Saturday, April 27, 2024

డిపి మారితే జిడిపి పెరుగుతుందా?

- Advertisement -
- Advertisement -

జాతీయ జెండాను డిపిగా పెట్టుకోవాలంటూ
మోడీ ఇచ్చిన పిలుపుపై కెటిఆర్ వ్యంగ్యాస్త్రం

పేదలకు సాయం మాని.. కార్పోరేట్లకు పిఎం సేవ రూపాయిని గాలికి వదిలి
విపక్షాల ప్రభుత్వాలను కూల్చే కుట్ర మందబలంతో జిఎస్‌టి పెంచుతున్న
కేంద్రం బిజెపి నేతలు చెబుతున్న మరిన్ని ఉప ఎన్నికలు ‘ముంగేరి
లాల్‌కా హసీన్ స్వప్నే’ బిజెపిది మతవాదం.. టిఆర్‌ఎస్‌ది అభివృద్ధితో
కూడిన జాతీయవాదం ఆస్క్ కెటిఆర్‌లో నెటిజన్లతో మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : సామాజిక మాధ్యమాలలో ప్రొఫైల్ పిక్ మారిస్తే ఏం జరుగుతుంది? జిడిపి మారితేనే దేశం ముందుకు వెళ్తుందని టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ అన్నారు. జాతీయ జెండాను వాట్సాప్ డిపిగా మార్చాలని పిఎం చెప్పడం వల్ల దేశ జిడిపి పెరుగుతుందా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో మంత్రి కెటిఆర్ ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడంతో పాటు, వారి సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుం టారు. అంతేకాకుండా, సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. కాలిగాయంతో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన ఆయన శుక్రవారం ట్విట్టర్‌లో ‘ఆస్క్ కెటిఆర్’ పేరుతో నెటిజనులతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వం, రాజకీయాలపై స్పందించారు. పేదలకు అందించే ఉచిత పథకాల విషయంలో సరైన దృక్పథం, ప్రాధాన్యతలు ఉంటే మంచిదని, ఈ విషయంలో ప్రధానమంత్రి పేదలకు సహాయం చేయడం మాని కార్పొరేట్ సంస్థలకు సుమారు 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, అది ప్రధానమంత్రి స్టైల్ అని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలు ఉన్న ప్రభుత్వాలను కూల్చడం మానేసి, పడిపోతున్న రూపాయి పైన దృష్టి సారించాలన్నారు.

ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదని ఒకరు అడిగిన ప్రశ్నకు మంత్రి కెటిఆర్ స్పందించారు. తాము ప్రధానమంత్రిని అగౌరవపరిచామన్న మాట తలెత్తదని, ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి అనధికారిక కార్యక్రమాల కోసం రాష్ట్రాల్లో పర్యటిస్తే, ముఖ్యమంత్రి స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. జిఎస్‌టి కౌన్సిల్లో బిజెపికి ఉన్న మంద బలంతో ప్రజలపైన భారీగా పన్నులు పెంచుతుందని, రాష్ట్రాలు వ్యతిరేకించినా, పలు అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదనే విషయాన్ని తెలిపిన కెటిఆర్, జిఎస్‌టి కౌన్సిల్ కేవలం సలహా ఇచ్చే యంత్రాంగం మాత్రమే అని, నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రైవేటీకరణ చేయడం ద్వారా రైతులు మరియు ఇతర తరగతుల వర్గాల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు.

బిజెపి, ప్రస్తుత రాజకీయాలపైన స్పందన

బిజెపి నాయకులు నోటితో రెచ్చిపోయి ప్రచారంలో దూసుకుపోతుంటే మీరెందుకు నిశ్శబ్దంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయన్నారు. బిజెపి నేతలు గోబెల్స్ శిష్యులని, అబద్దాలను ప్రచారం చేయడం, ద్వేషం పెంచడంలో సిద్ధహస్తులని అన్నారు. అయితే బిజెపి అబద్ధపు ప్రాపగాండను ఎండగట్టడంతో పాటు అదే సమయంలో తాము చేస్తున్న పనులు, అభివృద్ధి ప్రజల ముందు ఉంచుతామన్నారు. బండి సంజయ్ స్వయంగా ఇంగ్లీషులో ట్వీట్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆ విషయం నువ్వే చెప్పాలంటూ చమత్కరించారు.

వచ్చే సంవత్సరం వివిధ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్న బండి సంజయ్ ప్రకటనపై ముంగేరి లాల్ కి హసీన్ స్వప్నే అని చమత్క రించారు. బిజెపి జాతీయవాదం, మతవాదంతో రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచేందుకు ప్రయత్నం చేస్తుందని, ఈ విషయంలో మీరు వెనుక పడ్డారన్న ప్రశ్నకు సమాధానంగా తమది అభివృద్ధి పూర్వక జాతీయవాదమని, దానిపైననే తాము దృష్టి సారించామన్నారు. తెలంగాణ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణకు సేవ చేయడం కొనసాగిస్తుందన్నారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా సేవలు కొనసాగిస్తున్న కెసిఆర్ తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి లేదా కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా తమ పొత్తు తెలంగాణ ప్రజలతో ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలతో పోరాడాలన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేవలం జాతీయ పార్టీలతోనే ఎందుకు అనేక ఇతర పార్టీలు కూడా ఉన్నాయిగా అన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక పై..

