Monday, April 29, 2024

బీబీనగర్ ఎయిమ్స్‌పై కిషన్‌రెడ్డి తప్పుడు ప్రచారం

- Advertisement -
- Advertisement -

Kishan Reddy false propaganda against Bibinagar Aiims

వాస్తవాల వక్రీకరణ : మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : బీబీననగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోసారి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. మొన్న ఎయిమ్స్‌కు భూమి ఇవ్వలేదని ఆరోపణలు చేశారని.. సంబంధిత డాక్యుమెంట్స్ చూపించామని, ఇప్పుడు బిల్డింగ్ డాక్యుమెంట్స్, ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ అంటూ రోజుకో మాటమాటలాడుతున్నారని ఆరోపించారు. ఎయిమ్స్ విషయంలో ఈ ఏడాది అక్టోబర్ 9న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం లేఖ రాసిందని, దీన్ని సంబంధిత శాఖలతో సమన్వయం చేసి వారం రోజుల్లో టిఒఆర్ ఇచ్చేలా ప్రభుత్వం కృషి చేసిందన్నారు.

వైఎస్‌ఆర్ హయాంలో ఇప్పుడున్న బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కట్టలేదని కిషన్‌రెడ్డి అంటున్నారన్నారు. వాస్తవం ఏంటంటే గతంలో పాక్షికంగా మాత్రమే నిర్మాణం జరిగిందని, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం రూ.45కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రిని వినియోగంలోకి తెచ్చిందని..ఓపీ, డయాగ్నస్టిక్ సేవలు ప్రారంభించిందని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధన అనంతరం ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణకు ఎయిమ్స్ కేటాయించాలని కేంద్రానికి పలుమార్లు సిఎం స్వయంగా విన్నవించారన్నారు. ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణం జరిగేందుకు రెండు, మూడు సంవత్సరాల సమయం పట్టడంతో ఆయా రాష్ట్రాల్లో తరగతులు ప్రారంభించడం ఆలస్యమైందని, కానీ తెలంగాణలో నిమ్స్ కోసం నిర్మించిన భవన సముదాయాన్ని ఎయిమ్స్‌కు బదిలీ చేయడంతో తెలంగాణలో వెనువెంటనే తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

అబద్ధాలు ఆడడం లేదంటూనే..

తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎయిమ్స్ విస్తరణ ఇబ్బందికరంగా మారిందనడం పచ్చి అబద్ధమని, ప్రభుత్వం అవసరమైన భూమిని అప్పజెప్పడంతో పాటు ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ సహా అన్ని రకాల అనుమతులు అడిగిన వెంటనే మంజూరు చేసినట్లు మంత్రి హరీష్‌రావు చెప్పారు. అబద్ధాలు మాట్లాడడం లేదంటూనే కేంద్ర మంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని ఏడేళ్లుగా ప్రభుత్వం కోరుతుందని, కేంద్రమంత్రులు నడ్డా, హర్షవర్ధన్‌లకు పలుమార్లు విన్నవించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మెడికల్ కాలేజీలపై కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఫేస్ 1, 2లో ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదని, ఫేజ్-3లో ఉన్న నిబంధనల కారణంగా అవకాశం లేకపోయిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News