Monday, April 29, 2024

29 దాకా లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో మరోసారి పొడిగింపు

కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం

15న లాక్‌డౌన్‌పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం

ఆగస్టులో వ్యాక్సిన్
అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం
కరోనా కొత్త కేసులు 11
కేంద్రం, విపక్షాల తీరుపై ఆగ్రహం
నిర్మాణాత్మక విమర్శలు
చేయలేనోళ్లు సన్నాసులు, బఫూన్లు
కేంద్ర విద్యుత్ సంస్కరణల
బిల్లుకు మేం వ్యతిరేకం : సిఎం కెసిఆర్

నేటి నుంచి మద్యం దుకాణాలు ఓపెన్
రెడ్‌జెన్లలోనూ అమ్మకాలు, కంటైన్మెంట్లలో నో
ఉదయం 10గం. నుంచి
సాయంత్రం 6గంటల వరకు అనుమతి
బార్లు,పబ్‌లకు అనుమతి లేదు
నో మాస్క్…నో లిక్కర్
భౌతిక దూరం తప్పనిసరి
చీప్ లిక్కర్‌పై 11%, మిగతా
వాటిపై 16% ధరలు పెంపు

ప్రజలు సహకరించాలి… భౌతిక దూరంతోనే విజయం ఇంకొన్నాళ్లు ఓపిక పడితే కరోనాను
జయించొచ్చు దేశానికే కరీంనగర్ రోల్‌మోడల్ రాత్రి 7గం. తర్వాత బయటికొస్తే పోలీసు
చర్యలు తప్పవు రాష్ట్రంలో 35 మాత్రమే కంటైన్మెంట్ జోన్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్
జిల్లాల్లో కఠినం ముంబై దుస్థితి మనకు రావొద్దు నేను బతికున్నంత వరకు రైతుబంధు బంద్
కానేకాదు రూ.25వేల లోపు రైతు రుణాలు నేడే మాఫీ, రూ.1200 కోట్లు విడుదల
తెలంగాణలో ఉండేది రైతు రాజ్యమే, చిల్లర రాజకీయాల రాజ్యం కాదు ఈ నెలలోనే పదో
తరగతి పరీక్షలు నేటి నుంచే ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మండల
కేంద్రం నుంచి గ్రామాల దాకా అన్ని దుకాణాలు ఓపెన్, పురపాలికల్లో లాటరీ పద్ధ్దతిలో 50 శాతం
వరకే అనుమతి తీవ్ర జబ్జులున్నవారికి 3 నెలల పాటు మందులు, మాస్క్‌లు రాష్ట్రాలకు
సహాయంపై కేంద్రం వైఖరి మారాలి నేటి నుంచి ఆర్‌టిఎ, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల
కార్యాలయాలు పనిచేస్తాయి సుదీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బుధవారం నుంచి లాక్‌డౌన్‌లో పలు సడలింపులను ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మద్యం విక్రయాలకు అనుమతులను ఇస్తున్నట్లు చెప్పారు. మద్యంపై స్వల్పంగా ధరలను పెంచినట్లు పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలను నిబంధనలు పాటిస్తూ ఈ నెలలో నిర్వహిస్తామన్నారు. అలాగే ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభిస్తున్నామని, ఫలితాలను సాధ్యమైనంత త్వరగా వెల్లడిస్తామన్నారు. రెడ్‌జోన్ల పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతాయన్నారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ల్ పరిధిలో మాత్రం షాపులను తెరుచుకునేందుకు అనుతులిస్తున్నట్లు సిఎం తెలిపారు. ఇతర వ్యాధులు ఉన్న వారు బయటకు రావొద్దని జాగ్రత్తలు తీసుకోవాలని కెసిఆర్ కోరారు. వారికి కోటి మాస్కులు ఫ్రీగా అందిస్తామన్నారు. 65 సంవత్సరాలు దాటిన వారితో పాటు చిన్నపిల్లలు బయటకు రాకుండా వారి కుటుంబసభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మంగళవారం ప్రగతి భవన్‌లో సుమారు ఏడు గంటల పాటు నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి మానవ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసిందన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్నారు. పలు పకడ్భంది చర్యలతో పాటు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో చాలా వరకు కరోనాను నియంత్రించగలిగామని సిఎం కెసిఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తిని జీరో దశకు తీసుకరావాలన్నారు. అప్పుడే మనం పూర్తిగా బయటపడినట్లు అని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బంది వ్యూహంతో వ్యవహరించిందన్నారు. ఇందుకు కరీంనగర్ ప్రత్యక్ష నిదర్శమని వ్యాఖ్యానించారు. దేశంలో మొట్టమొదటి కేసు కరీంనగర్ కంటైన్మైంట్ జోన్‌లో వచ్చిందన్నారు.

