Monday, April 29, 2024

జాతీయ క్రీడా దినోత్సవం ఒక మహా ప్రహసనం!

- Advertisement -
- Advertisement -

Hockey Legend Dhyan Chand Birth Anniversary

హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచ మంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్‌చంద్‌దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అయితే జాతీయ క్రీడా దినోత్సవం గురించి చాలా మందికి తెలియదు. అసాధారణ నైపుణ్యం, అద్భుత క్రీడాశక్తి కలిగి ఉంటే సాధారణ కుటుంబంలో జన్మించినా అత్యున్నత శిఖరాలను సునాయాసంగా చేజిక్కించుకోవచ్చునని అతడి జీవితం విపులంగా తెలియజేస్తుంది.ధ్యాన్‌చంద్ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో ఆగస్టు 29న జన్మించారు. ఆయన చిన్నతనం నుంచే హాకీ క్రీడ అంటే చాలా ఇష్టం. హాకీ స్టిక్ అతని చేతిలో మంత్రదండగా మారిపోతుంది. బంతిపై నియంత్రణ, అద్భుత చాతుర్యం, అసాధారణ నైపుణ్యం, ఉత్తమ ప్రతిభ కలిపి ధ్యాన్‌చంద్‌ను హాకీ మాంత్రికుడిగా చేశాయి. 1920లో బెల్జియలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్టు హాకీ క్రీడలో పాల్గొంది. 1928లో ఆమ్‌స్టర్‌డాంలో జరిగిన పోటీలలో భారత హాకీ జట్టు బంగారు పతకం సాధించింది. 1936లో లాస్ ఎంజిల్స్‌లో జరిగిన పోటీలో అమెరికాపై ధ్యాన్‌చంద్ 9 గోల్స్ చేసి గెలిపించారు. ధ్యాన్‌చంద్ ఆటకు ముగ్ధుడైన జర్మనీ నియంత హిట్లర్ ధ్యాన్ చంద్‌కు జర్మనీలో కల్నల్ హోదా ఇస్తామని విజ్ఞప్తి చేయగా ధ్యాన్‌చంద్ తన మాతృదేశాన్ని వీడనని చెప్పటం అతడి దేశభక్తికి నిదర్శనం.

అపార జనసంపద కలిగిన భారత్ క్రీడారంగంలో మాత్రం ఇంకా శైశవ దశలోనే ఉందనటానికి ఒలింపిక్స్ ఫలితాలను మించిన నిదర్శనం మరొకటి ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, క్రీడా సంఘాల రాజకీయాలే దీనికి ప్రధాన కారణం. 1928 ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్ నుంచి 1936 బెర్లిన్ ఒలింపిక్స్ వరకూ భారత్‌కు మూడు బంగారు పతకాలు అందించడంలో ప్రధానపాత్ర వహించిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న మనం మేజర్ ధ్యాన్‌చంద్ స్మృతిగానే ఏటా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాము. కానీ యువతలో స్ఫూర్తి నింపడంలో మాత్రం మన ప్రభుత్వాలు విఫలమవుతూ వస్తున్నాయి. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ దేశం లో అయినా క్రీడాకారులు ఘనంగా జరుపుకుంటారు. కానీ, భారత్‌లో మాత్రం పరిస్థితి భిన్నం. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. కానీ, ఇది మొక్కుబడిగానే సాగుతోంది. ఆ రోజు ధ్యాన్ చంద్ విగ్రహానికి దండలు వేసి అధికారులు, క్రీడాకారులు చేతులు దులుపుకుంటున్నారు. కనీసం ఈ ఒక్క రోజైనా పట్టించుకుంటే క్రీడలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది. భారత్‌లో క్రీడా దినోత్సవం అంటే కేవలం హాకీ క్రీడాకారులకు చెందిన ఉత్సవంగా భావిస్తున్నారు.73 సంవత్సరాల స్వాతంత్య్ర భారత్‌లో ఇప్పటికీ జాతీయ క్రీడా దినోత్సవం ప్రాధా న్యం ఏమిటో అసలు ఏ రోజున జరుపుకొంటారో తెలియని నవయువ జనాభా చాలా మంది ఉన్నారంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది.

