Friday, April 26, 2024

లాసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

LAWCET and PGLCET results released

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పిజిఎల్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మూడేళ్ల లా కోర్సులో 78.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఐదేళ్ల లా కోర్సులో 62.35 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి తెలిపారు. పిజిఎల్‌సెట్‌లో 91.04 శాతం ఉత్తీర్ణత నమోదైందని అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి శుక్రవారం లాసెట్, పిజిఎల్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో లాసెట్ కన్వీనర్ జి.బి.రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్లు ఆర్.లింబాద్రి,వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లాసెట్, పిజిఎల్‌సెట్‌కు మొత్తం 30,262 దరఖాస్తు చేసుకోగా, 21,559 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 16,572 మంది(76.87 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల లా కోర్సుకు 15,398 మంది పరీక్షకు హాజరుకాగా, 12,103 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 9,540 మంది పురుషులు, 2,562 మంది మహిళలు ఉండగా, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ఐదేళ్ల కోర్సుకు 3,973 మంది హాజరుకాగా, 2,477 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే పిజిఎల్‌సెట్‌కు 2,188 మంది హాజరుకాగా, 1,922 మంది ఉత్తీర్ణత పొందారు.

ఐదేళ్ల లా కోర్సుకు కనీస మార్కుల నిబంధన తొలగింపు

ఇంటర్ అర్హతతో ఐదేళ్ల లా కోర్సు ప్రవేశాలకు ఈ సారి కనీస మార్కుల నిబంధన ఉండదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఎంసెట్‌లో ఈ నిబంధనను తొలగిస్తూ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిందని, లాసెట్ విషయంలో కూడా ఈ నిబంధన వర్తింపజేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఒపెన్ ఇంటర్, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్టిమెంటరీ పరీక్షలను రద్దు చేసి ప్రభుత్వం 35 శాతం మార్కులతో విద్యార్థులందరినీ పాస్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఒక్క సంవత్సరానికి కనీస మార్కులను నిబంధన తొలగించిందని పేర్కొన్నారు.

టాపర్లు వీరే

మూడేళ్ల లా కోర్సులో కూకట్‌పల్లికి చెందిన చుండి స్నేహాశ్రీ 98 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, కరీంనగర్‌కు చెందిన కె.సిద్ధార్థ 96 మార్కులతో రెండవ ర్యాంకు, ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి సురేష్ 96 మార్కులతో 96 మార్కులతో మూడవ ర్యాంకు సాధించారు. ఐదేళ్ల లా కోర్సులో కరీంనగర్‌కు చెందిన సముద్రాల శ్రీనివాస కృష్ణ 98 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కారంపూడి అరుణ్‌కుమార్ 97 మార్కులతో ద్వితీయ ర్యాంకు, సూర్యాపేట జిల్లాకు చెందిన కోల మహేష్ 96 మార్కులతో తృతీయ ర్యాంకు పొందారు. అలాగే పిజిఎల్‌సెట్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తడిగొప్పుల ప్రవలిక 89 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, కరీంనగర్‌కు చెందిన శివనాదుని రాజేష్ 89 మార్కులు సాధించి రెండవ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన జి.అర్చన 86 మార్కులతో మూడవ ర్యాంకు సాధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News