కంటైన్మెంట్ జోన్‌గా కరీంనగర్‌ని ప్రకటించిన రాష్ట్రం తెలంగానేనని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ గురించి మొదట కేంద్రానికి కూడా తెలియదన్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన 11మందిని గుర్తించి కంటైన్మెంట్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించామన్నారు. అధికారులు బాగా పనిచేయడం వల్ల సింగిల్ డెత్ లేకుండా కరీంనగర్‌ను కాపాడుకోగలిగామన్నారు. ఒక దశలో తానే అక్కడకు వెళ్ళాలనుకున్నా… కాని అధికారులకు వర్క్ డిస్ట్రిర్బ్ అవుతుందని చెప్పడంతో పర్యటనను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని సిఎం తెలిపారు. కరీంనగర్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందనన్నారు. కరీంనగర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు.

1096 కరోనా కేసులు
ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం -1096 కరోనా కేసులు నమోదైనట్లు సిఎం తెలిపారు. ఇందులో 628 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారన్నారు. మంగళవారం 43 మంది డిశ్చార్జ్ కాగా 439 చికిత్స పొందుతున్నారని చెప్పారు. కొత్తగా 11 కేసులు వచ్చాయని తెలిపారు. దేశంలో మరణాల శాతం 3.37 శాతం ఉంటే రాష్ట్రంలో మరణాల శాతం 2.64 శాతమే ఉందన్నారు. రికవరీ రేటు కూడా అధికంగా ఉందన్నారు. భారత్ బయోటిక్, బిఇ, శాంతాబయోటిక్ సంస్థలు వ్యాక్సిన్ పరిశోధనలో ఉన్నాయన్నారు. అన్ని కుదిరితే ఆగస్టు నెల వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ లాంటి రెడ్ జోన్లలో జనసాంద్రత ఎక్కువగా ఉందన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 726కేసులు నమోదయ్యాయన్నారు.

దేశంలో టెస్టింగ్ కిట్ల కొరత ఉందన్నారు. రాష్ట్రంలో పిపిఇ కిట్లు, టెస్టింగ్ కిట్లు,మాస్కుల కొరత లేదన్నారు. ప్రస్తుతం 5.60 లక్షల కిట్లు మనకు అందుబాటులో ఉన్నాయని సిఎం తెలిపారు. రెడ్ జోన్ల పరిధిలో ఎలాంటి సడలింపులు లేవని, మే 15వరకు ఎలాంటి షాపులకు అనుమతి లేదన్నారు. వ్యవసాయ సంబంధిత అన్ని రకాల దుకాణాలకు అనుమతి ఉందన్నారు. గ్రీన్,అరెంజ్ జిల్లాలో అన్ని షాపులకు అనుమతులు ఉన్నాయన్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో అన్ని షాపులు తెరుచుకోవచ్చునన్నారు. మున్సిపాలిటీల్లో మాత్రం రొటేషన్ పద్ధతిలో 50 శాతం షాపులు తెరుచుకోవచ్చునన్నారు. రెవిన్యూ కార్యాలయాలు నడుస్తాయన్నారు. కేరళ మన నుంచి నేర్చుకుని బాగా చేస్తోందన్నారు. గవర్నర్ దగ్గరు వెళ్ళి కొందరు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, అహోరాత్రులు శ్రమిస్తున్న వైద్యరోగ్య శాఖను అవమానిస్తున్నారని సిఎం మండిపడ్డారు.

