Wednesday, May 1, 2024

అదనపు కోటాకు ఆపద

- Advertisement -
- Advertisement -

SC rejects Maratha reservation law

 

మహారాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాలలో మరాఠాలకు కేటాయించిన రిజర్వేషన్లను కొట్టి వేస్తూ ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నాడిచ్చిన తీర్పుతో వెనుకబడిన తరగతుల కోటా వ్యవహారం మళ్లీ మొదటి కొచ్చింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటకూడదంటూ 1992లో ఇందిరా సానే కేసులో విధించిన పరిమితిని మించిపోయాయనే కారణం మీదనే మరాఠాల కోటాను ధర్మాసనం కొట్టి వేసింది. దీనితో కొత్తగా రిజర్వేషన్లు కోరుతున్న ఏ వర్గానికీ వాటిని కల్పించే సందు బొత్తిగా లేకుండాపోయింది. ఎప్పటి నుంచో 69 శాతం రిజర్వేషన్లను ఇస్తున్న తమిళనాడు వంటి రాష్ట్రాల కోటా మీద భవిష్యత్తులో వేటు పడినా ఆశ్చర్యపోనవసరం ఉండదు. తమిళనాడులో వెనుకబడిన తరగతులకు (బిసిలు) 30 శాతం, అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబిసిలు) 20 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 18 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 1 శాతం రిజర్వేషన్లు 1993 నుంచి అమలులో ఉన్నాయి. కోర్టుల సమీక్షకు అతీతం చేస్తూ వీటిని రాజ్యాంగం 9వ షెడ్యూల్డ్‌లో చేర్చారు. ఇందిరా సానే కేసులో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విధించిన 50 శాతం గరిష్ఠ పరిమితిని మించి ఉన్నందున తమిళనాడు కోటా చెల్లదని ఈ ఏడాది ఫిబ్రవరిలో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

ఇప్పుడు మరాఠాల కోటాను కొట్టి వేసిన రాజ్యాంగ ధర్మాసనానికి కూడా జస్టిస్ అశోక్ భూషణే సారథ్యం వహించారు. మరాఠాలకు విద్య, ఉద్యోగాలలో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో చట్టం చేసింది. వీటిని విద్యారంగంలో 12 శాతానికి, ఉద్యోగాలలో 13 శాతానికి పరిమితం చేస్తూ బొంబాయి హైకోర్టు ఈ చట్టానికి ఆమోద ముద్ర వేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 50 శాతం పరిమితిని ప్రస్తావిస్తూ మరాఠాల కోటాను ఆ పిటిషన్లు ఎదిరించాయి. దానితో రాజ్యాంగ ధర్మాసనం మహారాష్ట్ర చట్టం అమలును గత ఏడాది సెప్టెంబర్‌లోనే నిలిపివేసింది. మరాఠాల కోటాను కేంద్రం కూడా సమర్థించింది. 50 శాతం హద్దును రద్దు చేయాలని మహారాష్ట్ర సహా పెక్కు రాష్ట్రాలు వాదించాయి. 50 శాతం పరిమితిని మించిపోయి మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించి తీరవలసిన అగత్యమేమిటో, ఆ ప్రత్యేక పరిస్థితులు ఎటువంటివో సంతృప్తికరంగా పేర్కొన లేదంటూ సుప్రీం ధర్మాసనం ఈ కోటాను కొట్టి వేసింది. బ్రిటిష్ వారి హయాంలో 1931లో జరిపిన చిట్టచివరి కుల ప్రాతిపదిక జనాభా లెక్కల ప్రకారం వెనుకబడిన తరగతులు దేశ జన సంఖ్యలో 52 శాతం ఉంటారని వెల్లడైంది.

మండల్ కమిషన్ వీరికి 27 శాతం రిజర్వేషన్లను సిఫారసు చేసింది. తర్వాత చాలా కాలానికి కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాలలో ఆ మేరకు బిసిలకు కోటా అమలు జరిగింది. రాజ్యాంగంలో రిజర్వేషన్లకు ఎటువంటి పరిమితిని విధించలేదు. మధ్యలో ఇందిరా సానే కేసు సందర్భంగానే 50 శాతం హద్దు గీత వచ్చి పడింది. ఏడు దశాబ్దాలకు పైబడిన స్వతంత్ర భారతంలో రిజర్వేషన్ల వల్లగాని, ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల మూలంగా గాని వెనుకబడిన తరగతుల పేదరికం తొలగకపోగా మరింత పెరిగిందని ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వాదనలు చోటు చేసుకున్నాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల ప్రభావంతో కుల వృత్తులు ధ్వంసమైపోయాయి. అణగారిన సామాజిక వర్గాలు మరింత అణగారిపోయాయి. ఇంకొక వైపు ప్రైవేటైజేషన్ తీవ్రమై ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయాయి. అగ్ర వర్ణాల్లో కూడా పేదరికం పెచ్చరిల్లి ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల నుంచి ఒత్తిడి పెరిగింది. దానితో ప్రధాని మోడీ ప్రభుత్వం 124వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇబిసిలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది.

వాస్తవానికి రాజ్యాంగం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు సామాజికంగా, విద్యావిషయకంగా వెనుకబడిన వర్గాలకే పరిమితమైనవి. ఇబిసి కోటా రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు దానిని కొట్టి వేయజాలదనే వాదన కూడా ఉంది. అయితే 50 శాతం పరిమితి అనుల్లంఘనీయమని సుప్రీం ధర్మాసనాలు పదేపదే స్పష్టం చేస్తున్నందున ఇబిసి కోటాకు కూడా ముప్పు తప్పదనే అభిప్రాయమూ వినబడుతున్నది. మొత్తానికి 50 శాతం పరిమితి అనేది అన్ని సామాజిక వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నది. దేశంలో ఏ సామాజిక వర్గం జన సంఖ్య ఎంతో తేల్చడానికి కుల ప్రాతిపదిక జన గణన అవసరం తలెత్తవచ్చు. అదే సందర్భంలో దేశంలో ఏయే కుల సామాజిక వర్గాలను పేదరికం ఎంతగా పీడిస్తున్నదో శాస్త్రీయమైన పరిశీలన త్వరలో చేపట్టబోయే జనాభా లెక్కల సందర్భంగా జరగవలసి ఉంది. వీటన్నిటి వెలుగులో రిజర్వేషన్ల పరిమితిని సడలించి శాస్త్రీయమైన హద్దును నెలకొల్పవలసి ఉంటుంది. ప్రైవేటు రంగంలో కూడా కోటా కోసం భిన్న ప్రజా వర్గాల నుంచి వత్తిడి పెరగవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News