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మీ కామెంట్ అంటే ముందు ఎన్నిక తాలూకు ప్రకటన జారీ అవ్వనీ అని అన్నారు. తనకు తెలిసినంతవరకు మునుగోడు అంశం కేవలం మరో ఉపఎన్నిక మాత్రమే అని, దాంతో ఏం మారుతుందని ప్రశ్నించారు.

పలు సమస్యలపై…

రాష్ట్రంలో విఆర్‌ఎలకు సంబంధించిన జీతాలు, పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ట్రిపుల్ ఐటి బాసర విద్యార్థుల సమస్యలను తామేందుకు పట్టించుకోమని ప్రశ్నించిన కెటిఆర్, వాటిపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సాధించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ క్యాంపస్ లో ఉండి విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని తెలిపారు

హైదరాబాద్ నగరంపై

హైదరాబాద్ నగరంలో మురికి నీటి నిర్వహణకు సంబంధించి ఎస్‌ఎన్ డిపి కార్యక్రమం కొనసాగుతుందని దాని పూర్తి ఫలితాలు త్వరలోనే వస్తాయన్నారు. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయని తెలిపిన కెటిఆర్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం పైన హైకోర్టు స్టే ఇచ్చిందని, దాన్ని రద్దు చేసేలా ప్రయత్నం చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో ఈబిఆర్‌టిఎస్ వంటి అనేక ప్రణాళికలపై పనిచేస్తున్నామని త్వరలోనే మెట్రో విస్తరణపై కూడా ప్రత్యేక ప్రణాళికలు ప్రకటిస్తామన్నారు. ట్యాంక్ బండ్ పైన కొంతకాలం కొనసాగిన ‘సండే ఫన్ డే’ కార్యక్రమం త్వరలో తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలిపిన కెటిఆర్, అందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌ని ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్యంగా హెచ్‌ఎండిఏ ఇప్పటికే 19 అర్బన్ పార్కులను ఏర్పాటు చేసిందని, ప్రజలకు మరిన్ని అర్బన్ లంగ్‌స్పేస్ లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

పరిశ్రమలు, సంబందిత రంగాలపై..

హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా ఏవియేషన్ యూనివర్సిటీ లేదా ప్రత్యేక విద్యాసంస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నెటిజన్ ఇచ్చిన సలహా మేరకు స్పందించిన కెటిఆర్ ఇప్పటికే క్రాన్ ఫీల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏవియేషన్ సంబంధిత సిలబస్‌ని ప్రారంభించినట్లు కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ ఐటి రంగంలో దేశంలోని అన్ని ఇతర నగరాల కన్నా వేగంగా ముందుకు పోతున్నదని, ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించబడ్డాయని తెలిపారు. ఐటీ పరిశ్రమను నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను గ్రిడ్ పాలసీ ఇస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు దాదాపు పదివేల ఎకరాల్లో 19 విభిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. రానున్న ఐదు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామని, తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు వంట నూనెల విషయంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. భూసేకరణకు సంబంధించిన స్వల్ప సమస్యలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాక్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మసిటీ ప్రారంభోత్సవం కొంత ఆలస్యం అవుతుందని, త్వరలోనే అవి పరిష్కారం అవుతాయి అన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.

ఇతర అంశాలపై..

తన కాలి గాయం నుంచి కోలుకుంటున్నట్లు, త్వరలోనే విధులకు హాజరు కానున్నట్లు తెలిపారు. ‘ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ఐటి మంత్రి అవ్వాలన్న ట్వీట్‌కు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడంతో సంతృప్తిగా ఉన్నట్లు, పశ్చిమబెంగాల్ విషయంలో మమతా బెనర్జీ తన బాధ్యతలను సమర్థ్ధంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. ‘రాజకీయాల్లోకి ఎలాంటి నేపథ్యం లేకుండా కూడా రావచ్చని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇందుకు ఉదాహరణ అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ వాటిని ఆకళింపు చేసుకోవాలన్నారు.

‘ ఈ దసరా నాటికి నూతన సచివాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘ అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న చేనేత కార్మికులకు మన అందరి మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ‘మిమ్నల్ని బిగ్‌స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నాం.. ఏదైనా అవకాశం ఉందా? అని ఒక నెటిజన్ ప్రశ్నకు ‘ఇప్పటివరకు నా రాజకీయ ప్రసంగాలను చూడకపోతే ‘బిగ్‌స్క్రీన్‌పై చూడొచ్చని మంత్రి కెటిఆర్ సమాధానమిచ్చారు. ‘జర్నలిస్ట్ ముసుగులో వాక్ స్వాతంత్రం పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలను హేళనగా మాట్లాడుతున్న వాళ్లపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారన్న ప్రశ్నకు సమాధానంగా వాక్ స్వేచ్చను సమర్థించే ప్రజాసామిక ప్రభుత్వం మాదని అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఈ వాక్ స్వేచ్ఛ ఇతరులను అవహేళన చేసేందుకు, తిట్టేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని దాన్ని, ఎవరం సహించాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News