Saturday, April 27, 2024

సకాలంలో కొత్త సచివాలయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణంలో ఆరు బ్లాకులను ఆయన కలియ తిరిగి ఫుట్టింగ్ పనులను పరిశీలించారు. బ్లాక్‌ల వారీగా పనిని విభజించి ఒక్కో బ్లాక్‌కు ఒక్కో టీమ్ ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. గతంలో ఆదేశించిన విధంగా సైట్‌లో ఆయా విభాగాల ఇంజనీర్లు ఉన్నారో లేదోనని మంత్రి తనిఖీ చేశారు. సెక్రటేరియట్ నిర్మాణంలో పనిచేస్తున్న యువ ఇంజనీర్లతో ముచ్చటించిన మంత్రి వేముల అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ కెరియర్ లో చేస్తున్న గొప్ప ప్రాజెక్టుగా ఈ నిర్మాణం గుర్తుండి పోతుందని, మనసుపెట్టి పనిచేయాలని యువ ఇంజనీర్లలో ఆయన ఉత్సాహాం నింపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశానుసారం నిర్ణీత గడువులో సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇంకా నిర్మాణం పూర్తికి పది నెలల గడువే ఉందని, దానిని దృష్టిలో పెట్టుకుని సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆయన సూచించారు. 10 రోజుల్లో అన్ని ఫుట్టింగ్‌లు పూర్తి కావాలని, ఆరు బ్లాకులకు గాను ఆయా బ్లాక్ అన్ని విభాగాల ఇంజనీర్లు ఆరు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. అందులో ఆర్ అండ్ బి, నిర్మాణ సంస్థ, ఆర్కిటెక్ట్ ఇలా మూడు విభాగాల సిబ్బంది ఉండాలన్నారు.
ప్రతిరోజు వర్క్ ప్రోగ్రెస్ పరిశీలిస్తా…
ప్రతిరోజు పని షెడ్యూల్, పని పురోగతిని అందులో సమీక్షించుకోవాలని, గ్రూపులో తనను కూడా యాడ్ చేయాలని, రోజు వర్క్ ప్రోగ్రెస్ పరిశీలిస్తానని మంత్రి పేర్కొన్నారు. అలసత్వం వహించకుండా అన్ని పనులు నిర్ణీత సమయంలో, సమన్వయంతో పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పినట్లు నాణ్యతతో పనులు జరగాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్.ఈ సత్యనారాయణ, పలువురు ఆర్ అండ్ బి అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్‌లు పలువురు పాల్గొన్నారు.

Minister Vemula Prashanth inspects New Secretariat works

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News