసమాజానికి రాజకీయ ప్రక్రియ ద్వారా టీఆర్‌ఎస్‌ను స్థాపించి తెలంగాణ మలిదశ ఉద్యమానికి శంఖారావం పూరించిన వ్యక్తి కేసీఆర్. అందర్నీ ఒక ఉద్యమ తాటిపైకి తెచ్చిన అసాధారణ వ్యక్తి కేసీఆర్. ఉద్యమ సాధకుడే తెలంగాణ రాష్ట్ర పాలనాపగ్గాలు చేపట్టటం మరో అరుదైన సందర్భం.

సాధించుకున్న తెలంగాణను చూసి తెలంగాణ సమాజం మురిసింది. తెలంగాణను నిర్మించుకుంటూపోయే సందర్భం పునర్నిర్మాణ ఉద్యమంగా ముందుకుసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ దార్శనికునిగా చేస్తున్న ప్రతిపని దేశవ్యాపితంగా ఆదరణ పొందటమేగాక అది దేశానికే మార్గదర్శనంగా మారిపోయింది. రాష్ట్రం వస్తే ఏం జరుగుతది చెప్పండి, భౌగోళిక బెర్రలు మారటం తప్ప ఏంవొరుగుతుందని అడ్డంగా విమర్శలు చేసిన వారంతా నోళ్లువెళ్లబెట్టి చూశారు. జరుగుతున్న అభివృద్ధిని నిర్మాణాత్మకమైన పనులను చూసి ఇక్కడ జరిగే అభివృద్ధి పనుల నమూనాను పలురాష్ట్రాలు, దేశం ఆచరించే దశకు వచ్చింది. ఇది మంచి పరిణామం.

కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో రాష్ట్రం విజయపరంపరగా ముందుకు సాగుతుంది. అధికారం కోసం ఎదురుచూసేవాళ్లు ఎన్నికలప్పుడు అరిచీఅరిచీ అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా ఎంత మాట్లాడినా బ్యాలెట్ పత్రాలు కూడా మౌన అంగీకారంతో కేసీఆర్ పాలనకే సిరాచుక్కలు పెట్టి దీవించాయి. ప్రజలపక్షం వహించి పనిచేస్తున్నంత కాలం ఆ పాలకుణ్ణి కదిలించటం ఎవరివల్లా జరిగేది కాదు. కేసీఆర్ పాలకునిగా కాక పేదల ఇంటిదగ్గర సేవకునిగా ప్రభుత్వాన్ని మార్చివేశారు. ఇది బహిరంగంగా అందరికీ కనిపిస్తున్నా, కొన్ని ఆధిపత్య వర్గాలకు మాత్రం ఇంకా కనిపించట్లేదు. గతానికి, ఇప్పటి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మాత్రం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలే గీటురాళ్ళు అని చెప్పడానికి ఇది చాలు. విమర్శించే వాళ్లు ఎన్ని రాళ్లు వేసినా అవి సమర్థవంతమైన పాలనకు అవి పూలమాలలుగా మారిపోతాయి. ఇప్పుడదే జరుగుతుంది. విమర్శకు విసిగిపోయి చేతులెత్తేసినా కొందరు మాత్రం తమ పాత అరుపులను మాత్రం మానుకోవటం లేదు.

తెలంగాణ బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీల రాష్ట్రం. ఆ వర్గాలు శిరసెత్తుకుని నిలిచి అన్ని రంగాలలో అగ్రభాగాన నిలవాలి. అందుకే పునర్నిర్మాణ ప్రక్రియ ఆ దిశగానే కొనసాగుతోంది. “సంపదపెంచాలి. అది అందరకూ పంచాలి” అన్న దిశలో అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి అట్టడుగు దళిత, బహుజన, గిరిజన సమాజం, సబ్బండవర్ణాలు, వర్గాలు అండగా నిలుస్తాయి, నిలుస్తున్నాయి. పాచిపట్టి జారుడుబండగా మారిన 70 ఏళ్ల రాజకీయ వ్యవస్థను చెక్కిపారేయకుండా కొత్తదార్లను నిర్మించలేరు. ఆ పని కూడా పునర్నిర్మాణంలో భాగంగా జరుగుతుంది. అధికారం కోసం మాత్రమే అర్రులు చాచేవాళ్ల వెనుక ఏ సమాజమూ నిలవదు. 53 కేజీలు దాటని ఒక బక్కపల్చటి మనిషి ఒక్కడు ఈ రాష్ట్రానికి ఏంజేశాడని చూస్తే గతమంతా ఏమిటన్న ప్రశ్న నా కళ్ల ముంగిట కన్పిస్తుంది.

