Monday, April 29, 2024

ఎప్పుడైనా రె’ఢీ’

- Advertisement -
- Advertisement -

KTR review on GHMC and MLC election

 

 నవంబర్ రెండో వారంలో గ్రేట్ ఫైట్
దీనికి టిఆర్‌ఎస్ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి
15 మంది కార్పొరేటర్ల పనితీరు ఏ మాత్రం బాగాలేదు
గ్రేటర్ అభివృద్ధికి ఇప్పటికే 67 వేల కోట్లు వెచ్చించాం
ఐదేళ్ళ ప్రగతిపై త్వరలో ‘ప్రగతి నివేదిక’ విడుదల చేస్తాం వచ్చే నెల 15న మరోసారి సుదీర్ఘ సమావేశం
ఏర్పాటు మంత్రి కెటిఆర్ సమీక్షా సమావేశం
హాజరైన నగర ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నగరా మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. నవంబర్ రెండో వారం తరువాత ఏ క్షణంలోనైనా ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశముంది. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సూచన ప్రాయంగా టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయ ప్రాంగణంలోని క్లబ్ హౌజ్‌లో గ్రేటర్ పరిధిలోని మంత్రులు, శాసనసభ్యులు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి పట్టభద్రుల స్థానంతో పాటు జిహెచ్‌ఎంసి ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. వారిని ఉద్ధేశించి మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధిపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.67 వేల కోట్లను వెచ్చించామన్నారు. ఇంత పెద్దమొత్తంలో గత ప్రభుత్వాలు ఎప్పుడు ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్ నగరాభివృద్ధిపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రధానంగా నగరాన్ని పట్టిపీడించిన తాగు నీటి సమస్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కరించిన ఘనత మన ప్రభుత్వానికే దక్కిందన్నారు.

గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి చేసిన కార్యక్రమాలను, పథకాలను మౌలిక వసతులకు, సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని, ఒకచోట చేకూర్చి త్వరలో ‘ప్రగతి నివేదిక‘ను విడుదల చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ ప్రగతి నివేదిక గత ఐదు సంవత్సరాల్లో తమ పనితీరుకి నిదర్శనంగా ఉండబోతుందన్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్‌ఎంసి పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ గ్రేటర్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో రానున్న గ్రేటర్ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ హవా స్పష్టంగా కొనసాగాలన్నారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ఈ సారి వందకు పైగా డివిజనల్లో కారు పెరుగులు పెట్టాలని ఆదేశించారు. ఇందుకు గ్రేటర్ పరిధిలోని మంత్రులు, శాసనసభ్యులు, స్థానిక కార్పొరేటర్లతో పాటు టిఆర్‌ఎస్ శ్రేణులంతా కలిసి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. దీని కోసం ఇప్పటి నుంచి కార్యాచరణ ప్రణాళిలకలను రూపొందించుకోవాలన్నారు.

ప్రస్తుత సిట్టింగ్ కార్పొరేటర్లంతా మళ్లీ టికెట్లు ఆశించడం సహజమే అయినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు పనితీరు ఏ మాత్రం బాగోలేదని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో కూడా స్పష్టంగా తేలిందన్నారు. అలాంటి వారి జాబితాలో కనీసం 15 మంది కార్పొరేటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. సదరు కార్పొరేటర్లంతా ఇప్పటికైనా తమ పనితీరును మెరుగపరుచుకోవాలని, లేని పక్షంలో ఆయా డివిజన్లలో పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లంతా ఇప్పటికైనా నిత్యం ప్రజల్లో ఉండాలని…గల్లీగల్లీలో తిరుగుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.

ఆ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో వాటిని నియోజకవర్గం శాసనసభ్యుల దృష్టికి తీసుకరావాలని సూచించారు. అప్పటికి పరిష్కారం కాని పక్షంలో తన దృష్టికి తీసుకరావాలని కార్పొరేటర్లకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రకటన వెలువడేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉన్న కారణంగా…ఇంకా మించిపోయింది లేదన్నారు. మరోసారి వచ్చే నెల 15వ తేదీల సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇకపై ప్రతి రోజు కార్పొరేటర్ల పనితీరుపై నివేదికను తెప్పించుకోనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆ నివేదికల ఆదారంగానే భవిష్యత్తులో పార్టీ పరంగా నిర్ణయాలు ఉంటాయని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

ప్రతి కార్పోరేటర్ 3 వేల గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించాలి

త్వరలో జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల జరుగుతున్న ఓటర్ల నమోదు కార్యక్రమంలో ప్రతి కార్పొరేటర్ విధిగా 3వేల మందిని ఓటర్లకు నమోదు చేయించాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఈ ఎంఎల్‌సి ఎన్నికకు సంబంధించి ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచేందుకు నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్లలను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. అక్టోబర్ 1వ తేదీన ప్రతి ఒక్కరు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News