Monday, April 29, 2024

బల పరీక్షకు ముందే అస్త్ర సన్యాసం

- Advertisement -
- Advertisement -

అనుకోని సిఎంను అనుకోకుండా వెళ్లుతున్నా

మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ రాజీనామా
బలపరీక్షకు ముందే సెలవు
సుప్రీంకోర్టు రూలింగ్‌కు గౌరవం
ప్రజాస్వామ్యం నిలబడాలనే ఆకాంక్ష
బిజెపి పావులతో మహా అగాథం

న్యూఢిల్లీ /ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం నాటి బలపరీక్షకు ముందే బుధవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తమ పదికి రాజీనామా చేశారు. బుధవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. ఆయన ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా గురువారం విశ్వాస పరీక్షకు నిలవాల్సిందేనని బుధవారం తీవ్రవాదోపవాదాలు తరువాత అత్యున్నత న్యాయస్థానం రూలింగ్ వెలువరించింది. దీనిని పరిగణనలోకి తీసుకుని, తీర్పు తరువాత కొద్ది సమయానికే ఆయన రాజీనామా ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తానని పేర్కొన్న థాకరే దేశంలో ప్రజాస్వామ్యం నిలవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు రూలింగ్ తరువాత సిఎం రాజీనామాతో రాష్ట్రంలోని శివసేన, ఎన్‌సిపి , కాంగ్రెస్ పార్టీల మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. గురువారం నాటి బలపరీక్ష ఫలితం ఏ విధంగా ఉన్నా దానిని తాము జులై 11వ తేదీన రెబెల్స్ పిటిషన్లు , సర్కారు, డిప్యూటీ స్పీకర్ వ్యాజ్యాల విచారణల తరువాతనే బలపరీక్ష ఫలితం అమలులోకి వస్తుందని సుప్రీంకోర్టు రూలింగ్‌లో తెలిపింది. అయితే ఈ వివరణ అంశం జోలికి వెళ్లకుండా ఇప్పటికే సొంతపార్టీ శివసేనలో మైనార్టీ నాయకుడిగా మారిన ఉద్ధవ్ రాజీనామాకు దిగారు.

సుప్రీంకోర్టు రూలింగ్ తరువాత ఉద్ధవ్ ఆన్‌లైన్‌లో ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని అనుసరించాల్సి ఉంటుంది. సంబంధిత ప్రక్రియను ఆచరించాల్సి ఉంటుందన్నారు. తాను మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి (ఎమ్మెల్సీ) కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఆయన శివసేన జట్టు కేవలం 15 మంది ఎమ్మెల్యేల బలహీనతను చాటుకుంది. మరో వైపు బిజెపి పాలిత రాష్ట్రంలోని అసోంలోని గువహతిలో క్యాంపు రాజకీయాలకు దిగిన అసమ్మతినేత ఏక్‌నాథ్ షిండే వర్గీయుల బలం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఈ లోగా సుప్రీంకోర్టునే నేరుగా ఆశ్రయిస్తూ ఇటు రెబెల్స్ అటు డిప్యూటీ స్పీకర్ వ్యాజ్యాలకు దిగడం , రెబెల్స్‌పై అనర్హత వేటు నోటీసు నుంచి సుప్రీంకోర్టు గడువును పెంచడం వంటి పరిణామాల దశలోనే షిండే వర్గం గవర్నర్‌ను మంగళవారం కలిసి అధికార శివసేనలో తమదే ఆధిక్యతగా ఉందని తెలియచేయడం, వెంటనే గవర్నర్ బలపరీక్షకు ఆదేశించడం చకచకా జరిగాయి. మరో వైపు గురువారం నాటి బలపరీక్షకు ముందస్తు వేదికగా బిజెపి నేతలు ఫడ్నవిస్ ఇతరులతో షిండే సుదీర్ఘ మంతనాలు సాగించారు.

