Monday, April 29, 2024

ఫైనల్ రేసులో సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

Hyderabad win over Bangalore in the eliminator

 

హోల్డర్ ఆల్‌రౌండ్ షో, రాణించిన విలియమ్సన్, ఎలిమినేటర్‌లో బెంగళూరుపై హైదరాబాద్ గెలుపు

అబుదాబి: ఐపిఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ ఆదివారం జరిగే క్వాలిఫయర్2కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ఇందులో గెలిచే జట్టు మంగళవారం జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. ఇక బెంగళూరుతో జరిగిన నాకౌట్ సమరంలో డేవిడ్ వార్నర్ సేన అద్భుత ఆటను కనబరిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరును 131 పరుగులకే పరిమితం చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ మరో రెండు బంతులు మిగిలివుండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఆదుకున్న కేన్, జాసన్

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా దిగిన గోస్వామి (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. సిరాజ్‌కు ఈ వికెట్ దక్కింది. అయితే తర్వాత వచ్చిన మనీష్ పాండేతో కలిసి కెప్టెన్ వార్నర్ స్కోరును పరిగెత్తించాడు. కానీ మూడు ఫోర్లతో 17 పరుగులు చేసిన వార్నర్‌ను కూడా సిరాజ్ ఔట్ చేశాడు. కొద్ది సేపటికే మనీష్ పాండే కూడా ఔటయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూడు ఫోర్లు, సిక్స్‌తో 24 పరుగులు చేసి జంపా చేతికి చిక్కాడు. ఆ వెంటనే ప్రియమ్ గార్గ్ (7) కూడా వెనుదిరిగాడు.

దీంతో హైదరాబాద్ 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హోల్డర్, కేన్ విలియమ్సన్ అసాధారణ బ్యాటింగ్‌తో మరో వికెట్ కోల్పోకుండానే హైదరాబాద్‌ను విజయ తీరానికి చేర్చారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ రెండు ఫోర్లు, మరో రెండు సిక్స్‌లతో అజేయంగా 50 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన హోల్డర్ 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. డివిలియర్స్ (56), అరోన్ ఫించ్ (32), మాత్రమే కాస్త రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో హోల్డర్ మూడు, నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News