ప్రపంచ జనాభాలో భారత్ స్థానం రెండు. అత్యధిక యువజన జనాభా ఉన్న దేశాలలో భారత్ దే అగ్రస్థానం. అయితే క్రీడారంగంలో మాత్రం మన పరిస్థితి మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే దిగదుడుపే. 73 సంవత్సరాల స్వాతంత్య్ర భారత్ శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి సాధించిన దేశం. అంతేకాదు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న దేశం. ప్రపంచంలోని విఖ్యాత బహుళ జాతి కంపెనీల చూపంతా ఇప్పుడు భారత్ మార్కెట్ వైపే. అయితే, ఇదంతా నాణేనానికి ఓవైపు మాత్రమే. క్రీడాపరంగా భారత్ ప్రగతి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని చెప్పక తప్పదు. మన పొరుగు దేశం చైనాతో పోల్చి చూస్తే ఒలింపిక్స్‌లో భారత్ పరిస్థితి తీసికట్టే. ప్రపంచంలోని 204 దేశాలలో అత్యధిక యువజన జనాభా ఉన్న దేశం భారత్. దేశ జనాభాలో 60 శాతం మంది యువజనులే.

అయినా క్రీడలంటే ఏమాత్రం ఆసక్తిలేదు. వాలంటైన్స్ డే, మైకేల్ జాక్సన్‌ల పుట్టిన రోజుల గురించి ఉన్న అవగాహన జాతీయ క్రీడా దినోత్సవం గురించి లేకపోవడం చేదు నిజం. 130 కోట్ల భారత జనాభాలో కేవలం 5.2 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి కనీస అవగాహన ఉన్నట్లుగా ఇటీవలే నిర్వహించిన తాజా సర్వే ద్వారా తేలింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల్లో కేవలం 1.31 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి అవగాహన ఉందంటే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. అంతేకాదు దేశ జనాభాలో 3.27 శాతం మంది మాత్రమే క్రీడల గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపుతున్నట్లు పరిశీలనలో వెల్లడయ్యింది.క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ఒకటి రెండు క్రీడల దెబ్బకు మిగిలిన క్రీడలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు సైతం తమకు ఆదాయం, ప్రచారం తెచ్చిపెట్టే క్రీడల్ని, క్రీడాకారులను మాత్రమే ప్రోత్సహిస్తూ మిగిలిన క్రీడలను, క్రీడాకారులను చిన్నచూపు చూస్తున్నాయి. కనీస క్రీడా సౌకర్యాలు లేని పాఠశాలల్లో చదివే నేటి తరం బాలలకు ఆటలు ఆడే కనీస సదుపాయాలు లేకపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదని భారత మాజీ క్రీడా దిగ్గజాలు, అర్జున అవార్డీలు వాపోతున్నారు. మన దేశంలో ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉన్నా క్రీడారంగ పరిస్థితి మాత్రం రెండడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా తయారయింది.

ఈ పరిస్థితిని అధిగమించడానికి గత ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు, పథకాలను సమగ్రంగా సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోడీ ఖేలో ఇండియా అనే వినూత్న కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలలోని క్రీడామైదానాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, అత్యాధునిక శిక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉంచడం, క్రీడాశిక్షకుల పరిజ్ఞానాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచడం ఖేలో ఇండియాకు ఆయువుపట్టుగా ఉంటాయి. పదేళ్ల నుంచి 18 సంవత్సరాల వయసున్న ప్రతిభావంతులైన బాలలు, యువతీ యువకులను గుర్తించి ఎంపిక చేసిన క్రీడలతో పాటు చదువులోనూ రాటుదేలేలా చేయటమే ఖేలో ఇండియా ప్రధాన లక్ష్యంగా ఉంది. క్రీడలను సైతం నిర్బంధ పాఠ్యాంశంగా ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు. మన సమాజం, ప్రభుత్వాలు, క్రీడా వ్యవస్థ ఆలోచనా ధోరణిలో మార్పురానంత వరకూ భారత వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఏదిఏమైనా జన జీవితంలో క్రీడా సంస్కృతి ఓ ప్రధాన భాగం కానంత వరకూ జాతీయ గీతం, జాతీయ పతాకంతో సమానంగా జాతీయ క్రీడా దినోత్సవానికి ప్రాధాన్యం ఇవ్వనంత వరకూ భారత క్రీడారంగ ప్రగతి ఓ అందమైన కలగానే ఉండిపోతుంది.

డా. ఎం డి ఖ్వాజా మొయినొద్దీన్- 9492791387

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News