Saturday, April 27, 2024

సంకల్పానికి పట్టుదల తోడవ్వాలి..!

- Advertisement -
- Advertisement -

Joginapally Santosh Kumar green india challenge

సంకల్పం చిన్నదే కావచ్చు కానీ అందులో సమాజ శ్రేయస్సు ఉంది. తీసుకున్న సంకల్పం, ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదల కూడా కావాలి. లేకుంటే మనం తీసుకున్న సంకల్పం ఎంత గొప్పదయినా నిరుపయోగం అవుతుంది. ఆశించిన ఫలితాలు రావు. ఇలా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న హరితహారం కార్యక్రమం కానీ, రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్పవని చెప్పవచ్చు. ఎందుకంటే పర్యావరణం దెబ్బతినడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింది. దీనితో కాలానుగుణంగా పడాల్సిన వర్షాలు పడకపోగా ఇతర కాలాలు కూడా కాలానుగుణంగా ఉండడం లేదు. అల్ప పీడనాలు, వాయు గుండాలు, తుఫానుల వర్షాలు తప్పా రుతుపవనాలతో వచ్చే వర్షాలు అంతంత మాత్రంగానే పడుతున్నాయి. ఒకొక్కసారి ఎండల తీవ్రత, చలి తీవ్రత ఎక్కవగా ఉంటున్నాయి. దీనికి తోడు వాతావరణ కాలుష్యం కూడా తీవ్రత స్థాయిలో పెరిగింది.

దీనిపై పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంటే పర్యావరణం దెబ్బతింటే ఎంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో దీనిని బట్టి మనకు అర్ధం అవుతుంది.అందుకే పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అందుకే హరిత హరం, గ్రీన్ ఇండియా ప్రోగ్రాంలు చాలా ముఖ్యమైనవి. అశోకుడు చెట్లు నాటించాడని మనం చరిత్ర పాఠాలలో చదువుకుంటాం. అంటే నాడు రాజులు, చక్రవర్తులు పర్యావరానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్ధం అవుతుంది. కానీ కాలక్రమంలో మనిషిలో స్వార్ధం పెరిగింది, అవసరాలు పెరిగాయి. దీనితో అడవులు అంతరించాయి. కాలుష్యం పెరిగింది. పర్యావరణం దెబ్బతింది. ఆరోగ్య సమస్యలు పెరిగాయి. చిన్న పెద్ద అనే వయస్సు తేడా లేకుండా అందరూ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డబ్బులు వదిలించుకోవాల్సి వస్తుంది. దీనితో పేద, మధ్య తరగతి వర్గాలు ఆర్ధిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యల నుండి బయట పడాలంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి అందుకు హరిత హారాన్ని చేపట్టాలని కెసిఆర్ సర్కార్ భావించింది.

ప్రభుత్వం చేపట్టిన హరితహరం ఒక ఎత్తైతే, రాజ్య సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం మరొక ఎత్తు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే! సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను ముందు కదిలించాలి. దీనితో సమాజంలో కదలిక వస్తుంది. దాని కోసమే లెజెండ్లను, సెలబ్రెటీస్‌లను కదిలించే కార్యక్రమాన్ని అయన చేపట్టారు. అదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాం. దీని ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్న లెజెండ్స్, సెలబ్రిటీస్‌ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. తద్వారా వారితో ప్రజలకు మెసేజ్ ఇప్పించాలి. వారు చెప్పే మాటకు, చేసే పనికి సమాజంలో ప్రభావం ఉంటుంది. సంతోష్ దీనిని గుర్తించారు. అందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే వినూత్న ప్రోగ్రాం చేపట్టారు. సినీ, సాహిత్య, క్రీడా, రాజకీయ, పరిపాలన విభాగంలో పని చేసే పై స్థాయి అధికారులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారి ద్వారా సమాజానికి సందేశం ఇప్పించాలని సంకల్పం తీసుకున్నారు. ఒకరు ఒక మొక్క నాటి వారు మరో ముగ్గురికి ఛాలెంజ్ విసరడం ద్వారా ఇది విస్తృతం అయ్యింది.

ఇప్పుడు ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో వివిధ దేశాలలో ఉండే తెలుగు వారు కూడా ఒక స్ఫూర్తిగా దీనిని తీసుకున్నారు. సంతోష్ తీసుకున్న సంకల్పం చిన్నదే, ప్రభుత్వం చేపట్టిన హరిత హారానికి ఉడతా భక్తిగా తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలంజ్ విశ్వవ్యాప్తం అయ్యింది. దీనికి తోడు మరో వినూత్న కార్యక్రమాన్ని కూడా సంతోష్ చేపట్టారు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అదే విత్తన గణపతి. ఈ కార్యక్రమం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇది కొత్త ఆలోచన అని అనేక మంది మెచ్చుకున్నారు. దీని కాన్సెప్ట్ కూడా పర్యావరణ పరిరక్షణే. గణపతిని పూజిస్తూనే పర్యావరణాన్ని కాపాడుకోవడం అనే సంకల్పం తీసుకున్నారు. ఇది చిన్నదే కావచ్చు కానీ వినూత్నంగా ఉంది. అందరినీ బాగా ఆకట్టుకుంది. సంకల్పం చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు దానిని పట్టుదలతో ముందుకు తీసుకొనిపోవాలి. అప్పుడే అది విజయవంతం అవుతుంది. ఇలాంటి వినూత్న కార్యక్రమాలని సంతోష్ మరిన్ని చేపట్టాలని అందుకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.

పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా, అన్ని రకాలుగా అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మలుచుకోవాలనే ఆకాంక్షలోంచి పుట్టిన పథకమే తెలంగాణకు హరితహారం. అందుకే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 24 శాతం పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు… తద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు సిఎం కెసిఆర్ ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. రాష్ట్రాన్ని అందమైన, ఆరోగ్యకరమైన, అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా మార్చాలనే ప్రయత్నమే తెలంగాణకు హరితహారం. అందుకే దీనిని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం నాటుతున్న కోట్లాది మొక్కలతో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ గ్రీన్ రాష్ట్రంగా మార్చాలన్న లక్షంతో మొక్కవోని దీక్షతో కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. ఈ హరితహారంతో రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాన్ని కూడా పూర్తిగా గ్రీనరీగా మార్చే విధంగా అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఐదు విడతల హరితహారం కార్యక్రమాన్ని పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆరవ విడత కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తోంది. గత జూన్ నెల 25వ తేదీ నుంచి ఈ కార్యక్రమం రాష్ట్రంలో నిరాటంకంగా కొనసాగుతోంది.

సుమారు 30 కోట్లు (29.86 కోట్లు) తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూనే మొక్కలు నాటే కార్యక్రమం ఒక ఉద్యమంగా సాగుతోంది. ప్రస్తుతం పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించటం, రానున్న తరాలకు ఆస్తి, ఐశ్వర్యాల కంటే మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించటమే లక్ష్యంగా హరితహారం కొనసాగుతోంది. ఇప్పటికే ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం, వరుసగా ఆరవ ఏడాదిలోకి అడుగుపెట్టింది. గత ఐదు విడతల్లో నాటిన మొక్కలు, ప్రభుత్వ సంకల్పం, సమాజంలో అన్ని వర్గాల సహకారంతో ఫలితాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. రాష్ట్ర మంతటా పచ్చదనం చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతోంది. అన్ని రోడ్ల వెంట రహదారి వనాలు (అవెన్యూ ప్లాంటేషన్) ఏపుగా పెరుగుతూ ఆకర్షిస్తున్నాయి. వీధులు, గ్రామాలు పచ్చదనం యుద్ధంలో తమ వంతు పాత్ర పోషించటంతో ఆ ప్రాంతాలు పచ్చగా మారుతున్నాయి. ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన దేశ వ్యాప్త నివేదికలోనూ పచ్చదనం గణనీయంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి అని స్పష్టం చేసింది. కంపా నిధుల సద్వినియోగంతో ప్రత్యామ్నాయ అటవీకరణ పద్ధతులు, సహజ అటవీ పునరుద్ధరణ పథకాల్లోనూ తెలంగాణ అగ్రగామిలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీటి లభ్యత పెరగటం హరితహారానికి అందివచ్చే వరమే. మరింత సమర్థవంతంగా మెట్ట భూముల్లోనూ మొక్కలు పెంచేందుకు, వాటి రక్షణకు కాళేశ్వరం అదనపు వనరు కానుంది. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ, క్షేత్రస్థాయి నివేదికలు, సిబ్బంది ద్వారా మంచి చెడులు తెలుసుకున్న ప్రభుత్వం అంచనాలు సవరించింది. మొక్కలు నాటే లక్ష్యాన్ని గ్రామ స్థాయి యంత్రాంగమే నిర్దేశించుకునేలా ఆదేశించింది.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమాన్ని తన వంతుగా ముందుకు తీసుకెళ్లేందుకు టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ విశేషంగా కృషి చేస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మరింత ముందుకు తీసుకపోతున్నారు. ప్రస్తుతం సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ గ్రీన్ ఇండియా ఉద్యమం కేవలం మన రాష్ట్రమే కాకుండా దేశ, విదేశాలకు కూడా పాకింది. వారి నుంచి మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఊరు, వాడ అన్న తేడా లేకుండా జోరుగా సాగుతోంది. పలువురు సెలెబ్రిటీలు ఎంతో ఉత్సాహంతో మొక్కలు నాటుతూ… సెల్ఫీలు తీసుకుంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అయినందుకు తమ సంతోషాన్ని ట్విట్టర్ల ద్వారా పంచుకుంటున్నారు. కేవలం వారు మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను విసురుతూ ముందు కు కొససాగిస్తున్నారు.

పి.వి శ్రీనివాసరావు – (సీనియర్ జర్నలిస్టు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News