Saturday, April 27, 2024

హైకోర్టుల్లో ఖాప్ న్యాయాలు!

- Advertisement -
- Advertisement -

Khap justice in high courts! సంపూర్ణ మానవులుగా బతకడానికి ఏమేమి అవసరమో భారత రాజ్యాంగం ఎటువంటి అనుమానానికి అవకాశం లేకుండా స్పష్టం చేసింది. దేశ పౌరులకు అటువంటి వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యతను ప్రభుత్వం మీద వుంచింది. అందుకు తగిన చట్టాల రూపకల్పన కూడా జరిగింది. కాని ప్రజల వాస్తవ జీవన పరిస్థితులే వారి మనుగడను శాసిస్తున్నాయి. వారికి సంక్రమించవలసిన హక్కులను, స్వేచ్ఛలను అనేక సందర్భాల్లో అవే హరిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఇది కాదనలేని కఠోర సత్యం. తాము మానభంగం చేసిన అభాగినులను పెళ్ళి చేసుకోడానికి అంగీకరించినందుకు ఐదుగురు రేపిస్టులకు లక్నో హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న వార్త ఆ స్త్రీల దయనీయ స్థితిని ప్రతిబింబిస్తున్నది. ఈ కేసుల్లో రేప్‌కు గురైన యువతులు గర్భవతులై పిల్లలను కూడా కన్నారు. యాసిడ్ దాడి చేసి యావజ్జీవ శిక్ష పడి 8 ఏళ్ళు జైల్లో వున్న వ్యక్తి బాధితురాలిని పెళ్ళాడడానికి ఒప్పుకోడంతో అతడిని బొంబాయి హైకోర్టు విడుదల చేసిన ఘటన 2018లో సంభవించింది. రేప్ ద్వారా గర్భవతులై పిల్లలను కూడా కన్నారని సమాజం వేలెత్తి చూపించడాన్ని భరించలేక, అలా కన్నబిడ్డలను పోషించే స్తోమతులేక ఆ యువతులు తమను మోసం చేసిన వ్యక్తులనే పెళాడవలసి వచ్చిందని రుజువవుతున్నది. మామూలుగా చైతన్యం గల ఏ స్త్రీ కూడా ఈ స్థితిని కోరుకోదు.

రాజ్యాంగం, చట్టంతో సంబంధం లేని, కేవలం కర్ర పెత్తనంతో రాజ్యం చేసే ఖాప్ పంచాయతీల్లో మాత్రమే ఇటువంటి తీర్పులు ఇస్తారు. ఉత్తరాదిలో వాటికి కొదువ లేదు. కాని వ్యక్తి ఆత్మగౌరవానికి విలువ ఇచ్చే రాజ్యాంగం కింద ఏర్పడిన ఉన్నత న్యాయ స్థానాలు కూడా ఇటువంటి తీర్పులనే ఇవ్వడం ఆశ్చర్యకరం. రేపిస్టుతో పెళ్ళికి బాధితురాలు, ఆమె తండ్రి ఒప్పుకున్నందున రేప్ చేసిన మోను అనే వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తున్నానని లక్నో హైకోర్టు సింగల్ జడ్జి ధర్మాసన న్యాయమూర్తి దినేశ్ కుమార్ సింగ్ ఇటీవల ప్రకటించారు. యువతిని అపహరించుకొనిపోయి అత్యాచారం చేశాడనే కారణం మీద పోక్సో చట్టం కింద మోనును అరెస్టు చేశారు. అతడు 2022 ఏప్రిల్ నుంచి జైల్లో వున్నాడు. 19 ఏళ్ళ యువతిని రేప్ చేసి విష ప్రయోగం కూడా జరిపి బెదిరించి, నిర్బంధంలో వుంచినందుకు 2021 నవంబర్‌లో అరెస్టయిన శోభన్ అనే మరో వ్యక్తికి కూడా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకున్నాడన్న కారణంతో బెయిల్ మంజూరు చేశారు. ఇతడు అరెస్టయిన సమయానికే ఆ అమ్మాయి 7 మాసాల గర్భవతి. ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి. ఇలా ఐదు కేసుల్లో రేప్‌కు గురై గర్భవతులైన తమ బిడ్డలు భవిష్యత్తులో ఎలా బతుకుతారో, సమాజం వారిని బతకనిస్తుందో లేదో అనే భయంతో తలిదండ్రులు నేరస్థుడికే ఇచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరించడం, దానికి న్యాయ స్థానాలు కూడా ఆమోద ముద్ర వేస్తూ వుండడం ఒక విచిత్ర విషాద చట్ట విద్రోహ స్థితి. 2018లో పెళ్ళి చేసుకుంటానని చెప్పి గర్భవతులను చేసి వదిలేసిన 12568 రేప్ కేసులు నమోదయ్యాయి.