నా చిన్నప్పుడు సోవియట్ ల్యాండ్ పుస్తకాలలో ఎడారులను సస్యశ్యామలం చేస్తూ ఆకుపచ్చవనాలుగా మార్చి, పసిడి పంటల భూమిగా మార్చిన దృశ్యాలను చదివి పులకరించిపోయాను. అలాంటి స్థితి నా తెలంగాణకు ఎప్పుడొస్తుందో కదా అని సరిపోల్చుకుని చూసుకున్నాం. కళాశాల చదువులు పూర్తిచేసుకుని జీవితాల్లోకి ప్రవేశించాక నీళ్లులేని భూముల్ని చూసి, తెలంగాణ పొక్కిలైన తీరును కవిత్వంగా రాసుకుంటూ పోయాను. “తల్లి స్తన్యం బిడ్డకు అందనప్పుడు వేసిన కేక నా తెలంగాణ” అంటూ “నా తెలంగాణ” దీర్ఘకవితను రాసుకున్నాను. జర్నలిస్టుగా జీవితం గడుపుతూ ఇజ్రాయిల్ పోయివచ్చిన ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను ఇంటర్వ్యూలు చేసి అంతగా నీళ్లులేని భూమి వ్యవసాయ ఉత్పత్తులలో అగ్రగామిగా ఎలా నిలువగలిగింది? వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎలా కొత్తపుంతలు తొక్కగలిగిందని రాసి నా తెలంగాణ ఎప్పుడట్లెతదని ఆలోచించుకుంటూ మిత్రులతో చర్చించుకున్నది నిజం. చైనా దుఃఖనది దేశాన్నే అతలాకుతలం చేసేస్తుంటే ఆ నదిని టూరిజం కేంద్రాలుగా మార్చి, అభివృద్ధిగా మార్చుకున్న తీరును చూసి పులకించిపోయాం.

నా తెలంగాణకు నీళ్లులేకపోవడం వల్లనే కదా ఈ వలసలు, కరువులు అని ఆందోళనకు గురైన సందర్భాలు అనేకం. ఆకలి ఉంటేనే కదా కరువుదాడులు జరిగేది. పంటలు లేకపోతేనే కదా ఆకలిచావులు సంభవించేది.ఈ కటకటలాడుతున్న స్థితిలో గంజి అంబలి కేంద్రాలుగా మారిన మహబూబ్‌నగర్ జిల్లా ఎప్పుడు సస్యశ్యామలం అవుతుందో కదా అని అనేకానేక ప్రశ్నలు వెంటాడుతుండేవి. ఫ్లోరోసిస్‌తో వంకర్లు కొంకర్లు తిరిగిన నా ఎర్రగడ్డ నల్గొండ జిల్లా ఎప్పుడు బాగుపడేనని ఎన్నెన్నో కధనాలు రాసుకుంటూపోయాను. ఈ నేలమీదకు ఏ రుష్యశృంగుడు అడుగుపెట్టి కరువు నేలను సస్యశ్యామలం చేయాలోనని కవిత్వాలు రాసుకుంటిమి.

తెలంగాణ వచ్చినాక పంటలముఖచిత్రమే మారిపోయింది. బీడుభూములకు గంగమ్మ పొంగిపొరలి వస్తుంటే కళ్లారా చూస్తున్నాం. చెరువులన్నీ ఎండిపోయి పిల్లలకు క్రికెట్ మ్యాచ్ ఆడుకునే రీతిగా ఉండేది. మా వూరు నడిగూడెం చెరువు ఎండిపోయి తుమ్మలతోపుగా మారింది. పాతాళంలోని గోదావరి జలాలను పైకి ఎక్కించి కోటిఎకరాలకు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించిన తీరును నేను నా జీవిత కాలంలో నా తరం చూస్తుందనుకోలేదు. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాలో చిట్టచివరనున్న మా నడిగూడెం చెరువుదాకావస్తాయని కలలో కూడా వూహించలేదు. ఒకప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాలకు పనులకోసం వలసలు పోయిన నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలవాసులకు నీటిచక్రం తిరిగి రావటంతో చరిత్ర కొత్తమలుపు తిరిగింది. ఇపుడు మహబూబ్‌నగర్ జిల్లాకు పనులకోసం కర్నూల్‌నుంచి కూలీలు వలసలు వస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి నల్గొండ జిల్లాకు కూలీలు ఇప్పుడు వలస వస్తున్నారు. ఈ మార్పు కలలో కూడా ఊహించలేదు.

