Saturday, April 27, 2024

నూతన చట్టాలతో పౌరసేవలు

- Advertisement -
- Advertisement -

Minister-KTR

 పారదర్శకం, అవినీతి రహితం
మాకు ప్రజలే అంతిమ బాస్‌లు
మున్సిపాలిటీల్లో ఇక టీఎస్ బిపాస్
21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు
మహిళలకు ప్రత్యేక షీ టాయిలెట్లు
సీజనల్ వ్యాధుల నివారణకు హెల్త్ ప్లాన్
అవినీతికి పాల్పడినట్టు రుజువైతే విధుల నుంచి తొలగింపు
మున్సిపల్ కమిషనర్‌లు, ప్లానింగ్ అధికారుల సమావేశంలో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రజలకు అందించాల్సిన పౌరసేవలు అవినీతి రహితంగా, అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలన్న స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం అనేక నూతన చట్టాలను చేస్తున్నదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు. అందులో భాగంగానే పురపాలక శాఖలో తీసుకువస్తున్న టీఎస్ బిపాస్ ద్వారా 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులను ప్రజలకు మంజూరు చేయాల్సిందేనని, ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత పురపాలక శాఖ కమిషనర్లు, నూతన కార్పోరేషన్ల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి కెటిఆర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణనే స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. అదే స్పూర్తితో రాష్ట్ర ప్రజలకు మరిన్ని పరిపాలన ఫలాలు అందించాలన్న లక్ష్యంతో గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను కొత్తగా ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. తెలంగాణ పురపాలన పూర్తిగా పౌరుల కేంద్రంగా జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కెటిఆర్ చెప్పారు. పురపాలనలో భాగంగా ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన ఈ సందర్భంగా వారికి పిలుపునిచ్చారు.

చట్టాన్ని జాబ్ చార్ట్‌గా పరిగణించాలి…

తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పురపాలక చట్టాన్ని ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ తన విధి నిర్వహణలో జాబ్ చార్ట్ గా పరిగణించాలని మంత్రి కెటిఆర్ కోరారు. నూతన పురపాలక చట్టంలోని పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవలు, పురపాలనలో ఆన్‌లైన్ సేవలు, సాంకేతిక వ్యవస్థ వినియోగం, ఫిర్యాదుల పరిష్కారం, ఎలాంటి అవినీతికి తావులేకుండా భవన నిర్మాణాలకు అనుమతులను మంజూరు చేయడం వంటి అంశాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి కెటి రామారావు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పురపాలక సంస్థల అధికారులు, సిబ్బంది పని చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్న వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలంటే స్థానిక కమిషనర్లు తమతోపాటు తమ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, స్థానిక ప్రజలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనేది మరువరాదని హెచ్చరించారు. ప్రతి పట్టణ పారిశుధ్యం అక్కడి కమిషనర్ల ప్రాథమిక విధిగా భావించాలని, మున్సిపల్ కమిషనర్ ఉ. 4:30 గంటలకే పట్టణ పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలని ఆయన సూచించారు. మహిళలకు ప్రత్యేకంగా షీ టాయిలెట్ల నిర్మాణాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.

గ్రీన్ ప్రణాళికకు బడ్జెట్‌లో 10 శాతం

నూతన మున్సిపల్ చట్టం ప్రకారం పురపాలిక బడ్జెట్‌లో కనీసం పది శాతంతో గ్రీన్ ప్రణాళిక రూపకల్పన చేయాలని, పట్టణంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. ప్రతి పట్టణానికి శానిటేషన్ ప్లాన్‌తో పాటు గ్రీన్‌ప్లాన్ కూడా తయారు చేయాలని ఆదేశించారు. దీంతోపాటు సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన హెల్త్ ప్లాన్ తయారుచేసి ఉంచాలన్నారు. అవసరమైతే వెటర్నరీ డాక్టర్ లు, ఎంటమాలజిస్ట్‌లు ఇతర సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. పురపాలనలో అవినీతి అరికట్టేలా కఠినమైన చట్టాలు, విధానాలు రూపకల్పన చేస్తున్నామని, వీటి అమలులో కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్లకు కేటీఆర్ హెచ్చరికలు చేశారు.

ప్రజలే అంతిమ బాస్‌లు

ప్రజాస్వామ్యంలో తమందరికీ ప్రజలే అంతిమ బాస్ లు(యాజమానులు)లన్న విషయాన్ని గుర్తుంచుకొని, వారితో బాధ్యతయుతంగా ఉండాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులను, నాయకులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని మంత్రి తేల్చిచెప్పారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలను ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఏ అధికారైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలగించే అత్యంత కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ అమలును హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మానిటర్ చేస్తామని తెలిపారు. పురపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని, పౌరులతో సంబంధాలని పెంచుకునే విషయంలో మరింత చొరవ చూపించాలని కమీషనర్లను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ సమావేశానికి పురపాలకశా ఖ విభాగాధిపతులతోపాటు నూతన కార్పోరేషన్‌ల, పురపాలక సంఘాల కమీషనర్లు, హెచ్ యండిఏ, జియచ్ యంసి టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది హజరయ్యారు.

Minister KTR Meeting with Town Planning Staff

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News