2017లో ఇటువంటి కేసులు 10553 వరకు రికార్డు అయ్యాయి. రేప్ కేసుల్లో ఎక్కువ భాగం పెళ్ళి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి అనుభవించి వదిలేసినవేనని పరిశీలనలో తేలింది. ఎలాగూ పెళ్ళి పేరుతో జరిగిందే కాబట్టి రేపిస్టును వివాహం చేసుకోడంలో తప్పేముందనే వాదన రావచ్చు. కాని హామీ ఇచ్చినట్టు పెళ్ళి చేసుకోడం వేరు, ఆ పేరుతో మోసం చేయడం వేరు. మోసం చేసిన వ్యక్తిని పెళ్ళి చేసుకోక తప్పని స్థితి చాలా బాధాకరమైనది, అవమానవీయమైనది. కొన్ని సందర్భాల్లో పెళ్ళికి అంగీకరించని యువతులను అత్యాచారానికి గురి చేసి దారికి తెచ్చుకోడం జరుగుతుంది. అది కూడా ఘోరమైన నేరమే. రేప్ చట్టం కింద వీరు శిక్షార్హులే. తమ స్వేచ్ఛను, గౌరవప్రదమైన జీవన హక్కును హరించి తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా అత్యాచారానికి గురి చేసిన పురుషుడిని కట్టుకొని జీవితాంతం బతకవలసి రావడం కంటే బాధాకరమైన పరిస్థితి వుండదు. ఇటువంటి వివాహాలు పురుషుడి దుర్మార్గాల వల్ల మధ్యలో విచ్ఛిన్నం అవుతుంటాయి. కేవలం శిక్ష నుంచి బయటపడడానికే పెళ్ళికి అంగీకరిస్తారు.

వారికి బెయిలు ఇచ్చి పెళ్ళి జరిగిన తర్వాత కోర్టు శిక్ష నుంచి విముక్తి కూడా కలిగిస్తుంది. ఆ తర్వాత ఆ యువతి భవిష్యత్తు ఏమవుతుందో న్యాయ స్థానానికి అక్కర లేదు. రేప్‌ను మహిళ పాలిట తొలగించలేని మచ్చగా భావించే పద్ధతి నిర్మూలన కావాలి. దానిని స్త్రీపై జరిగిన శారీరకమైన దాడిగా, గాయంగా మాత్రమే పరిగణించి ఆమె తలెత్తుకొని బతికేలా సమాజం ప్రోత్సహించాలి. కాని మన మగాధిపత్య సమాజం అందుకు సిద్ధంగా లేదు. చట్టం అంగీకరించకపోయినా ఇటువంటి రాజీలను న్యాయ స్థానాలు అనుమతించడం సమాజాన్ని వేల ఏళ్ళ వెనక్కి తీసుకుపోడమే. స్త్రీని కేవలం ఒక శరీరంగా చూడడమే, ఆమెకు మనసు, ఇష్టాయిష్టాలు వుంటాయని గుర్తించకపోడమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News