Monday, April 29, 2024

దేశానికి మేధావులే దిక్సూచి

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లో మారణకాండ ప్రారంభమై మూడు నెలలు దాటుతున్నది. ఇప్పటికే 150కి పైగా హత్యలు జరిగాయి, ఐదు వేలకు పైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. 350 శరణార్ధి శిబిరాల్లో 10 వేల మంది బాలలు ఆశ్రయం పొందుతున్నారు. మణిపూర్‌లో అశాంతి పూర్తిగా రాజ్యమేలుతున్నది. జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వమే ఒక వర్గానికి ఆయుధాలు అందించి ఈ మారణకాండను ఉసిగొల్పుతున్నట్లుగా వార్త మాధ్యమాలద్వారా ప్రజలకు అర్థం అవుతున్నది. ప్రభుత్వం శాంతిని నెలకొల్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తే ఎప్పుడో శాంతి ఏర్పడేదని మేధావుల విశ్వాసం.

కానీ ప్రభుత్వం ఆ వైపుగా ప్రయత్నాలు కొనసాగించడం లేదు. అందుకే 21 మందితో కూడిన పార్లమెంటరీ కమిటీ పర్యవేక్షించింది. ప్రభుత్వానికి శాంతి తీసుకు రావాలని, అది ప్రభుత్వం బాధ్యత అని నివేదిక కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బుద్ధిజీవులైన మేధావులు ఈ ఘటనలపట్ల, పరిష్కారాల పట్ల తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.అందులో భాగంగానే సెంట్రల్ యూనివర్శిటికి చెందిన ప్రొఫెసర్ ఖవ్‌ు ఖాన్ సువాన్ హౌసింగ్ (Kham Khan Suan Hausing) తన అభిప్రాయాలను మీడియాపరంగా వెలిబుచ్చారు.

ఎందుకంటే ఈ దేశం పట్ల తన బాధ్యతగా గుర్తించాడు కాబట్టి స్పందించాడు. ప్రభుత్వం తనకు వ్యతిరేకమైన నిర్ణయాన్ని, ఆలోచనను నేరంగా పరిగణించి ఇప్పటికే అనేక మంది మేధావులను జైళ్ళో కూడా నిర్బంధించింది. కానీ ఈ విషయంలో ప్రొఫెసర్ ఖవ్‌ు ఖాన్ సువాన్ హౌసింగ్ చేసిన ఆలోచనలను ప్రభుత్వం ప్రజా సంబంధంగా ఆలోచించి ఆలోచనలు ఎప్పుడూ నేరం కాదు, శోధించి వాస్తవాలను బయటకు తీయడమనేదే సమాజానికి కావలసింది. ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచించి ప్రొఫెసర్ ఖవ్‌ు ఖాన్ సువాన్ హౌసింగ్‌పై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్టుమెంట్ ప్రొఫెసర్ గత పదేళ్లుగా ఇదే

యూనివర్శిటీలో అధ్యాపకుడిగా పని చేస్తున్న ఆయన ప్రస్తుతం ఆ డిపార్టుమెంట్ హెడ్‌గా కొనసాగుతున్నాడు. విద్యావేత్తగా మంచి పేరున్న ఆయన మణిపూర్‌లో జరుగుతున్న సివిల్ వార్ గురించి జాతీయ మీడియాలో ఈ మధ్య కాలంలో విరివిగా మాట్లాడుతున్నాడు. హిందూ వంటి ప్రఖ్యాత ఆంగ్ల పత్రికలో ఆర్టికల్ (మే 10, 2023) రాస్తూ వున్నాడు. ఇంకొన్ని టివి ఛానల్‌లో మణిపూర్‌లో జరుగుతున్న తాజా పరిణామాల గురించి లోతుల్లోకి వెళ్లి విశ్లేషణ చేశాడు. అయితే తాజా ఘటనల నేపథ్యంలో ప్రొ. హౌసింగ్ ఈ మధ్య ‘ది వైర్’ కోసం సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కి (జూన్ 17, 2023) ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ విస్తృతంగా వైరల్ అయింది.

నిజాలను ప్రస్తావించడం ఎవరినైనా నేరంగా మారుస్తున్నది. ప్రొ. హౌసింగ్ చేసిన కామెంట్స్ మతపరమైన భావాలను రెచ్చగొట్టాయని, శత్రుత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు మెయితీలు ఆరాధించే దేవతలను, వాళ్ళ సంప్రదాయాలను కించపరిచే విధంగా ఉన్నాయని, మణిపూర్ సమగ్రతను దెబ్బ తీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ మైయితీ ట్రైబ్స్ యూనియన్ (ఎంటియు) సభ్యుడు మణిహార్ మొయిరంగ్థేవ్‌ు సింగ్ ఫిర్యాదు చేశాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఇంఫాల్ తూర్పు జిల్లా కోర్టు ప్రొఫెసర్ ఖవ్‌ ఖాన్‌కు సమన్లు జారీ చేసింది (జులై 28న కోర్టు ముందు హాజరు కావాలని కోరింది).