బుధవారం ముంబైకి చేరుకునేందుకు షిండే వర్గం గువహతి ఫైవ్‌స్టార్ హోటల్‌ను ఖాళీ చేసి వచ్చే దశలో సుప్రీంకోర్టులో ఉద్ధవ్ పిటిషన్ గురించి తెలియడంతో వారు కొంత సేపు గువహతిలోనే ఆగి తరువాత నేరుగా ముంబైకి కాకుండా గోవాకు క్యాంప్ కోసం తరలివెళ్లారు. ఉద్ధవ్ పిటిషన్‌పై రాత్రివరకూ విచారణ జరిగింది. థాకరే తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనూ సింఘ్వీ తమ వాదనను విన్పించారు. తమ క్లయింట్ తరఫు వారు చెపుతున్నట్లు బలపరీక్షకు గవర్నర్ ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందా? రాఫెల్ స్పీడ్ కన్నా వేగంగా ఆయన స్పందించడంలో అర్ధం ఏమిటనే ప్రశ్న వస్తోందన్నారు. గురువారం అసెంబ్లీలో బలపరీక్షకు దిగితేనే మంచిదని పవార్‌ఇతరులు సూచించినట్లు అయితే థాకరే తమ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించినట్లు తెలిసింది. కేవలం ఫేస్‌బుక్ ద్వారానే సంక్షిప్తంగా స్పందించిన థాకరే తరువాత గవర్నర్‌కు రాజీనామా సమర్పించేందుకు ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లారు.

బలపరీక్ష పరిణామాలు ఎలా ఉంటాయనేది తనకు తెలుసునని, అయితే ఈ దశలో రేపు గురువారం శివసైనికుల రక్తం చిందుతుందని ఇది తనకు ఇష్టం లేదని అందుకే ముంబై ప్రశాంతతకు తాను రాజీనామా నిర్ణయం తీసుకుని ఈ రాత్రి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం తమకు సహకరించిన కాంగ్రెస్‌కు , ఎన్‌సిపికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు థాకరే తెలిపారు. తాను ప్రోత్సాహించిన వారే చివరికి ఈ విధంగా ఇప్పుడు వెన్నుపోట్లకు దిగారని ఉద్ధవ్ రెబెల్స్‌పై సౌమ్యంగానే విరుచుకుపడ్డారు . అనూహ్యంగానే అధికారంలోకి వచ్చాను. అదే విధంగా వెళ్లిపోతున్నానని తెలిపారు. శివసేన ఓ కుటుంబం, దీనిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని, తాను ఎక్కడికి వెళ్లడం లేదని, మద్దతుదార్లను కూడగట్టుకుని తిరిగి బలోపేతం అవుతానని ప్రకటించారు.

ఫలించిన 8రోజుల షిండే తిరుగుబాట
ముందు సూరత్ తరువాత గువహతి గోవా తిరిగి ముంబై

ఎనిమిదిరోజుల క్రితం షిండే శివసేన అధినేత థాకరేపై తిరుగుబాటుకు దిగారు. ఆయన ఆధిపత్య ధోరణి చివరికి ఎమ్మెల్యేలను ఆయన నివాసం వద్దకు కూడా రానివ్వని స్థాయికి చేర్చిందని విమర్శించి వారు తొలుత గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లారు. ఇదంతా కూడా బిజెపి అధినాయకత్వపు ఆదేశాలు, అమిత్ షా, ఫడ్నవిస్‌ల వ్యూహరచనతో సాగినట్లు స్పష్టం అయిన దశలోనే రెబెల్స్ శిబిరం అసోంలోని గువహతి గూటికి చేరింది. అక్కడ రోజురోజుకీ బలోపేతం అయి చివరికి థాకరేకు బలపరీక్ష సవాలు దశకు చేర్చింది. అయితే బలపరీక్షను కూడా ఎదుర్కొని స్థాయిలో థాకరే వైదొలగాల్సి వచ్చింది. గురువారం బలపరీక్షకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వెలువరించిన ఆదేశాలను నిలిపివేయాలని థాకరే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే గవర్నర్ ఆదేశాలను నిలిపివేయడం కుదరదని, ఖరారు చేసినట్లుగానే గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం రాత్రి రూలింగ్ ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత గవర్నర్‌ను కలిసిన గంటల వ్యవధిలోనే అసెంబ్లీలో ప్రభుత్వ విశ్వాస ఓటుకు గవర్నర్ ఉన్నంట్లుడి ఆదేశించారని , బలపరీక్షకు ఇంత హడావిడి ఆకస్మిక నిర్ణయాలు దేనికని ప్రభుత్వ వాదనను సీనియర్ లాయర్ అభిషేక్ మనూ సింఘ్వీ నిన్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News