నేటి నుంచే భూముల క్రయ విక్రయాలు
వైద్యులు, విజ్ఞులు అందరూ చెప్పిన దాని ప్రకారం పోతే ఎక్కువ శాతం కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వంద శాతం పనిచేస్తాయని, భూముల అమ్మకాలు, కొనుగోళ్లు యధాతధాంగా చేసుకోవచ్చునన్నారు. భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇసుక మైనింగ్ కూడా బుధవారం నుంచే ప్రారంభిస్తామన్నారు. రవాణా ఆఫీసులు కూడా పనిచేసుకోవచ్చునని, వాహనాల రిజిస్ట్రేషన్లు యధాతధాంగా అమలు చేసుకోవచ్చునన్నారు. విద్యార్థులకు సంబంధించి పదో తరగతి పరీక్షలు మధ్యలో ఆగిపోయాయని సిఎం తెలిపారు. మూడు జరిగాయని, మిగతా ఎనిమిది హైకోర్టు నిబంధనల ప్రకారం ఈ నెలలోనే నిర్వహిస్తామన్నారు. పరీక్ష హాల్‌లో తక్కువ విద్యార్థులు ఉండేలా శానిటైజ్ చేసి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆర్‌టిసి బస్సులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటర్ పేపర్లు వాల్యూయేషన్ బుధవారం చేపడుతామన్నారు.

క్యాబినేట్ సబ్ కమిటీ విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభం అనేది ఫైనల్ చేస్తుందన్నారు. 15 రోజులు ఆలస్యమా… జూన్‌కే ఉంటదా జూలైకి పోతాదా.. దేశ, రాష్ట్ర కరోనా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

తెలంగాణ డైనమిక్ స్టేట్
తెలంగాణ డైనమిక్ స్టేట్. ఎన్నో రాష్ట్రాల వారు ఇక్కడ వచ్చి పని చేసుకుంటున్నారని సిఎం అన్నారు. ఎన్నో లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నారని తెలిపారు. వలసకూలీలు తమ బిడ్డలని, ఆదుకుంటామని చెప్పాం ఆదుకుంటున్నామన్నారు. దాదాపు ఏడున్నర లక్షల మంది కార్మికులకు సాయం చేశామని చెప్పారు. కుటుంబం ఉంటే రూ.1500, ఒకరు ఉంటే రూ.500 ఇచ్చామన్నారు. ఉచితంగా బియ్యం పంపిణీ చేసామన్నారు.

పని చేసుకోండి.. వెళ్తామంటే పంపిస్తం
కొంతమంది వలస కూలీలు ఉపాధి ఉంటే ఉంటామని చెబుతున్నారని, ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నందున చేసుకునే వాళ్లు చేసుకోవచ్చునన్నారు. నిర్మాణ, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, ఇంకా ఒక్కొక్కటి మొదలవుతున్నాయన్నారు. అదే సమయంలో వెళ్లాలనుకునే వాళ్లు వెళ్లొచ్చు అన్నారు. ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పంపిస్తామన్నారు. భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే 100కు డయల్ చేయాలని మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అయితే అందరూ ఒకేసారి వెళ్లలేరని తగిన జాగ్రత్తలు కొంతమంది చొప్పున పంపిస్తామన్నారు. జార్ఖండ్, రాజస్థాన్ ఒక ట్రైన్, యూపి, మధ్యప్రదేశ్‌కు రెండు ట్రైన్‌లు మంగళవారం వెళ్లాయన్నారు. బిహార్ వాళ్లు రైస్ మిల్లుల్లో పనిచేస్తారని, వాళ్లు ఇక్కడకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వాళ్లను తీసుకుని వస్తామన్నారు.
ఒక్కరికి డిపాజిట్ రాలేదు

