Saturday, May 4, 2024

ఆడపిల్ల పెళ్లి వయసు

- Advertisement -
- Advertisement -

Will Increasing Legal Age Of Marriage For Girls Address  ఆడ పిల్లల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు పెంచే యోచన ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత ఈ విషయంలో అధికార వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహిళల్లో అధికంగా కనిపిస్తున్న పోషకాహార లేమి, రక్త హీనత, ప్రసవ సమయ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడం, జనాభా పెరుగుదల రేటును తగ్గించవలసిన ఆవశ్యకతలను దృష్టిలో ఉంచుకొని వారి వివాహ వయసును పెంచే విషయంలో తగు సిఫార్సులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో జయా జైట్లీ సారథ్యంలో ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పురుషుల చట్టబద్ధ వివాహ వయసు 21గా ఉంది. పురుషుల పెళ్లీడునే 18 ఏళ్లకు తగ్గించాలని ఒక దశలో అనుకున్నట్టు సమాచారం.

ఇప్పుడు 140 దేశాల్లో స్త్రీ పురుషులు ఇద్దరి వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే మన దేశంలో జనాభా పెరుగుదలను పరిమితిలో ఉంచవలసిన అవసరం రీత్యా మగ వారి పెళ్లీడును తగ్గించడం కంటే మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. 1978లో మహిళల వివాహ వయసును 15 ఏళ్ల నుంచి 18 సంవత్సరాలకు పెంచారు. ‘దేశం పురోగతి చెందుతున్నది, మహిళలు పై చదువులు చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తూ పై మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసవ కాల మరణాల రేటును కూడా తగ్గించవలసి ఉన్నది. అందువల్ల ఆడ పిల్ల తల్లి కాదగిన వయసును గురించి ఆలోచించాలి’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 202021 బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. శారీరకంగా, మానసికంగా సంపూర్ణ వికాసం కలిగిన తర్వాతనే ఉభయుల మధ్య అవగాహనతో కూడిన ముడి (వివాహ బంధం) పడడం వారికీ సమాజానికీ మంచిది.

కాని అనేక ఇతర కారణాల మూలంగా మన దేశంలో పిన్న వయసు వివాహాలు ఇంకా గణనీయంగా జరుగుతున్నాయి. గ్రామీణ భారతంలో ఇవి ఎక్కువ. 2001 జనాభా లెక్కల ప్రకారం 1014 ఏళ్ల ఈడులోని 5 కోట్ల 92 లక్షల మంది బాలికల్లో 14 లక్షల మంది వివాహితులు. 1519 ఏళ్ల వయసులోని 4 కోట్ల 63 లక్షల మంది బాలికల్లో కోటీ 3 లక్షల మంది పెళ్లి చేసుకున్న వారే. అయితే బాల్య వివాహాలు క్రమక్రమంగా తగ్గుతున్న మాట వాస్తవం. 2005-2009 మధ్య బాల్య వివాహాలు 46 శాతం తగ్గినట్టు ఒక పరిశీలనలో తేలింది. మారుమూల పల్లెలకు కూడా సమాచారం వ్యాప్తి చెందుతుండడం, మహిళల్లో అక్షరాస్యత పెరగడం, పూర్వం మాదిరిగా ఆమెను ద్వితీయ శ్రేణి మనిషిగా కాకుండా మగ పిల్లలతో సమానంగా పెంచాలనే స్పృహ ఎంతో కొంత అధికం కావడం వల్ల ఈడు వచ్చిన తర్వాతనే కుమార్తెలకు పెళ్లి చేసే చైతన్యం నెమ్మదిగానైనా కలుగుతున్నది. అయినప్పటికీ నిరు పేదరికం, వరకట్నాది భారాల ఒత్తిడి వల్ల ఆడ పిల్ల బరువును వీలైనంత త్వరగా దించుకోవాలనే మనస్తత్వం ఇంకా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది.

అందుచేత చట్టబద్ధమైన స్త్రీ వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచబోవడాన్ని మంచి ఆలోచనగానే పరిగణించాలి. హర్యానా వంటి రాష్ట్రాల్లో ఆడ పిల్లలను చదివించేలా చేయడానికి ప్రవేశపెట్టిన పథకాలు స్త్రీ విద్యా వికాసాల పట్ల పాలకులలో పెరుగుతున్న శ్రద్ధకు నిదర్శనమని చెప్పాలి. అయితే మహిళల వివాహ వయసును 21 ఏళ్లు చేస్తూ చట్టాన్ని తీసుకు వస్తే బాల్య వివాహాల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందనే అభిప్రాయాన్ని కొట్టి పారేయలేము. అలాగే బాలికల చట్టబద్ధ వివాహ వయసు పెంచినందువల్ల సహజ శారీరక తత్వం కారణంగా ఆలోగానే గర్భం ధరించే వారు ప్రభుత్వపరమైన వైద్య సేవలకు అనర్హులవుతారు. అన్నింటికీ మించి ఇంకా దట్టంగా ఉన్న పేదరికం వీలైనంత తొందరగా పిల్లకు పెళ్లి చేసి పంపించాలనే మనస్తత్వాన్ని కొనసాగిస్తున్నది.

ఆశాకిరణం వంటి పరిణామం ఏమిటంటే గతంతో పోల్చుకుంటే దేశంలో ప్రసవ కాల మరణాల సంఖ్య తగ్గడం. ఈ మరణాల రేటు 201416 ద్వైవార్షికంలో ప్రతి లక్ష ప్రసవాలకు 130గా ఉండగా, 201517 నాటికి 122కి తగ్గింది. అయినా ఇంకా చాలా కిందికి రావలసి ఉంది. అందుచేత మహిళల వివాహ వయసును పెంచడం వల్ల అంతోఇంతో ప్రయోజనమే కలుగుతుంది. కాని దేశంలో బాలికలకున్న విద్యావకాశాలు సామాజికంగా, సౌకర్యాల పరంగానూ ఇప్పటికీ పరిమితంగా ఉన్నాయి. వాటిని బాగా పెంచి అత్యాధునిక వసతులు కల్పిస్తేగాని వివాహ వయసు వరకు ఆడపిల్లలు చదువుకునే అవకాశం కలుగదు. అదే సమయంలో మూఢవిశ్వాసాలు, సంప్రదాయాలు తొలగకపోతే ఈ నిర్ణయం వల్ల ఆశించిన ఫలితం కలుగదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News