Saturday, May 11, 2024

ఆ రెండు లక్షణాలు ఉంటే ఖచ్చితంగా టెస్టులు చేయండి: ఈటల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జ్వరం, దగ్గు, గొంతునొప్పితో పాటు న్యుమోనియా వంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా తాజా పరిస్థితులపై జిల్లా స్థాయి వైద్యాధికారులు, సూపరింటెండెంట్‌లు, పిహెచ్‌సి అధికారులు, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లకు అవగాహన కల్పించేందుకు ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ..కోవిడ్ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఇంటింటికి వెళ్లి అనుమానితులను గుర్తించాలని మంత్రి ఎఎన్‌ఎం, ఆశావర్కర్లను కోరారు. ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా వంటి రెండు లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ఎట్టి పరిస్థితులు నిర్లక్షం వద్దని, కోవిడ్‌పై వైద్యశాఖ నిరంతరం పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇంటిని కూడా వదలకుండా పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు. ముఖ్యంగా వలస కార్మికులపై మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా అదుపులోకి తీసుకొని జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొన్నటి వరకు మర్కజ్ లింక్ పరేషాన్ చేయగా ప్రస్తుతం వలస కార్మికుల అంశం ఆందోళన కలిగిస్తుందని మంత్రి గుర్తుచేశారు. ఈక్రమంలో వైద్యశాఖలో పనిచేసే ప్రతి వ్యక్తి నిరంతరంగా కృషి చేయాలని వెల్లడించారు. అదే విధంగా గ్రామాల్లో ఉన్న గర్భిణి స్త్రీలు, చిన్నారులు, వృద్ధులను గుర్తించి వారికి సమయానికి మందులు కూడా అందించాలని కోరారు. కోవిడ్ పోరులో ఆశావర్కర్లు, ఎఎన్‌ఎమ్‌లు పనితీరు అద్బుతంగా ఉందని, అదే స్పూర్తితో పనిచేస్తూ రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వైద్యశాఖపై ఉందని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ యోగితారాణా, డిఎంఇ రమేష్‌రెడ్డి, డిహెచ్ డా శ్రీనివాసరావు, టిఎస్‌ఐఎండిసి ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, కాళోజి యూనివర్సిటి వైస్ చాన్స్‌లర్ డా కరుణాకర్‌రెడ్డి, ఎక్స్‌పర్ట్ కమిటి సభ్యులు డా గంగాధర్‌లు పాల్గొన్నారు.

Minister Etela Rajender Video Conference on Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News