అదో ఆల్ పార్టీనా.. గప్పాలు కొట్టెటోళ్లు
ఆల్ పార్టీ అంటే ఎవరున్నా అని ఫోటో చూస్తే ఒక ఇంటి పార్టీ.. ఇంకెదో. వీళ్లలో ఒక్కరికి డిపాజిట్ రాదన్నారు. అవి పార్టీల్లా ఉన్నాయా.. ప్రజలే సీరియస్‌గా తీసుకుంటలేరని సిఎం వ్యాఖ్యానించారు. దిక్కుమాలిన ముచ్చట్లు.. తప్పుంటే ప్రజలు నన్ను శిక్షిస్తారన్నారు. అర్థవంతమైన ఆరోపణలు, నిర్మాణత్మకమైన సూచనలు ఉంటే ఆల్ పార్టీ మీట్ పెడ్తామని తెలిపారు. వాళ్లు గప్పాలు కొడుతున్నారు. అందుకే ఆల్ పార్టీ మీటింగ్‌లు పెట్టడం లేదన్నారు. నీళ్ల విషయమై పెడితే పారిపోయారు. పరిజ్ఞానం లేదు. విషయం తెల్వదని సిఎం విమర్శించారు. చరిత్రలో మొదటిసారి కాకతీయ కాలువ తడి ఆరాటం లేదన్నారు. ఎంత గలీజు మాట్లాడుతున్నారన్నారు. 32 జడ్‌పిలలో ఒక్కటైనా వచ్చిందా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో నది ఎట్లా ప్రవహిస్తదో… వాహనాలు అలా ఉంటాయన్నారు. ఆర్‌టిసి 15 దాకా నడపమని, 15 తరువాత పరిస్థితిని బట్టి చేస్తామన్నారు. ఆటోలకు కేవలం గ్రీన్ జోన్‌లో అవకాశం ఉందన్నారు. 20 మందితో పెండ్లి చేసుకోవచ్చునని, చావులైతే 10 మందితో చేసుకోవాలని తెలిపారు.

కేంద్రం పద్ధతి సరికాదు..
కేంద్ర పద్ధతి ఇలా ఉండకూదని సిఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నిరసన వ్యక్తం చేశారు. జీతాలు, పెన్షన్‌లకు రూ.3 వేల కోట్లు కావాలని, కానీ రూ.1600 కోట్లు వచ్చిందన్నారు. రాష్ట్రానికి సగటున నెలకు రూ.15 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. కేంద్రం డబ్బులివ్వాలని కోరానని, అయితే వాళ్ల దగ్గర లేకపోవడంతో వేరే విధానాలు సూచించానన్నారు. కొన్ని నెలలు ఈ ప్రభావం ఉంటుదన్నారు. వలస కార్మికులకు టికెట్లు పెట్టారని, చాలా అన్యాయమన్నారు. రూ.4 కోట్లు తాము కట్టామని సిఎం పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బిం పెంచాలని కేంద్రాన్ని కోరానని, అలాగే అప్పులు కూడా వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ప్రధాని ఏం నిర్ణయం తీసుకోలేదన్నారు. అధికారం ఇవ్వండి తాము మాట్లాడుకుంటామన్నారు. పవర్ ముసాయిదాలోనూ రాష్ట్రాల పరిధిలో ఉన్నవి కేంద్రం తీసుకుంటుందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని, ప్రస్తుతం తెచ్చిన ముసాయిదా ప్రకారం కేంద్రం ఎలా చెబితే అలా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

రైతులు చిల్లర రాజకీయాలను నమ్మొద్దు
తెలంగాణ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. చిల్లర రాజకీయాలు చేసేవారిని రైతులు నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయలేదని విమర్శించారు. చత్తీస్‌ఘడ్ రైతులు మన రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో పంటలు అమ్ముకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పాలిత ప్రాంతాలలో ఎక్కడైనా రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ఏ అంశా న్ని ఎత్తుకోవాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ముందుగా ప్రతిపక్షాలు అంశాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించచారు.

