Friday, April 26, 2024

లంచావతారులు

- Advertisement -
- Advertisement -

ఎసిబి వలలో ఇద్దరు అధికారులు
రూ.2.25లక్షలు తీసుకుంటూ పట్టుబడిన దుండిగల్ మున్సిపల్ డిప్యూటీ ఇంజినీర్ హనుమంతు నాయక్
రూ.1.65లక్షలతో అడ్డంగా దొరికిన మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్

మనతెలంగాణ/హైదరాబాద్: ఉన్నత హోదాలో ఉన్న ఇద్దరు ప్రభుత్వ అధికారులు లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ గురువారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ లక్ష 65 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అలాగే బిల్లులు మంజూరు చేసేందుకు రూ. 2.25 లక్షలు లంచం తీసుకుంటూ దుండిగల్ మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హనుమంతరావు నాయక్‌ను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌ నగర్ పురపాలిక పరిధిలో ఏర్పాటు చేయనున్న క్లోరినేషన్ గ్యాస్ ప్లాంట్‌ను నామినేటెడ్ పద్ధతిలో ఇప్పిస్తానని అందుకు గాను 20 శాతం డబ్బులు ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టర్‌ను మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బేరసారాల అనంతరం చివరకు 15 శాతంగా ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నాడు. లంచం మొత్తంలో భాగంగా లక్ష 65 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు .క్లోరినేషన్ ప్లాంట్‌కు సుమారు 11 లక్షల విలువ అవుతుండగా మున్సిపల్ కమిషనర్ 20 శాతం కమీషన్ ఇవ్వాల్సిందిగా కోరాడని కాంట్రాక్టర్ ఆలీ అహ్మద్ ఖాన్ తెలిపారు. గతంలో 5 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇచ్చేవారమని ఇప్పుడు ఏకంగా 20 శాతం అడగడం వల్ల ఎసిబి అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు.

ఇదిలావుండగా లంచం కేసులో పట్టుబడిన మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ హయత్ నగర్, నల్లగొండ శ్రీనాధ్ పురంలో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. కాగా దుండిగల్ మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హనుమంతరావు నాయక్ రూ. 2.25లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సూర్యాపేటలో పనిచేస్తున్న హనుమంతరావు ఇటీవల కాలంలో దుండిగల్‌కు బదిలీ అయ్యాడు. గతంలో సూర్యాపేటలో పనిచేసిన సమయంలో ఓ బిల్లుకు సంబంధించి రూ. 3లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు రియాసత్ ఖాన్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈక్రమంలో ఉప్పల్ ఇండోర్ స్టేడియం వద్ద రూ. 2.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కాంట్రాక్టర్ రియాసత్ ఖాన్ పనిచేసిన బిల్లులకు సంబంధించి బిల్‌బుక్‌లో పొందుపరిచేందుకు గతంలో సూర్యపేటలో పనిచేసిన హనుమంతరావును సంప్రదించడంతో తనకు అనుకూలంగా వ్యవహరించేందుకు రూ. 3లక్షల నగదు డిమాండ్ చేశాడు. ఈక్రమంలో లంచం మొత్తాలు రూ. 2.25లక్షలకు ఒప్పంద కావడంతో లంచం మొత్తాలను ఒకేసారి ఇవ్వాలని హనుమంతరావు డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ రియాసత్‌ఖాన్ ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన ఎసిబి బృందం హనుమంతరావు లంచం తీసుకుంటుండగా పట్టుకుని అతని చేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు.

Mahabubnagar municipal Commissioner in ACB Net

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News