నాకు బాగా గుర్తు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో తెలంగాణ రచయితల వేదిక తరుపున సిరిసిల్లలో ఒక ప్రదర్శన జరిపాం. వూళ్లో కవులు, రచయితలు పాదయాత్రచేసి ఒక సభకూడా నిర్వహించాం. “చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని” జరిపిన సభలో అనేక మంది కవులు, రచయితలు పాల్గొన్నారు. ఎంతో ఆవేదనతో సిరిసిల్ల పట్టణం అంతా తిరిగి సిరులు పండిన సిరిసిల్ల ఉరితాళ్ల సీమగా మారిందని ఆవేదనతో ప్రసంగాలు చేశాం. ఇపుడు సిరిసిల్ల ముఖచిత్రం మారింది. ఉరితాళ్ల సిరిసిల్ల ఊరినిండా కార్లు కన్పిస్తున్నాయి. అది సిరిసంపదల జిల్లా అయ్యింది.

తెలంగాణ చెరువులన్నింటికీ జలకళ వచ్చింది. ఎండిన చెరువులు నిండుకుండలయ్యాయి. మా నడిగూడెం చెరువు అలుగులు పోస్తుంటే చందమామ చేపలు ఎదురెక్కుతున్న దృశ్యం మళ్లీ చూస్తానని అనుకోలేదు. అది ఇప్పుడు చూడబోతున్నాను.
తెలంగాణకున్న పరిమితవనరులతో అసాధారణ ఆర్థికశక్తిగా ఎదగటం ఒక విశేషం. హైదరాబాద్‌ను మతసామరస్య కేంద్రంగా నిలపటం గొప్ప విషయం. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉంది. ఇటీవల సీ.ఎం, పి.ఆర్వో గటిక విజయ్‌కుమార్ పుస్తకావిష్కరణ సభలో ఒక పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా మా లాఠీలకు, తుపాకులకు తెలంగాణలో పనిలేకుండా పోయిందన్నారు.

బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ వర్గాలకు చెందిన నాలుగున్నరలక్షల మంది పిల్లలు నాణ్యమైన చదువును గురుకులాల్లో చదువుతున్నారు. నాకు బాగా గుర్తు అనేకసార్లు కంచాలు పట్టుకుని అర్ధనగ్న దృశ్యాలతో “మా కొద్దు బాబోయ్ ఈ పురుగుల అన్నం” అంటూ ఉద్యమాలు చేశాం. ఇపుడు సోషల్‌వెల్ఫేర్ హాస్టళ్లలో సన్నబియ్యం, కోడి, యేటమాంసం, కోడిగుడ్డుతో శుచికరమైన మంచి పౌష్ఠికాహారం అందిస్తున్నారు. నీళ్లులేని వూళ్ల గురించి మాట్లాడిన సందర్భం నుంచి ఇంటింటికి నల్లానీళ్లు మంచినీళ్లుగా దోసిళ్లలోకి వస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ఒకటేమిటి అన్ని రంగాలు సంస్కరించబడుతున్నాయి. అన్ని శాఖలు పునర్నిర్మాణం అవుతున్నాయి. అన్నింటా తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు తనని తాను కొట్టేసుకుని తెలంగాణ నామవాచకం సర్వనామంగా మారిన కేసీఆర్ తన జన్మను సార్థకం చేసుకున్నాడు.
అన్నింటా తెలంగాణను అత్యున్నతంగా నిలిపిన
కేసీఆర్ నువ్వు నిండు నూరేళ్లు వర్థిల్లాలి
కేసీఆర్ నువ్వు పుట్టిన రోజంటే ఫిబ్రవరి 17
మాత్రమే కాదు 2014 జూన్ 2 కూడా!!
నీ పుట్టుకను ధన్యం చేసుకున్నావు
నువ్వు తెలంగాణ జన్మదినంగా మారావు
నీకు తెలంగాణ జన్మదిన శుభాకాంక్షలు.

KCR inventor of Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News