Saturday, April 27, 2024

దొడ్డి కొమురయ్య స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం:మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, స్వేచ్ఛ కోసం విస్నూర్ దొరకు వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని రాఫ్ట్ర ఆర్థిక, వైద్యరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహాన్నీ మంత్రి హరీశ్‌రావు, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్‌సి యెగ్గె మల్లేశంతో కలిసి ఆవిష్కరించారు. గొల్ల కురుమ సంఘం భవనానికి అంతకు ముందు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ముందుకు సాగాలని, పోరాడితే పోయేది ఏమి లేదన్న తెగింపుతో బుక్కెడు భుక్తి కోసం పోరాడిన నేలకొరిగిన తొలి పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని కొనియడారు.

గొల్లకురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గొల్లకురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెంది కులవృత్తిని ప్రోత్సహించేందుకు గొర్రెల పథకాన్ని తీసుకువచ్చామన్నారు. తెలంగాణ చరిత్ర భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బిసిల సంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. బిసిలకు ఒక శాఖను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. కోట్లాది మంది బిసిలు ఉన్నప్పటికీ కేవలం రెండు వేల కోట్లను మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారని అన్నారు. తెలంగాణాలో మాత్రం సిఎం కేసీఆర్ బిసిలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని అన్నారు. ఆత్మ గౌరవ భవనానికి రూ.300 కోట్ల ఆస్తిని ఇచ్చాడన్నారు. గత ప్రభుత్వాలు ఒక గుంట జాగా కూడా ఇవ్వ లేదని హరీశ్‌రావు విమర్శించారు.

పక్కనే ఉన్న కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నాయకుడు రేవణ్ణ కూడా సిఎం కెసిఆర్‌ను పొగిడి, గొంగడి కప్పితే…కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అతనికి నోటీస్‌లు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు దేశమంతా కెసిఆర్‌వైపు చూస్తున్నదన్నారు.కళ్యాణ లక్ష్మి కారణంగా కురుమ కులాల్లో బాల్య వివాహాలు నిలిచిపోయాయన్నారు. లాఠీలు,కేసులు చేయలేని పనిని కెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం చేసిందన్నారు.కురుమ జాతి ఎంతో నీతి కలిగిన జాతి అన్నారు. కొమరవెళ్లి మల్లన్నకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన తొలి సిఎం కెసిఆర్ అని కొనియాడారు. గొల్లకురుమ సంఘం నాయకుడు బిఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గొల్లకురుమలకు 5అసెంబ్లీ స్థానాలను కేటాయించాలన్నారు.

దొడ్డి కొమురయ్య జయంతి, వర్దంతి వేడుకలను ప్రభుత్వం కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్నీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మాణిక్‌రావు, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్,డిసింఎస్ చైర్మెన్ శివకుమార్, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం,కొమురవెళ్లి దేవస్థాన ఛైర్మన్ సంపత్‌కుమార్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు నగేష్, రాష్ట్ర నాయకుడు డాక్టర్ శ్రీహరి,క్యామ మల్లేశం,బీరయ్య యాదవ్, యువత అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు సోమశేఖర్, నగేష్, బిఆర్‌ఎస్ నాయకులు ఆత్మకూర్ నగేష్, మినాక్షి సాయికుమార్,ప్రదీప్, లాడె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News