అతనితో పాటు కుకీ కార్యకర్తలైన మేరీ గ్రేస్ జూ (కుకీ ఉమెన్స్ ఫోరవ్‌ు కన్వీనర్), విల్సన్ లాలం హాంగ్‌షింగ్ (కుకీ పీపుల్స్ అలయన్స్ ప్రధాన కార్యదర్శి) కి సమన్లు జారీ చేసింది. వాస్తవానికి ప్రొ. హౌసింగ్ కరణ్ థాపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ, హిందూ పేపర్‌లో రాసిన ఆర్టికల్లో కానీ, The Diplomat పత్రిక కోసం (జూన్ 12, 2023) సుధా సుబ్రహ్మణ్యంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ, The print ఇంటర్వ్యూలో కానీ ఎక్కడా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు, అసత్యాలు ప్రచారం చేయలేదు. వీలైనంత మేరకు ప్రభుత్వ సంస్థలు, మీడియాలో ప్రచురితమైన కథనాలను ఉదహరిస్తూనే తన విశ్లేషణలు కొనసాగించాడు. ఈ సందర్భంగా ప్రొ. హౌసింగ్ లేవనెత్తిన అంశాల గురించి ప్రస్తావించుకోవాలి.

నిజానికి మెయిన్ స్ట్రీవ్‌ు మీడియాలో చర్చించని అనేక అంశాలను ఆయన లేవనెత్తాడు. అందులో ప్రధానమైనది 2017 మార్చిలో బీరేన్ సింగ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న వరుస పరిణామాల గురించి ప్రస్తావించాడు. మెజారిటీ మైయితీ ఆధిపత్యాన్ని, స్వదేశీ మతం (సనామహి) విశ్వాసాలను బలవంతంగా ఆదివాసీ ప్రాంతాల్లో రుద్దేందుకు ప్రయత్నిస్తున్న చర్యల్ని ఎండగట్టాడు. ఇవి మాత్రమే కాకుండా ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అండదండలతో మైయితీ జాతి సంస్థలైన మెయితీ లీపున్ (Meitei Leepun), అరంబై టెంగోల్ (Arambai Tenggol) లు కుకీ ఆదివాసీలపై సాగిస్తున్న మారణకాండను బహిర్గతం చేస్తూపోయాడు.

వీటికి తోడు పోలీసు, పారా మిలిటరీ, బోర్డర్ సెక్యూరిటీఫోర్స్ మొదలైన వాటిలో పని చేస్తున్న మెయితీ సామాజిక వర్గానికి చెందిన 22 మంది హయ్యర్ ఆఫీసర్లను పని గట్టుకొని సున్నితమైన ప్రాంతాల్లో నియమించడం వెనుక కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు. ఇవన్నీ ఒకటైతే, ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయని తెలిసినా భద్రతాపరమైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వేలాది అత్యాధునిక తుపాకులను (నాలుగు వేలకు పైగా తుపాకులు) మెజారిటీ మెయితీలు ఉంటున్న లోయ ప్రాంతాల్లోనే భద్రపరచడం, వాటిని సునాయాసంగా మెయితీ తీవ్రవాద సంస్థలు, జాతీయులు ఎత్తు కెళ్ళేందుకు ఆస్కారం కల్పించడం వెనుక రాజకీయ కారణం ఏమీ లేదా అని అనుమా నం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ, పోలీసుల అండదండలు లేకుంటే ఎలా అంబులెన్స్‌లో సాయుధ మెయితీ మూక యథేచ్ఛగా తిరుగుతుందని ప్రశ్నించాడు. బలమైన అడవులే కాదు బహిరంగంగా దాడుల కోసం తిరుగుతున్న వారిని నియంత్రించలేకపోతే పాలనకు అర్ధం ఉంటుందా?

కర్ణాటక ఎన్నికల సందర్భంగా 16 ర్యాలీలో పాల్గొనేందుకు తీరిక ఉన్న ప్రధాని మోడీకి రైలు ప్రమాదం సందర్భంగా 200 మంది ప్రాణాలు కోల్పోయారు అని తెలియగానే హుటాహుటిన క్షతగాత్రులను, బాధితులను పరామర్శించిన ప్రధాని గత మూడు నెలలకు పైగా ఒక రాష్ర్టంలోని ప్రజానీకం మారణ హోమంలో సమిదలవుతున్నా నిమ్మకి నీరెత్తినట్లు ఉండడం వెనుక రాజకీయ కారణం ఏమీ లేకుండా ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశాడు. తక్షణమే సమస్యను పరిష్కరించాల్సిన ఈ దేశ హోం మంత్రి తీరిగ్గా మణిపూర్‌కు రావడమే కాకుండా 15 రోజుల్లో శాంతిని నెలకొనేలా ప్రయత్నిస్తాము అని చెప్పడం అంటే మెజారిటీ మెయితీలకు ఇంకాస్త సమయం ఇచ్చి యథేచ్ఛగా ప్రత్యర్థి కుకీ జాతి నిర్మూలన కొనసాగించమని పరోక్షంగా చెప్పడమే కదా అని నిలదీశాడు.! దహనం జరుగుతున్న చోట వెంటనే ప్రాణాల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