నో మాస్క్… నో వైన్
నిబంధనలు ఉల్లంఘిస్తే గంటలో క్లోజ్
ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వంటల వరకు మద్యం విక్రయాలుంటాయని సిఎం తెలిపారు. జిహెచ్‌ఎంసిలోని 15 కంటైన్‌మెంట్ జోన్ల మినహా రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు ఓపెన్ అవుతాయన్నారు. బార్లు, పబ్‌లకు మాత్రం ఎట్టి పరిస్థితిల్లో అనుమతివ్వమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన సడలింపులతో రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర, కర్ణాటక, చత్తిస్‌ఘడ్‌లలో మద్యం విక్రయిస్తున్నారని, దీంతో తెలంగాణలో కూడా ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. లేకపోతే తెలంగాణ ప్రజలు అక్కడికి మందు కోసం వెళ్లే అవకాశం ఉందన్నారు. దీంతో వైరస్ వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందన్నారు. మద్యం ధరలు మాత్రం 16 శాతానికి పెంచుతున్నామని, తక్కువ ధరలు ఉన్న బ్రాండ్లపై 11 శాతం, హై క్వాలిటి బ్రాండ్లపై ఎక్కువ శాతంతో సగటున 16 శాతం వరకు ధరలు పెరుగుతాయన్నారు. అయితే వైన్ షాపులు వద్ద ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని దీనికి సదరు షాపుల వాళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ షాపులను గంటలోపే క్లోజ్ చేస్తామన్నారు. మరి కొన్ని రోజులు శ్రమిస్తే విజయం సాధిస్తామన్నారు. హైదరాబాద్‌ను చాలాసేఫ్‌గా చూసుకోవాలని, 100 శాతం దీనిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వైరస్‌లు సోకినప్పుడు గత అనుభవాల దృష్టా స్పైన్ ప్లూ, స్పానిష్ ప్లూ కావచ్చు ఇతరత్రా వైరస్‌లు కావచ్చు యావత్ వైద్య ప్రపంచం, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వెలిబుచ్చుతున్న అభిప్రాయం 70 రోజుల సైక్లింగ్ పాస్ అయితే చాలావరకు ఇలాంటి వైరస్‌లు కంట్రోల్ అవుతాయని కెసిఆర్ పేర్కొన్నారు. 70 రోజుల అనంతరం అడపదడపా అక్కడక్కడ కరోనా కేసులు నమోదైనా, చాలావరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉందన్నారు. అందులో భాగంగానే రానున్న రోజుల్లో లాక్‌డౌన్ పాటించాలన్న అభిప్రాయాన్ని వైద్యులతో పాటు పలువురు వ్యక్తం చేశారని సిఎం తెలిపారు.

కొందరు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని దీనిని పెద్దగా పట్టించుకో మన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కనపెడితే కేంద్ర ప్రభుత్వం దగ్గర పిపిఈ కిట్లు 10 కూడా లేవని, సిఎంల సమావేశంలో కేంద్ర హెల్త్ సెక్రటరీ ప్రీతి సూడాన్ ఈ విషయాన్ని తెలియచేశారన్నారు. మాస్కులతో పాటు పిపిఈ కిట్లను వేరే దగ్గరి నుంచి తెప్పించుకునే పరిస్థితుల్లో మన దేశం ఉందన్నారు.

కెసిఆర్ ఉన్నంత వరకు రైతుబంధు
రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రైతు బంధు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ బతికున్నంత కాలం, టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంత వరకూ వందకు వంద శాతం రైతు బంధు పథకం కొనసాగిస్తామని చెప్పారు. రైతుల అప్పుల తీరి, సొంతంగా పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చేంత వరకు ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందన్నారు.వర్షాకాలం పంటకు కూడా రూ. 7 వేల కోట్లు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా రూ. 25 వేల వరకూ రుణం ఉన్న రైతులందరికీ మాఫీ చేస్తాన్నారు. అందుకు కావాల్సిన రూ. 1200 కోట్లను బుధవారమే విడుదల చేస్తామని సిఎం వెల్లడించారు. ఈ రుణమాఫీ ద్వారా రాష్ట్రంలో సుమారు 5.50 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

తెలంగాణలో మద్దతు ధరకు ధాన్యం కొంటున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతు బీమా, రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడైనా రైతు బీమా, రైతుబంధు పథకాలు అమలవుతున్నాయా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను ఏకమొత్తంగా కొనుగోలు చేస్తున్నది తమ ప్రభుత్వమే అని అన్నారు. మొక్కలు, శనగ, కందులు ప్రభుత్వమే కొంటోందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కేంద్రాలలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో ఉండేది రైతు రాజ్యమే అని పేర్కొన్నారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ అని సిఎం పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News