Saturday, April 27, 2024

మరాఠా రిజర్వేషన్లు చెల్లవు

- Advertisement -
- Advertisement -

Maratha quota is invalid, unconstitutional: Supreme court

తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు …..
మహారాష్ట్రలో ప్రకంపనలు
కేంద్రం జోక్యానికి థాకరే వినతి

న్యూఢిల్లీ : మరాఠా రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టు బుధవారం సంచలనతీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతాన్ని మించరాదని, ఇది రాజ్యాంగ ప్రక్రియ అని, దీనికి విరుద్ధంగా వెళ్లడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుందని ధర్మాసనం తెలిపింది. మరాఠా రిజర్వేషన్ల కోటా ఆదేశాలు చెల్లనేరవని, కోటాను రద్దు చేస్తున్నామని బుధవారం తెలిపింది. చాలా కాలంగా రిజర్వేషన్లలో 50 శాతం లక్ష్మణరేఖ ఉంది. 2018లో వెనుకబాటుతనం, విద్యావిషయంలో దిగజారి ఉండటం వంటి వాటిని ప్రాతిపదికగా చేసుకుని మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ కోటా రాష్ట్ర సర్కార్ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థలలో ప్రవేశానికి వర్తింపచేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ బొంబాయి హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు రిజర్వేషన్లను సమర్థిస్తూ 2019లో తీర్పు వెలువరించింది. అయితే విద్యాసంస్థలలో ప్రవేశాలపై కోటాను 16 నుంచి 12 శాతానికి కుదించింది.

ఇక ఉద్యోగాలలో కోటాను 13 శాతానికి తగ్గించింది. అయితే ఇది కూడా రాజ్యాంగపరమైన కోటా పరిమితి 50 శాతాన్ని దాటిందని హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై న్యాయమూర్తి అశోక్ భూషన్ సారధ్యపు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపిన తరువాత బుధవారం తీర్పు వెలువరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగపరమైన కోటా పరిమతిని దాటడానికి వీల్లేదని ధర్మాసనం తెలిపింది. అయితే ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ప్రాతిపదికన మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించారని తాము గుర్తించినట్లు తెలిపింది. అయితే పార్లమెంట్ చేసిన సవరణ మేరకు ఒక వర్గాన్ని సామాజిక, ఆర్థిక వెనుకబాటు తరగతిలో చేర్చడం గురించి అధికారం రాష్ట్రాలకు లేదని, సంబంధిత విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకువచ్చినట్లు అయితే, దీనిపై తీర్మానం చేయడం తద్వారా దీనికి రాష్ట్రపతి ఆమోదం వంటి పలు అంశాలు ఉంటాయని, ఇది లేకుండా కోటాను 50 శాతం పరిమితి దాటేలా చేయడం రాజ్యాంగ పరిమితిని విస్మరించడంగా భావించాల్సి ఉంటుందని భావించిన సుప్రీంకోర్టు మరాఠా కోటాకు చెక్ పెట్టింది. 1992 మండల్ తీర్పు క్రమంలో వెలువడ్డ పరిమితి కీలకం అని తెలిపింది.

సుప్రీం తీర్పు దురదృష్టకరం
మరాఠా కోటా పోరు ఆగదు : ఉద్ధవ్

మరాఠా కోటాపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రస్థాయిలోనే స్పందించారు. ఇది దురదృష్టకరతీర్పు అన్నారు. ఇప్పుడు కేంద్రం కలుగచేసుకోవల్సి ఉందన్నారు. బాల్ సెంటర్ కోర్టులో ఉందని తేల్చిచెప్పారు. వెనుకబడ్డ మరాఠీలకు ఉద్యోగాలలో , విద్యావకాశాలలలో తగు న్యాయం చేయాల్సి ఉందని, ఈ క్రమంలో కోటా వచ్చిందని, దీనిని కాదనడం భావ్యం కాదన్నారు. తీర్పు వెలువడ్డ వెంటనే ఆయన ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత తరుణంలో వెంటనే కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని తీరాలి. కేంద్రం చర్యకు చేతులెత్తి వేడుకుంటున్నానని, ఆర్టికల్ 370 , ఇతరత్రా అంశాలపై కనబర్చిన చొరవ, అత్యవసర ప్రాతిపదిక చర్యకు కేంద్రం దిగాల్సి ఉందన్నారు. రాష్ట్రపతికి, ప్రధానికి తాను సత్వర స్పందన కోసం వేడుకుంటున్నానని తెలిపారు. ఇంతకు ముందు కీలక విషయాలపై కేంద్రం సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని, ఇప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.

మరాఠా కోటా విషయంపై రాష్ట్ర ప్రజలు సంయమనం పాటించాల్సి ఉందని, ఎటువంటి అవాంఛనీయ చర్యలు అయినా పరిస్థితిని దిగజారుస్తాయని తెలిపారు. కేంద్రం కొన్ని విషయాలలో రాజ్యాంగ సవరణలకు దిగిన అంశాన్ని తాను తిరిగితిరిగి ప్రస్తావిస్తున్నట్లు, ఇప్పుడు కూడా ఇదే విధంగా ముందుకు రావల్సి ఉందన్నారు. మరాఠా కోటా విషయంలో ప్రధానిని కలిసేందుకు రాజ్యసభ సభ్యులు శంభాజీరాజే ఏడాదిగా ప్రధానిని కలిసేందుకు యత్నిస్తున్నారని , అయితే అవకాశం ఇవ్వడం లేదని థాకరే తెలిపారు. దీనికి కారణాలు ఏమిటనేవి తెలియవని అన్నారు. ఇప్పటికైనా ప్రధాని జోక్యం అవసరం అన్నారు. తమ ప్రభుత్వం కోటా గురించి న్యాయపోరాటం జరుపుతూనే ఉంటుందని , విజయం దక్కేవరకూ ఆగేది లేదని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News