ఇవన్నీ ప్రశ్నిస్తూనే ప్రొ.హౌసింగ్ మణిపూర్ ప్రజానీకం తెగలుగా (మెయితీ, కుకీ) స్పష్టంగా చీలిపోయిన నేపథ్యంలో ఎంతో కాలంగా కుకీ ప్రజలు లేవనెత్తుతున్న ‘ప్రత్యేక కుకీ లాండ్’ గురించి ప్రస్తావించడం. వాస్తవానికి ఈ డిమాండ్ ఆయన కొత్తగా చేస్తున్నదేమీ కూడా కాదు. కానీ ఒక ప్రొఫెసర్‌గా ఆయన లేవనెత్తుతున్న అంశాలు జాతుల మధ్య సామరస్యం పూర్తిగా దెబ్బతినకూడదని అభిప్రాయపడ్డాడు.

అయితే మణిపూర్ కోర్టు తనపై జారీ చేసిన సమన్లు, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కోరుతూ ప్రొ. హౌసింగ్ తరపున సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్, న్యాయవాదులు అంజు థామస్, ఆస్తా శర్మలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వర్శిటీలో రాజకీయ శాస్త్ర విభాగానికి నాయకత్వం వహిస్తున్న ప్రొ. హౌసింగ్ ఈశాన్య ప్రాంతంలో నిపుణుడిగా పరిగణించబడుతున్నాడని, అతని వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించాలనే తమ అభ్యర్థనను అత్యవసరంగా జాబితా చేయాలని కోరారు. వాస్తవానికి నిన్న (జులై 28న) భారత ప్రధాన న్యాయమూర్తి ముందు లిస్ట్ చేయబడిన ఈ పిటిషన్, సిజెఐ అనారోగ్యంతో ఉండటంతో విచారణ జరగలేదు. కానీ జులై 31న విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రొ. హౌసింగ్‌కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.

గుర్తింపు పొందిన అకడమిషన్‌గా ప్రొ. హౌసింగ్‌కు మద్దతుగా దేశ విదేశాలకు చెందిన 32 మంది యూనివర్శిటీ ప్రొఫెసర్లు నిలిచారు. ప్రజా సమస్యలపై అకడమిక్ మేధావులుగా తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే మేధావులపై ఇలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయడం, భయభ్రాంతులకు గురిచేయడం అకడమిక్ సెన్సార్స్ప్‌కు గురిచేయడమే అని వాళ్లంతా వ్యతిరేకించారు. సమాజానికి మేధావులే దిక్సూచిగా ఉంటారనే సత్యాన్ని ప్రభుత్వం విస్మరిస్తున్నది. “రాజ్యాంగ హక్కులో భాగంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందులో భాగంగానే ప్రొ. హౌసింగ్ ఒక అకడమిషన్‌గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని, అది అతని విధ్యుక్త ధర్మం అతనికి అండగా ఉంటామని’ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘాలైన ఎస్‌ఎఫ్‌ఐ, ఎఎస్‌ఎ సంఘాలు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి.

విద్యా సంఘాలే కాదు ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు కూడా ప్రొఫెసర్ ఖవ్‌ు ఖాన్ సువాన్ హౌసింగ్’పై అమలు చేస్తున్న నిర్బంధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించడం, ప్రశ్నించడం, ప్రజాస్వామికవాదులుగా మేధావుల సహజ కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణలో భాగంగానే ఇప్పటికే ప్రొ. ఆనంద్ టేల్‌టుండె, ప్రొ. హనీబాబు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గౌతం నవలకా, ప్రొ. సాయిబాబాలను నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రజాస్వామిక ఆలోచనలకు అవకాశమే లేకుండా నిర్బంధ విధానం అమలవుతుంది. దీన్ని మనందరం ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రశ్నించాలి, ప్రొ. ప్రొఫెసర్ ఖవ్‌ు ఖాన్ సువాన్ హౌసింగ్ లాంటి వ్యక్తులను మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి.

ఎన్. నారాయణ రావు- (పౌర హక్కుల సంఘం తెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News