Monday, April 29, 2024

సకాల వర్షాలు

- Advertisement -
- Advertisement -

 

ఇప్పటికనేక సంవత్సరాలుగా మండుటెండల మే నెల ముగియగానే తొలకరి పలకరింపు జాడలేక రెండో వేసవిని చవిచూస్తూ వచ్చిన చేదు అనుభవాన్ని మరిపింప చేస్తూ ఈ నెల జూన్ 1వ తేదీనే ఆగ్నేయ రుతు పవనాలు కేరళలో ప్రవేశించడం ఆ తర్వాత తరతమ భేదాలతో దేశమంతటికీ విస్తరించుకోడం ఆహ్లాదాన్ని కలిగించింది. మేలో కణకణమండిన రోడ్ల మీద బొబ్బలెక్కిన పాదాలతో వందల మైళ్లు నడిచిన వలస కార్మికుల దుస్థితిని చూసి చెమర్చని కళ్లు లేవు. ఆ దయలేని ఘట్టానికి తెర దించుతూ కొన్ని శ్రామిక రైళ్లు పట్టాలకెక్కడం అదే సమయంలో వర్షాలు మొదలవ్వడం ఈ జూన్ నెలను ఆశామయం చేశాయి. కరోనా కథ ముగియకుండా మరింత కఠోరమవుతున్నప్పటికీ సుదీర్ఘ లాక్‌డౌన్‌కు తెర దిగడంతో నేల తడిచిన గ్రామీణ భారతం దుక్కులు దున్ని విత్తనాలు చేబూనింది. వరి నారుమళ్లు భూమికి ఆకుపచ్చని శోభను తెచ్చాయి. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా రైతులు విత్తనాలు, ఎరువుల కోసం దుకాణాలు వద్ద బారులు తీరిన దృశ్యాలు కనువిందు చేశాయి.

దేశం మొత్తమ్మీద చూసుకుంటే ఈ నెలలో సాధారణంగా కురిసేదాని కంటే 21 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయినట్టు వార్తలు చెబుతున్నాయి. 2013 తర్వాత సకాలంలో తొలకరి పురి విప్పుకోడం ఇదే మొదటి సారి అని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలియజేసింది. అయితే ఇటు తొలకరి ప్రవేశించి వర్ష మేఘాలు కమ్ముకొని కురవడం ప్రారంభించిన వెంటనే అరేబియా సముద్రంలో తలెత్తిన నిసర్గ తుపాను దాని వేగానికి బ్రేకులు వేసింది. గాలిలోని తేమను హరించివేసింది. దానితో కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయి వానలు కురవలేదు. మరి కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. మధ్యప్రదేశ్‌లో జూన్‌లో సాధారణంగా కురిసే వర్షపాతం కంటే 114 శాతం అధికంగా, చత్తీస్‌గఢ్‌లో 104 శాతం ఎక్కువగా, గుజరాత్, గోవా, మహారాష్ట్రలలో వరుసగా 67%, 51%, 49% అదనపు వర్షపాతం నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి సాధారణ వర్షపాతం కంటే కొంచెం తక్కువ నమోదు చూపినప్పటికీ పంటలకు తగినంత అదను, పదును ఏర్పడింది. కాళేశ్వరం భారీ ప్రాజెక్టు రిజర్వాయర్లు, కాల్వలు విస్తరించుకొని ఆ ప్రాంతాల్లో సస్యశోభ విల్లసిల్లడానికి తగిన వాతావరణం స్థిరపడింది. వర్షాధార జిల్లాల్లో కూడా నేల దున్నడం, విత్తనాలు వేయడం చకచకా సాగిపోతున్నాయి. రైతుబంధు డబ్బు చేతికంది వ్యవసాయదార్ల ముఖాలు వికసిస్తున్నాయి. పంట పనులు జోరందుకున్నాయి. మిగతా కొద్ది రాష్ట్రాల కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తొలకరి స్వల్పంగా ఆలస్యమైనప్పటికీ ఈ నెలలో సాధారణ వర్షపాతంలో 97 శాతం నమోదవుతుందని ఐఎండి చెప్పిన జోస్యం నిజమవుతున్నది. మరి రెండు రోజుల్లో అంటే జూన్ మాసాంతానికి పూర్తి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నదని కూడా జోస్యం వెలువడింది.

తెలుగు రాష్ట్రాలు సహా దేశం మొత్తం మీద జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో సైతం మంచి వర్షాలు కురుస్తాయని పంటలు పుష్కలంగా పండుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే నిసర్గ తుపాను కారణంగా వర్షాలకు బ్రేకులు పడి వాతావరణంలో వేడి పుంజుకున్నది. పర్యవసానంగా తిరిగి ఉక్కబోత మొదలయింది. ఇది ఇంతటితో ఆగక ఈ ఏడాది మిడతల దండు వ్యాప్తికి దారి తీసే ప్రమాదమున్నదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. మిడతలు వేసవిలో దేశంలోని ఎడారి ప్రాంతానికి వస్తాయి. అక్కడే సంతానాన్ని కని అక్టోబర్, నవంబర్‌లలో వెళ్లిపోతాయి. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిణామాలు ఏర్పడ్డాయి. మామూలుకంటే ముందే వచ్చిన మిడతలు వేసవిలో అకాల వర్షాలకు గురైన ఉత్తర పశ్చిమ భారత భాగాల్లోకి విస్తరించాయి. ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాలపై దాడి చేశాయని ఆహార వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.

రాజస్థాన్‌లో తొలకరి వానలు ఊపందుకునే సమయానికి అక్కడికి చేరనున్న ఈ దండు ఈలోగా వీలైనంత వరకు విస్తరించుకుంటాయని అంటున్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని బికనీర్, బార్మేర్, జోధ్‌పూర్ జిలాల్లో పిల్లలు పెడుతున్నాయని వెల్లడించారు. మిడతలు ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో పంటలను దెబ్బ తీశాయి. నాగపూర్‌లో నారింజ తోటలను పాడు చేశాయి. ఖరీఫ్ పంటకు వీటి వల్ల నష్టం కలగకపోతే ఈ ఏడాది దిగుబడులు ఆశించిన విధంగా బాగా ఉండే అవకాశముంది. అయితే ఇవి పిల్లలను కని సంఖ్యాబలం పెంచుకోడానికి వర్షాలు తోడ్పడతాయని చెబుతున్నారు. మధ్యప్రాచ్య ఎడారుల్లో వర్షపాతంలో ముందు వెనుకలుండడం వల్ల మిడతలు పెరగడానికి తగిన వాతావరణం ఏర్పడిందని చెబుతున్నారు. రాజస్థాన్, గుజరాత్‌లలో ఇప్పటికే దాదాపు 2 లక్షల ఎకరాలలో పంటలను ఇవి నాశనం చేశాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News